ఏపీ సెట్లకూ కరోనా కష్టాలు

30 Mar, 2020 03:47 IST|Sakshi

లాక్‌ డౌన్‌తో ఎక్కడికక్కడ నిలిచిన ఏర్పాట్లు

ఆగిన టీసీఎస్‌ హెల్ప్‌ లైన్‌ కేంద్రాలు

మందకొడిగా దరఖాస్తులు

ఎంసెట్‌ సహా అన్ని పరీక్షల రీ షెడ్యూల్‌ తప్పదంటున్న అధికారులు  

సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ సహా వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలపై కూడా తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, బీఈడీ, బీపీఈడీ తదితర కోర్సులకు నిర్వహించే ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్‌సెట్‌ సహా వివిధ సెట్ల పరీక్షలు నిర్ణీత సమయంలో నిర్వహించగలుగుతామా? లేదా అన్న సందేహాలు అధికారులు వ్యక్తపరుస్తున్నారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో పరీక్షల ఏర్పాట్లు నిలిచిపోయాయి. మరోపక్క ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ఏప్రిల్‌ 5, 7, 9 తేదీల్లో జరగాల్సి ఉండగా జాతీయ పరీక్షల మండలి (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) వాయిదా వేసింది. తదుపరి షెడ్యూల్‌ను 31వ తేదీ తరువాత విడుదల చేస్తామని ప్రకటించింది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించాల్సి ఉన్న నీట్‌ను కూడా మే 3వ తేదీ నుంచి నెలాఖరు వరకు వాయిదా వేసింది. ఏప్రిల్‌ 15 తరువాత పరిస్థితులను అంచనా వేశాక షెడ్యూల్‌ను  ప్రకటించనుంది.

ముందుకు సాగని కార్యకలాపాలు..
- రాష్ట్రంలో ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్‌లకు ఉన్నత విద్యామండలి ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేసింది.
- ఎంసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు మార్చి 29 వరకు ఉండగా దాన్ని ఏప్రిల్‌ 5 వరకు పొడిగించారు. 
- ఈసెట్, ఐసెట్‌ గడువును ముందు ఏప్రిల్‌ 2 వరకు నిర్ణయించగా.. దాన్ని ఏప్రిల్‌ 9 వరకు పొడిగించారు.
- లాక్‌డౌన్‌ కారణంగా దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. అందువల్ల గడువు మరోసారి పొడిగించాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు.
- సెట్ల నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాలు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అత్యవసర కార్యకలాపాలు మినహా మిగతావన్నీ నిలిచిపోయాయి.
- ఈ పరీక్షలకు సంబంధించి ఆన్‌లైన్‌ సేవలందిస్తున్న టీసీఎస్‌లో కూడా పరిమిత సంఖ్యలో ఉద్యోగులనే అనుమతిస్తుండడంతో హెల్ప్‌లైన్‌ సెంటర్లపై ప్రభావం పడింది.
- ఆయా ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నల రూపకల్పన వంటి ప్రక్రియలు కూడా ప్రస్తుతం మధ్యలో నిలిచిపోయినట్లు మండలి వర్గాలు పేర్కొంటున్నాయి. 
- జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ వంటి పరీక్షలు కూడా వాయిదా పడిన నేపథ్యంలో ఎంసెట్‌ తదితర పరీక్షలను కూడా రీ షెడ్యూల్‌ చేయాల్సి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
- దీనిపై ఆయా ఉమ్మడి ప్రవేశ పరీక్షల కమిటీలు సమావేశమై నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని మండలి ఉన్నతాధికారి ఒకరు వివరించారు.

పరీక్షల తేదీలు ఇలా ఉన్నాయి
ఎంసెట్‌ (ఇంజనీరింగ్‌): ఏప్రిల్‌ 20 నుంచి 23 వరకు
ఎంసెట్‌ (అగ్రికల్చర్‌): ఏప్రిల్‌ 23, 24
ఈసెట్‌: ఏప్రిల్‌ 30, ఐసెట్‌: ఏప్రిల్‌ 27
పీజీఈసెట్‌: మే 2, 3, 4
ఎడ్‌సెట్‌: మే 9, లాసెట్‌: మే 8
పీఈసెట్‌: మే 5, 6, 7, 8 

మరిన్ని వార్తలు