కరోనా: నిలకడగా పాజిటివ్‌ వ్యక్తుల ఆరోగ్యం 

13 Apr, 2020 10:27 IST|Sakshi
ఒంగోలు ఇస్లాంపేటలో సోడియం హైపో క్లోరైడ్‌ను స్ప్రే చేస్తున్న నగరపాలక శానిటేషన్‌ సిబ్బంది

ఆదివారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు

23 శాంపిల్స్‌ నెగిటివ్‌గా నిర్ధారణ

ఊపిరి పీల్చుకున్న అధికారులు 

సాక్షి, ఒంగోలు: జిల్లాలో ఆదివారం ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని రోజులుగా, ప్రతి రోజు కోవిడ్‌ 19 పాజిటివ్‌ కేసులు వస్తుండటంతో క్వారంటైన్‌ ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు, ఆదివారం ఎటువంటి పాజిటివ్‌ కేసులు రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 23 శాంపిల్స్‌కు సంబంధించిన నివేదికలు జిల్లాకు అందితే వాటిలో అన్నీ నెగిటివ్‌గా వచ్చాయి. జీజీహెచ్, ఒంగోలు సంఘమిత్ర, కిమ్స్‌ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‌ 19 పాజిటివ్‌ వ్యక్తుల ఆరోగ్యం నిలకడగా ఉంది.

వీరంతా చికిత్సకు సహకరిస్తున్నట్లు జీజీహెచ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ డి.శ్రీరాములు తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో పాజిటివ్‌ వచ్చిన వారికి మళ్లీ స్వాబ్‌లు తీసి, నెగిటివ్‌గా వస్తే డిశ్చార్జి చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ జిల్లాలో 832 శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం సేకరించారు. వీటిలో 650 శాంపిల్స్‌కు సంబంధించిన నివేదికలు జిల్లా అధికారులకు అందాయి. వీటిలో 41 కేసులు ఇప్పటి వరకూ పాజిటివ్‌గా వచ్చాయి. నెగిటివ్‌గా 609 కేసులు వచ్చాయి. మరో 182 శాంపిల్స్‌కు సంబంధించిన నివేదికలు ల్యాబ్‌ల నుంచి అందాల్సి ఉంది

ఆటోలో కలెక్టరేట్‌కు చేరిన పీపీఈ సూట్‌లు  

క్వారంటైన్‌లో అనుమానితులు
ఇప్పటి వరకూ జిల్లాకు 960 మంది విదేశాల నుంచి వచ్చారు. వీరిలో 28 రోజులు క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న వారు 633 వరకూ ఉన్నారు. వీరితో ముగ్గురు వ్యక్తులు ఇప్పటి వరకూ దగ్గరగా ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరికి కూడా 28 రోజుల క్వారంటైన్‌ ముగిసింది. ఢిల్లీ నుంచి 101 మంది మత ప్రార్థనల్లో పాల్గొని జిల్లాకు వచ్చారు. వీరితో దగ్గరగా ఉన్న 625 మందిని గుర్తించి క్వారంటైన్‌ చేశారు. ఇప్పటి వరకూ జిల్లాలో ప్రైమరీ కాంటాక్ట్స్‌ ద్వారా 154 మందిని, సెకండరీ కాంటాక్ట్స్‌ ద్వారా 471 మందిని క్వారంటైన్‌ చేశారు. 
ఇంటింటి సర్వే ద్వారా ఇప్పటి వరకూ 18,271 మంది ఆరోగ్య వివరాలను నమోదు చేశారు. 104 కాల్‌ సెంటర్‌ ద్వారా ఇప్పటి వరకూ జిల్లాలో 40 మందిని క్వారంటైన్‌లకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు.

జిల్లాలో రెడ్‌ జోన్‌లుగా గుర్తించిన ప్రాంతాల్లో 41,946 మంది ప్రజలను కంటైన్‌మెంట్‌ చేశారు. ఇప్పటి వరకూ జిల్లాలో 11 కోవిడ్‌ 19 హాట్‌ స్పాట్స్‌ను గుర్తించారు. కోవిడ్‌ హాస్పిటల్‌ అయిన జీజీహెచ్‌లో 83 బెడ్‌లు, 67 ఐసీయూ బెడ్‌లను ఏర్పాటు చేశారు. 826 ఐసోలేషన్‌ గదులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ 460 మంది వివిధ అనుమానిత కోవిడ్‌ 19 లక్షణాలతో వైద్య చికిత్స పొందుతున్నారు. జిల్లాలో 3,307 పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు, వైద్య సిబ్బంది ఉపయోగించే ఎన్‌ 95 కిట్లు 6,209 ఉన్నాయి. 1,47,111 చేతి గ్లోవ్‌లు, సర్జికల్‌ మాసు్కలు 1,76,310, శానిటైజర్‌లు 31,990, వెంటిలేటర్లు 40 వరకూ అందుబాటులో ఉన్నాయి.prak

మరిన్ని వార్తలు