అనంతపురంలో 26కు చేరిన కరోనా కేసులు

18 Apr, 2020 08:02 IST|Sakshi

మరో 5 పాజిటివ్‌ కేసులు

ఈ రెండు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా  

సాక్షి, అనంతపురం: జిల్లాలో మరో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా వైరస్‌ బారిన పడిన వారిలో కళ్యాణదుర్గానికి చెందిన ముగ్గురు, హిందూపురానికి చెందిన ఇద్దరు ఉన్నారు. దీంతో ఈ రెండు ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో రెడ్‌జోన్‌లు ప్రకటించి, పాజిటివ్‌ వచ్చిన వారి సన్నిహితుల వివరాలపై ఆరా తీస్తున్నారు. వీరికి కాంటాక్ట్‌లో ఉన్న 200 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు నమూనాలు సేకరించారు. ఇక జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నాటికి 26 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. అందులో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

మరో ఇద్దరు గురువారం సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అయ్యారు. తాజాగా వైరస్‌ బారిన పడిన వారిలో కళ్యాణదుర్గం మండలం మానిరేవుకు చెందిన 55 ఏళ్ల మహిళ, 20 ఏళ్ల మహిళతో పాటు కళ్యాణదుర్గం చెందిన 48 ఏళ్ల మహిళతో పాటు హిందూపురం హస్నాబాద్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి, పైప్‌లైన్‌ రోడ్డుకు చెందిన మరో 30 ఏళ్ల వ్యక్తి ఉన్నారు.

‘పురంలో పరిస్థితి అదుపులోనే ఉంది’ 
హిందూపురం: కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నప్పటికీ హిందూపురంలో పరిస్థితి అదుపులోనే ఉందని కోవిడ్‌–19 జిల్లా ప్రత్యేక అధికారి విజయానంద్‌ తెలిపారు. జిల్లాలో 26 మంది కరోనా బారిన పడగా, వారిలో హిందూపురం ప్రాంత వాసులే 16 మంది ఉన్నారని.. వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ ద్వారా 400 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం ఆయన కలెక్టర్‌ గంధం చంద్రుడు, డీఐజీ కాంతి రాణా టాటా, ఎస్పీ సత్యయేసుబాబు, జేసీ డిల్లీరావుతో కలిసి స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో సమీక్షించారు. అనంతరం  మాట్లాడుతూ    హిందూపురంలో కరోనా నియంత్రణ చర్యలన్నీ జేసీ డిల్లీరావు ఆధ్వర్యంలో సాగుతాయన్నారు. రెడ్‌జోన్‌ ఏరియాల్లో ఆంక్షలు కఠినతరం చేశామని, రెడ్‌జోన్‌లోని వారి ఇంటివద్దకే నిత్యావసరాలు పంపుతున్నామన్నారు.  

క్వారంటైన్‌ కేంద్రాల్లో  పూర్తి సౌకర్యాలు: కలెక్టర్‌ 
అనంతపురం: జిల్లాలోని 32 క్వారంటైన్‌ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కలి్పస్తున్నామని కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు.  32 క్వారంటైన్‌ కేంద్రాల్లో 1,941 గదులు అందుబాటులో ఉన్నాయరన్నారు. ఇందులో 7,285 పడకలు ఏర్పాటుకు వీలుండగా శుక్రవారం నాటికి 3,746 పడకలు సిద్ధం చేశామన్నారు. క్వారంటైన్‌ కేంద్రాల నుంచి శుక్రవారం 24 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 417 మంది ఉన్నారన్నారు.  

కరోనా కట్టడిలో నేనూ భాగస్వామినవుతా 
అనంతపురం: కరోనా కట్టడి కార్యక్రమాల్లో తాను భాగస్వామినవుతానని, అందుకు అవకాశం కలి్పంచాలని ట్రైనీ ఐఎఫ్‌ఎస్‌ చైతన్య కలెక్టర్‌ గంధం చంద్రుడును కోరారు. దీంతో కలెక్టర్‌ ఆయన్ను హిందూపురం కంటైన్మెంట్‌ మేనేజ్‌మెంట్‌ నోడల్‌ అధికారి(డీఎఫ్‌ఓ)కి సహాయకునిగా నియమించారు. పుట్టపర్తికి చెందిన చైతన్య ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌)కు ఎంపికై డెహ్రాడూన్‌లో శిక్షణ పొందతున్నారు. మార్చిలో స్వగ్రామానికి వచ్చిన ఆయన లాక్‌డౌన్‌తో ఇక్కడే నిలిచిపోయారు. ఈ క్రమంలో శుక్రవారం కలెక్టర్‌ను కలిసి జిల్లాలో విధులు నిర్వర్తించే అవకాశం ఇవ్వాలని కోరారు.    

మరిన్ని వార్తలు