కర్నూలులో కరోనా విజృంభన

6 Apr, 2020 08:57 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న కలెక్టర్‌ వీరపాండియన్, చిత్రంలో ఎస్పీ ఫక్కీరప్ప

జిల్లాలో తాజాగా 52 మందికి కరోనా పాజిటివ్‌ 

56కు చేరుకున్న కేసుల సంఖ్య 

బాధితుల్లో 55 మంది ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే 

మరో 156 ఫలితాల కోసం ఎదురు చూపు

కంటైన్మెంట్, బఫర్‌ జోన్లుగా  ‘పాజిటివ్‌’ ప్రాంతాలు

సాక్షి, కర్నూలు: జిల్లాలో కరోనా వైరస్‌(కోవిడ్‌–19) విజృంభిస్తోంది. మొన్నటి వరకు ఒక్క కేసు మాత్రమే నమోదైంది. శనివారం ఆ సంఖ్య నాలుగు(బనగానపల్లి–1, అవుకు–1, కర్నూలు నగరంలోని రోజావీధి–1)కు చేరింది. ఆదివారం ఏకంగా 56కు పెరిగింది. ఒకేసారి 52 కొత్త కేసులు నమోదయ్యాయని తెలుసుకుని జిల్లా ప్రజలు నిర్ఘాంతపోయారు.  ఇప్పటి వరకు 463 శాంపిళ్లను అనంతపురం, తిరుపతి ల్యాబ్‌లకు పంపగా..307 ఫలితాలు వచ్చాయి. వాటిలో పాజిటివ్‌ 56 తేలాయి. ఇంకా 156  ఫలితాలు రావాల్సి ఉంది. పాజిటివ్‌ వచ్చిన వారిలో 55 మంది ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఉన్నారు.

పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలు ఇవే.. 
జిల్లాలో పాజిటివ్‌ కేసులు 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నమోదయ్యాయి. ఇందులో కర్నూలులోని రోజావీధి, ప్రకా‹Ùనగర్, చిత్తారివీధి, ఎన్‌ఆర్‌పేట, ఖడక్‌పుర, నాగప్ప వీధి, బుధవారపేట, పార్కు రోడ్డు, కేవీఆర్‌ గార్డెన్స్, గల్లి గల్లి స్ట్రీట్, గఫార్‌ స్ట్రీట్, శ్రీలక్ష్మీనగర్‌తోపాటు మరో ఏడు ప్రాంతాలు, నంద్యాలలో దేవనగర్‌(వీసీకాలనీ), నీలి స్ట్రీట్, సలీంనగర్‌తో పాటు మరో ఏడు ప్రాంతాలు, నంద్యాల రూరల్‌లో మరో రెండు ప్రాంతాలు, ఆత్మకూరులో కిసాన్‌సింగ్‌ నగర్‌తోపాటు మరో ప్రాంతం, నందికొట్కూరులో సంఘయ్యపేట, మల్యాల గ్రామంతోపాటు మరోప్రాంతం, కోడుమూరులో చాకలివీధి, కోడుమూరు, మోమిన్‌ స్ట్రీట్, బనగానపల్లెలో తిమ్మాపురంతోపాటు మరో రెండు ప్రాంతాలు, బేతంచెర్లలో ఒక్కటి, గడివేముల, బిలకలగూడూరు, పాణ్యంలో నాలుగు, రుద్రవరంలో ఒక్క పాజిటివ్‌ కేసు నమోదైంది.

కేసులు పాజిటివ్‌గా వచ్చిన ప్రాంతాల్లో యంత్రాంగం అప్రమత్తమైంది. పట్టణాల్లో అయితే మూడు కిలోమీటర్ల వరకు కంటైన్మెంట్‌ జోన్‌గా, 5 కిలోమీటర్ల వరకు బఫర్‌ జోన్‌గా, గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు కిలోమీటర్ల వరకు కంటైన్మెంట్‌ జోన్, ఏడు కిలోమీటర్ల వరకు బఫర్‌ జోన్లుగా ప్రకటించి ఆయా ప్రాంతాల్లోకి ఇతరులు వెళ్లకుండా..ఇక్కడి వారు ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా జిల్లా ఎస్పీ డాక్టర్‌   కె.ఫక్కీరప్ప నేతృత్వంలో గట్టి బందో బస్తును ఏర్పాటు చేశారు. అయితే ఆయా ప్రాంతాల వారి నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు.

