ఆస్పత్రికా? ఇంటికా?

19 Apr, 2020 04:31 IST|Sakshi

ర్యాపిడ్‌ టెస్ట్‌లతో పది నిమిషాల్లో ఫలితం

టెస్టులలో ఐజీఎం, ఐజీజీ అని రెండు రకాలు

ఐజీఎం పాజిటివ్‌ వస్తేనే ఆస్పత్రికి

ఐజీజీ పాజిటివ్‌ ఉంటే యాంటీబాడీస్‌ వృద్ధి చెందినట్టు

లక్ష కిట్‌లను ఏపీ సర్కారు దక్షిణ కొరియా నుంచి రప్పించింది. దీంతో ఎక్కువ మందికి కరోనా టెస్టులు చేసే అవకాశం వచ్చింది. 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ర్యాపిడ్‌ యాంటీబాడీస్‌ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. లక్ష కిట్‌లను ఏపీ సర్కారు దక్షిణ కొరియా నుంచి రప్పించింది. దీంతో ఎక్కువ మందికి కరోనా టెస్టులు చేసే అవకాశం వచ్చింది. ఈ టెస్టులు కరోనా లక్షణాలు ఉన్నవారికి, రెడ్‌జోన్‌లో ఉన్నవారికి, హైరిస్క్‌ గ్రూపులకు మాత్రమే చేస్తారు. ఈ టెస్టులతో బాధితులను గుర్తించి చికిత్సకు పంపడమా, లేదా ఐసొలేషన్‌లో ఉంచడమా అనేది ప్రాథమిక దశలోనే తేల్చవచ్చు. పది నిముషాల్లో ఫలితాలు వస్తున్నందున ఎక్కువ మందికి టెస్టులు చేసి లక్షణాలను గుర్తించే అవకాశాలు ఉంటాయి. అయితే ర్యాపిడ్‌ టెస్టుల్లో ఐజీఎం (ఇమ్యునోగ్లోబులిన్‌ మ్యూ) అనేది ఒకటి, ఐజీజీ (ఇమ్యునోగ్లోబులిన్‌ గామా) అనేది మరొకటి ఉంటుంది. ఐజీఎం పాజిటివ్‌ వస్తే వీరిని వైరాలజీ టెస్టుకు పంపి.. అనంతరం చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తారు. ఐజీఎం, ఐజీజీ రెండూ పాజిటివ్‌ వస్తే వీరికి ఇన్ఫెక్షన్‌ ఉన్నా దానికి తగ్గట్టు యాంటీ బాడీస్‌ కూడా వృద్ధి అయి నట్టని నిపుణులు చెబుతున్నారు. 

టెస్టుల ఫలితాలు పరిశీలిస్తే...
► ఐజీఎం పాజిటివ్‌ వచ్చి ఐజీజీ నెగిటివ్‌ వస్తే వారిని వెంటనే ఆర్టీపీసీఆర్‌ (వైరాలజీ ల్యాబొరేటరీ టెస్టు)కు పంపిస్తారు.
► ఆర్టీపీసీఆర్‌ టెస్టులో కూడా పాజిటివ్‌ వస్తే వారిని ఆస్పత్రిలో చేరుస్తారు. నెగిటివ్‌ వస్తే హోం ఐసొలేషన్‌లో ఉంచుతారు.
► ఐజీఎం, ఐజీజీ రెండూ నెగిటివ్‌వస్తే వారిని ఇంటికి పంపిస్తారు. వారు హోం ఐసొలేషన్‌లో ఉంటే మంచిది.
► ఐజీఎం నెగిటివ్‌ వచ్చి, ఐజీజీ పాజిటివ్‌ వస్తే రెండు వారాలు హోం ఐసొలే షన్‌లో ఉండాలి. వీరినే కోవిడ్‌ వారియర్స్‌గా పిలు స్తారు. అంటే వైరస్‌ సోకినా దాన్నుంచి బయటపడి యాంటీబాడీస్‌ అభివృద్ధి అయిన వారి కింద లెక్క.
► ఐజీఎం పాజిటివ్‌ వచ్చి, ఐజీజీ కూడా పాజిటివ్‌ వస్తే.. కరోనా లక్షణాలున్న వారు, 60 ఏళ్లు దాటిన వారు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారిని ఆస్పత్రికి పంపిస్తారు.
► వైరస్‌ ఉన్నా లక్షణాలు కనిపించక పోతే (ఎసిం ప్టమాటిక్‌) వారిని సింగి ల్‌ రూమ్‌ ఐసొలేషన్‌లో ఉంచుతారు. 

కరోనా వైరస్‌ నియంత్రణకు ‘ఫ్లాస్మా థెరపీ’  
మంగళగిరి ఎయిమ్స్‌లో ఏర్పాటుకు కేంద్రానికి వినతి  
మంగళగిరి: కరోనా వైరస్‌ నియంత్రణకు మంగళగిరిలోని ఆల్‌ ఇండియా మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో కొత్తగా ఫ్లాస్మా థెరపీ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రవికుమార్‌ తెలిపారు. ఏపీలో తొలిసారిగా ఫ్లాస్మాథెరపీ నిర్వహించడంతో పాటు వైరస్‌ వ్యాధుల నివారణకు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసినట్లు శనివారం తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫ్లాస్మాథెరపీ ప్రాధాన్యం పెరిగిందన్నారు. ఫార్మాకో ఇమ్యూనో సెంటర్‌ఫర్‌ ఎక్స్‌లెన్స్‌  ఏర్పాటుతో థెరపీ చాలా సులువుగా ఉంటుందన్నారు. 

>
మరిన్ని వార్తలు