కరోనాపై పోరుకు కదం తొక్కుతూ..

13 Apr, 2020 03:09 IST|Sakshi
కరోనా వ్యాప్తి చెందకుండా ఒంగోలులోని ఓ ఇంట్లో స్ప్రే చేస్తున్న పారిశుధ్య కార్మికుడు

ఊరూరా ప్రభుత్వ యంత్రాంగం

క్వారంటైన్‌ల నిర్వహణ నుంచి ఇంటింటి సర్వే వరకూ అన్నీ తామై..

లాక్‌డౌన్‌ అమల్లో పోలీసులు, వైద్య సిబ్బంది పాత్ర అసాధారణం

ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వలంటీర్లు, ఆశాలు, పారిశుధ్య కార్మికులు

కరోనా వైరస్‌ భయపెడుతున్న సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమవ్వగా.. లక్షలాది మంది ప్రభుత్వ సిబ్బంది మాత్రం ప్రాణాలకు తెగించి ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య వివరాలు ఆరా తీస్తూ.. అవసరమైన సాయం అందిస్తూ మేమున్నామంటూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. అధికారులు, పోలీసులు, వైద్యులు, నర్సులు, ఆశా కార్యకర్తలు, వలంటీర్లు, పారిశుధ్య కార్మికులు.. ఇలా ప్రతి ఒక్కరూ సామాన్యులకు రక్షణ కవచంలా ఒకసైన్యంలా కరోనాపై పోరాడుతున్నారు.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు గ్రామ గ్రామానా లక్షలాది మందితో కూడిన ప్రభుత్వ యంత్రాంగం పోరాటం చేస్తోంది. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అహర్నిశలు శ్రమిస్తోంది. దాదాపు మూడు లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు గ్రామాల్లో ప్రతి ఇంటినీ చుట్టేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడం, ఢిల్లీ నుంచి వచ్చిన వారిని కనుక్కోవడం, వారి నుంచి ఎంతమందికి వైరస్‌ సోకిందో తెలుసుకోవడం, వారిని ఆస్పత్రులకు చేర్చడం, ఇంటింటా సర్వేలు ఇలా ఒక్కటేమిటి.. ఉదయం లేచిన దగ్గర్నుంచీ రాత్రి వరకు కరోనా మీద పోరాటమే. విపత్కర పరిస్థితుల్లో మేమున్నామంటూ ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న భరోసాకు ప్రతి ఒక్కరూ ముగ్ధులవుతున్నారు. ఇక వైద్యులు, నర్సులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే లాక్‌డౌన్‌ అమల్లో పోలీసుల కృషి మరువలేనిది. 56 వేల మంది పైచిలుకు పారిశుధ్య కార్మికులు చేస్తున్న కృషి కూడా వర్ణించలేనిది. కరోనాపై పోరులో సామాన్యులకు రక్షణ కవచంలా ముందుండి నడిపిస్తున్న అధికార యంత్రాంగం చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. ప్రతి జిల్లాలోనూ క్వారంటైన్‌ కేంద్రాల నిర్వహణ, వారికి భోజన సదుపాయం, ఇంటింటా సర్వే, కరోనా లక్షణాలున్న వారిని గుర్తించడం వంటి విధుల్లో సైనికుల్లా పనిచేస్తున్న వారి వివరాలను జిల్లాల వారీగా ఒక్కసారి పరిశీలిస్తే..   
 – సాక్షి, అమరావతి

మూడుసార్లు వచ్చి ఆరోగ్య విషయాలు అడిగారు
కరోనా అలజడి మొదలైనప్పుడు భయాందోళనలతో ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుండటంతో భయం పోయింది. వలంటీర్, ఏఎన్‌ఎం ఇప్పటివరకు మా ఇంటికి మూడుసార్లు వచ్చి ఆరోగ్య విషయాలు అడిగారు. ప్రభుత్వం రూ.1000 ఆర్థిక సాయం, ఉచితంగా రేషన్‌ సరుకులు అందించింది. ఊరిలోకి ఎవరో బయట నుంచి వచ్చారని తెలియగానే వారి ఇంటికి పీహెచ్‌సీ వైద్యులు, పోలీసులు, రెవెన్యూ వాళ్లు వెళ్లి 14 రోజులు బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. అంతేకాకుండా తరచూ వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ ఉండేవారు. ఇంత పకడ్బందీగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ధైర్యంగా జీవిస్తున్నాం. 
– పాలింగి శ్రీనివాస్, పడమర కండ్రిగ, కపిలేశ్వరపురం మండలం, తూర్పుగోదావరి

కరోనా వైరస్‌కు ఏమాత్రం వెరవకుండా ప్రతి గ్రామంలోనూ వీధులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేలా చూస్తున్న పారిశుధ్య కార్మికులకు విశాఖలో సన్మానం చేస్తున్న పంచాయతీ రాజ్‌ అధికారులు  

పక్కాగా ఇంటింటి సర్వే
ఇంటింటి సర్వేను పక్కాగా చేస్తూ ఇంట్లో ఉన్న అందరి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నాం. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తెలుసుకుంటున్నాం. తర్వాత మా దగ్గర ఉన్న ఫోన్‌ యాప్‌లో ఆ వివరాలన్నీ నమోదు చేస్తున్నాం. వాటిని వైద్యులు పరిశీలిస్తున్నారు. ప్రజలు సహకరిస్తూ అడిగిన వివరాలన్నీ చెబుతుండటం వల్ల సర్వే వేగంగా జరుగుతోంది.    
– శ్యామ్‌ సుందరి, పీపీ యూనిట్, ఏఎన్‌ఎం, మచిలీపట్నం, కృష్ణా జిల్లా

సమగ్రంగా సర్వే చేపడుతున్నాం
మూడో దశ సర్వేను సమగ్రంగా చేస్తున్నాం. నా పరిధిలోని ఇళ్లకు స్థానిక ఆశా కార్యకర్తతో వెళ్లి దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించాం. ఈ డేటాను మాకు ఇచ్చిన యాప్‌లో నమోదు చేశాను. 
– డొప్ప గోపాల్, గ్రామ వలంటీర్, జాడుపూడి, కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లా 

బాధితులను గుర్తించి చికిత్స 
వైఎస్సార్‌ జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు పులివెందులలో వెలుగుచూసింది. అతడు ఢిల్లీ మర్కజ్‌కి వెళ్లి రావడంతో అతడిని క్వారంటైన్‌కు తరలించాం. అతడు ఎవరెవరిని కలిశాడో గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం. కరోనా వైరస్‌ సోకిన యువకుడి తల్లిదండ్రులు, అన్నా వదినలను కడపకు తీసుకెళ్లి పరీక్షలు చేయగా వారికి పాజిటివ్‌గా తేలింది. తండ్రికి వ్యాధి లక్షణాలు లేకపోయినా పరీక్షలు చేస్తున్నారు. ఇప్పుడు వారు ఫాతిమా వైద్య కళాశాలలో ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. 
– మల్లేష్, వైద్యాధికారి, మైదుకూరు, వైఎస్సార్‌ జిల్లా

మరిన్ని వార్తలు