ప్రైవేట్‌ ఆస్పత్రులూ ప్రభుత్వ పరిధిలోకి

31 Mar, 2020 02:45 IST|Sakshi

పడకలు, వెంటిలేటర్లు, సిబ్బంది ప్రభుత్వ పర్యవేక్షణలోనే ప్రైవేటు యాజమాన్యాలకు సర్కారు ఆదేశాలు 

తొలిదశలో చికిత్స అందించనున్న ఆసుపత్రులు 450

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్‌ ఆస్పత్రులు సైతం కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేట్‌  పరిధిలోని వైద్య కళాశాలలు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, నర్సింగ్‌ హోంలను కూడా ప్రభుత్వ పరిధిలోకి తెస్తూ ఆదేశాలు జారీ చేసింది. జాతీయ విపత్తుల నివారణ చట్టం 2005 (సెక్షన్‌ 10(2)1తో పాటు అంటువ్యాధుల నివారణ చట్టం 1897 ప్రకారం అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు, ప్రభుత్వేతర ఆస్పత్రులు, ట్రస్ట్‌ల పేరుతో నిర్వహిస్తున్న ఆస్పత్రులు ఇకపై సర్కారు పరిధిలో పనిచేయాలని పేర్కొన్నారు. తొలిదశలో 450 ఆస్పత్రులను ప్రభుత్వ పరిధిలోకి తేవాలని నిర్ణయించారు. పరిస్థితులను బట్టి ఈ సంఖ్య పెంచుతారు.  దేశవ్యాప్తంగా పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో ఎపిడెమిక్‌ డిసీజ్‌ (కోవిడ్‌) రెగ్యులేషన్‌ 2020 ప్రకారం చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి పేర్కొన్నారు.

ఉత్తర్వుల్లో ముఖ్యాంశాలు ఇవీ...
ప్రైవేట్‌/ నాన్‌గవర్నమెంట్‌ మెడికల్, హెల్త్‌ ఇన్‌స్టిట్యూషన్స్, అందులో పనిచేసే సిబ్బంది, వసతులు, ఐసొలేషన్‌ పడకలు, రూములు, ఐసీయూ వార్డులు, వెంటిలేటర్లు, టెస్టింగ్‌ ల్యాబొరేటరీలు, ఫార్మసీలు, శవాగారాలు, ఎక్విప్‌మెంట్, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీములు ప్రభుత్వ పరిధిలో కరోనా బాధితులకు సేవలు అందించాలి.
ఎలాంటి వసతుల వినియోగానిౖకైనా ప్రభుత్వ పరిధిలోకి వచ్చే వారికే ప్రాధాన్యం ఉండాలి
ప్రభుత్వేతర, ప్రైవేటు సంస్థలు నిర్వహించే ఏ పనులైనా ప్రభుత్వానికి ఉపయోగపడేవి అయి ఉండాలి. జిల్లా స్థాయి సంస్థలు స్థానిక అధికారుల ఆదేశాలపై స్పందించాలి
స్పెషలిస్టు డాక్టర్లు, నర్సులు, ఇతర మెడికల్, నాన్‌మెడికల్‌ సిబ్బందిని ప్రభుత్వం ఎక్కడైనా నియమించవచ్చు. 

బాధితులందరికీ వైద్యమే లక్ష్యం
విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాం. కరోనా బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. చికిత్స అందించేందుకు ప్రైవేట్‌ ఆస్పత్రులను కూడా తీసుకోవాలని నిర్ణయించాం.  
 – డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ, వైద్య ఆరోగ్యశాఖ

ఆరోగ్యశ్రీ పరిధిలో లేనివి కూడా..
తొలిదశలో ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను కరోనా చికిత్స కోసం తీసుకుంటున్నాం. పరిస్థితిని బట్టి మండల, నియోజక వర్గ స్థాయి ఆస్పత్రులను కూడా తీసుకుంటాం. నెట్‌వర్క్‌ పరిధిలో ఉన్నా, లేకున్నా కరోనా వైద్యం కోసం ప్రభుత్వం తీసుకుంటుంది. అక్కడ సిబ్బంది కూడా ప్రభుత్వ పరిధిలోనే పని చేయాలి.    
– డా.ఎ.మల్లికార్జున, సీఈవో, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌

అంతా భాగస్వాములు కావాలి 
విపత్కర సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ అనే తారతమ్యం ఉండకూడదు. ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తున్నాం. ప్రైవేటు ఆస్పత్రుల భాగస్వామ్యంతో మెరుగైన సేవలు అందించవచ్చు.    
– డా.డి.జయధీర్, కన్వీనర్, ప్రభుత్వ వైద్యుల సంఘం

మరిన్ని వార్తలు