మరోవైపు ఇక్కడ పాజిటివ్‌ అయిన వ్యక్తులను ఎవరెవరు కలిశారు..వారి కుటుంబం, వారితో సన్నిహితంగా ఉన్న వారిపై దృష్టి సారించి తక్షణమే హోం ఐసోలేషన్‌లో ఉంచి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటారు. అలాగే ఆయా ప్రాంతాలను మొత్తం నాలుగు సెక్టర్లుగా విభజించి వైద్య బృందాలతో అక్కడ నివాసం ఉంటున్న వారందరికీ వైద్య పరీక్షలు చేస్తారు. ఆ ప్రాంతాల్లో క్రిమి సంహారక రసాయనాలను స్ప్రే చేయించి పరిసరాలను శుభ్రంగా ఉంచుతారు.  
బాధితుల్లో అధిక శాతం యువకులే.. 
జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం 56 కేసుల్లో అధిక శాతం యువకులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కర్నూలులో నమోదైన 11 కేసుల్లో  చిత్తారివీధిలోని వ్యక్తి(47) మినహా అందరూ 27 నుంచి 40 ఏళ్లలోపు వారే.  నంద్యాలలో ముగ్గురు కూడా 28, 30, 37 ఏళ్ల వయస్సు ఉన్న వారు, ఆత్మకూరులో 17 ఏళ్ల యువకుడు, కోడుమూరులో 25, 30 ఏళ్ల వయస్సు గల వారికి, పాణ్యంలో 33 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్‌ సోకింది. ఇందులో అధిక శాతం ఢిల్లీలోని ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే ఉండటం మరింత కలవర పెడుతోంది.

అందుబాటులో టెలీ మెడిసిన్‌.. 
రాష్ట్రంలోనే ప్రథమంగా జిల్లాలో టెలీ మెడిసిన్‌ను అందుబాటులోకి తెచ్చామని కలెక్టర్‌ వీరపాండియన్‌ వివరించారు. సందేహాలను 1077 నంబర్‌కు ఫోన్‌ చేసి చెబితే నిపుణులైన వైద్యులు నివృత్తి చేస్తారన్నారు. అదే విధంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 9441300005కు లేదంటే 104కు కాల్‌ చేసి కరోనాపై ఏమైనా సమస్యలు ఉంటే తెలుపవచ్చన్నారు.

స్వీయ నిర్బంధం పాటించాలి..
కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ విజ్ఞప్తి చేశారు. ఎన్ని కేసులు నమోదైనా వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. మొదటి దశలో శాంతిరామ్, రెండో దశలో విశ్వభారతి, మూడో దశలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి, నాలుగో దశలో తిరుపతిలోని పద్మావతి ఆసుపత్రిలో చికిత్స చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నాలుగో దశ అత్యంత క్రిటికల్‌ రోగులకు మాత్రమే వైద్యం చేస్తారని వివరించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 50 ఐసోలేషన్‌ వార్డులు, 1,535 క్వారంటైన్‌ వార్డులు ఉన్నాయని.. వీటిని ఇటీవల 5 వేలకు పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.

ప్రస్తుతం జిల్లాలో 600 మంది క్వారంటైన్లలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులతో కలిపి కరోనా ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తామని వివరించారు.జిల్లాలో ‘కరోనా’ నివారణకు లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా అమలు చేయాలని, మెడికల్‌ షాపులు తప్ప మిగతా అన్నింటినీ బంద్‌ చేయించాలని  మండలాధికారులను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కర్నూలు, నంద్యాల, బనగానపల్లెల్లో కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు