సేవకులకు సలామ్‌ త్యాగాలకు వందనం

30 Mar, 2020 03:39 IST|Sakshi

కరోనా యుద్ధంలో సైన్యంలా వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర పౌర యంత్రాంగం

కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో అడుగు బయటపెట్టడానికి అందరూ భయపడిపోతుండగా.. కొందరు మాత్రం కుటుంబాలకు దూరంగా ప్రజలకు సేవ చేస్తున్నారు. తమ ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఆరోగ్య వివరాలు సేకరిస్తూ.. కరోనా బారిన పడినవారికి వైద్యం అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. వారే వైద్యులు, అధికారులు, వలంటీర్లు, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు.
– సాక్షి, అమరావతి 

పిల్లలను కన్నవారింటికి..
ఈమె శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్ద తామరాపల్లికి చెందిన వలంటీర్‌ సంజీవిని కుమారి. కుమారికి 7వ తరగతి చదువుతున్న కుమార్తె, అంగన్‌వాడీకి వెళ్తున్న మూడేళ్ల కుమారుడు ఉన్నారు. అయితే కరోనా నివారణ చర్యల్లో భాగంగా తన పరిధిలోని కుటుంబాలకు అవగాహన కల్పించడం, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం, విదేశాల నుంచి వచ్చిన వారికి అవగాహన కల్పించి హోమ్‌ క్వారంటైన్‌లో ఉండేలా చేయడం చేస్తున్నారు. ఈ విధులతో పిల్లలకు ఇబ్బంది తలెత్తుతుందని భావించి పిల్లలను తన కన్నవారి ఇంటికి పంపించి సేవలు కొనసాగిస్తున్నారు.

ముట్టుకోవాలంటే పిల్లలు భయపడుతున్నారు 
ఉదయం నుంచి రాత్రి వరకు మా కుటుంబాలను పక్కన పెట్టి పౌర సేవల్లో గడుపుతున్నాం. కరోనా భయంతో భార్య, పిల్లలు నన్ను ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు. కొంత బాధ వేసినా ప్రజలకు సేవ చేయడం ఆనందంగా ఉంది.     
– జబ్బార్‌మియా, శానిటరీ ఇన్‌స్పెక్టర్, తాడిపత్రి

తాత మరణించినా విధుల్లోనే..  
ఇతని పేరు మొలతాటి గిరీష్‌. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు రూరల్‌ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ముత్తుకూరులో ఉంటున్న గిరీష్‌  వాళ్ల తాత శ్రీరామచెన్నయ్య గత వారం అనార్యోగంతో మరణించాడు. కరోనా నేపథ్యంలో సెలవు పెట్టలేకపోయాడు. అంత్యక్రియలకు కూడా ఆఖరి నిమిషంలో వెళ్లి వచ్చాడు. అలాగే తల్లి శశికళకు ఆరోగ్య పరిస్థితి సరిగా లేకున్నా కూడా.. విధులకు హాజరై ప్రజలకు సేవ చేస్తున్నాడు.

లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి రాత్రి, పగలు విధుల్లో నిమగ్నమైన పోలీసులు.. ఇంటికెళ్ళి భార్య, పిల్లలను చూసే అవకాశం లేదు. ఇంట్లో ప్రశాంతంగా ఒక ముద్ద తినే పరిస్థితి కూడా కరువయ్యింది. వైరస్‌ భయంతో బిడ్డను ఎత్తుకుని లాలించే అవకాశం కూడా లేక ఇంటి బయటే నిల్చుని భోజనం చేస్తున్న ఏలూరు టూటౌన్‌ సీఐ బోణం ఆదిప్రసాద్‌

లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ఇంటి నుంచి అడుగు బయట పెట్టడానికే సంకోచిస్తున్న వేళ.. కొందరు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు కరోనా వైరస్‌పై ముందుండి పోరాడుతుండగా వైద్య సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి చికిత్స అందిస్తున్నారు. వీరి సేవలు, త్యాగాలకు ప్రజలంతా కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు.

యథావిధిగా విధులకు... 
‘‘మాది తూర్పు గోదావరి జిల్లా అమలాపురం. నాన్న కాండ్రకోట అప్పారావు పారిశుధ్య కార్మికుడు. కరోనా భయంతో నగరంలో జన సంచారం లేదు. నాన్న మాత్రం ఎప్పటిలాగే రోజూ తెల్లవారుజామున నాలుగున్నర గంటలకే చీపురు, పార తీసుకుని విధులకు వెళ్లిపోతున్నారు. రోడ్లు, మురుగునీటి కాలువ శుభ్రం చేస్తున్నప్పుడు కరోనా వైరస్‌ సోకుతుందేమోనని ఆందోళనగా ఉంది. నాన్న డ్యూటీకి వెళ్లేటప్పుడు అమ్మ, తమ్ముడు పలు జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నారు. ’’ 
–తన తండ్రి అప్పారావు, తల్లి, తమ్ముడితో కాండ్రు భారతి

వలంటీర్ల వార్‌.. 
కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో గ్రామ, వార్డు వలంటీర్లు ముందుండి నడిపిస్తున్నారు. వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు గ్రామాలు, పట్టణాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తున్నారు. ఇంటింటా సర్వే చేసి విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న వేలాది మందిని గుర్తించారు. వారిని పరిశీలించిన వైద్య సిబ్బంది 29,494 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. 178 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పర్యవేక్షిస్తూ ఆరోగ్య స్థితిగతులను వలంటీర్లు ఎప్పటికప్పుడు వైద్యులకు తెలియచేస్తున్నారు.  

గ్యాస్‌ బాయ్‌ల నుంచి ఫార్మసిస్టుల వరకు 
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం గ్యాస్‌ సిలిండర్లను డెలివరీ బాయ్‌లు సకాలంలో అందచేసి తమ వంతు సేవలు అందిస్తున్నారు. ఆరోగ్య అత్యయికస్థితి విధించిన వేళ ఫార్మాసిస్టులు మందుల దుకాణాలను తెరిచి ఉంచి ప్రజలకు ఔషధాలను అందిస్తున్నారు. 

మండే ఎండలో పోలీసుల పహరా 
ఎక్కడి వాళ్లు అక్కడే ఉండటం(లాక్‌ డౌన్‌), స్వీయ నిర్బంధం, సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా మాత్రమే కరోనా విస్తరణకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ప్రభుత్వం దీన్ని పటిష్టంగా అమలు చేస్తోంది. లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా అమలు చేసి కోవిడ్‌–19 గొలుసుకట్టును చేధించేందుకు మండే ఎండలోనే గస్తీ కాస్తున్న పోలీసులు ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నారు. 

పారిశుధ్య పనుల్లో కార్మికులు 
పట్టణాలు, గ్రామాల్లో వీధులు, మురుగునీటి కాలువలను పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు రసాయనాలతో శుభ్రం చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వారి ఇళ్ల పరిసరాలను జల్లెడ పట్టి వైరస్‌పై సమరం చేస్తున్నారు.

విరామం ఎరుగని వైద్య సిబ్బంది.. 
కరోనా లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చిన రోగులకు వైద్యులు, నర్సులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి చికిత్స అందిస్తున్నారు. రోగుల రక్తాన్ని పరీక్షల కోసం పంపి పాజిటివ్‌గా తేలినవారిని 24 గంటలూ కనిపెట్టుకుని చికిత్స అందిస్తున్నారు. హోం క్వారంటైన్, హాస్పిటల్‌ క్వారంటైన్‌లో ఉన్న వారి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు ఆరా తీసి వైద్యం అందిస్తున్నారు.

కుటుంబానికి దూరంగా కర్తవ్య నిర్వహణ
‘ఉద్యోగ రీత్యా కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తోంది. ఈనెల 7న ఆర్డీవోగా విజయవాడ నుంచి బదిలీపై వచ్చా. లాక్‌డౌన్‌ కారణంగా మా స్వస్థలమైన తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో భార్య, ఇద్దరు పిల్లలు ఉండిపోయారు. కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారనే బాధ ఉన్నా కరోనాపై పోరాటంలో నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నా’
– డి.లక్ష్మారెడ్డి, ఆర్డీఓ, కొవ్వూరు

ఎలాంటి పరిస్థితుల్లోనైనా
‘వైద్యులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా విధులు నిర్వహించాల్సిందే. అర్ధరాత్రి వేళల్లో కేసు వచ్చినా అటెండ్‌ అవుతున్నాం. నా భార్య కూడా డాక్టరే. నెల రోజులుగా నిద్రకూడా సరిగా లేకుండా పనిచేస్తున్నాం. ఐసోలేషన్‌ వార్డులు, ఐసీయూలు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం కృష్ణాజిల్లాకు చెందిన నలుగురు, గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు పాజిటివ్‌ రోగులు ఇక్కడ చికిత్సపొందుతున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించి వ్యాధిని నయం చేయడమే మా లక్ష్యం’ 
–  డాక్టర్‌ గోపీచంద్, పల్మనాలజిస్ట్, నోడల్‌ ఆఫీసర్, కోవిడ్‌ 19 ట్రీట్‌మెంట్‌ సెంటర్, విజయవాడ 

ధైర్యంగా ముందుకెళుతోంది..
‘మా అమ్మ ఏఎన్‌ఎంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో విధులు నిర్వహిస్తోంది. అమ్మ పరిధిలో నాలుగు వార్డులు ఉన్నాయి. కరోనా వైరస్‌ ప్రాణాలకే ముప్పు అని తెలిసినప్పటికీ మా అమ్మ ధైర్యంగా ఇంటింటికీ వెళుతోంది. ప్రజల ప్రాణాలు కాపాడినప్పుడు తృప్తి ఉంటుందని అమ్మ చెబుతుంటుంది’ 
– వి ఆదిత్యగౌడ్, పిడుగురాళ్ల 

అంతా సహకరిస్తేనే
‘‘నా పేరు స్వర్ణ. కడప అక్కాయపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నర్స్‌ (ఏఎన్‌ఎం)గా పనిచేస్తున్నా. కరోనా వైరస్‌ వైద్య సిబ్బందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. హోం క్వారంటైన్‌లో ఉన్న వారిని నేను 14 రోజుల పాటు పర్యవేక్షించాలి. మాకు కుటుంబం కంటే కరోనా వైరస్‌ను అంతమొందించడమే ముఖ్యం. అందుకోసం ఎన్ని రోజులైనా సరే, విశ్రాంతి లేకపోయినా పర్వాలేదు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలను తప్పకుండా పాటించినప్పుడే కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయగలం’’
– స్వర్ణ, నర్స్, పీహెచ్‌సీ అక్కాయపల్లె, కడప

నిరంతర పర్యవేక్షణతో కట్టడి
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం రూరల్‌ ఎస్సై కె.లక్ష్మి కరోనాపై అవగాహన పెంచేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. ఈ ప్రాంతానికి విదేశాల నుంచి వచ్చిన 104 మంది ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఎస్‌ఐ రోజూ వీరందరినీ కలుస్తూ బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ఆమెకు ఇద్దరు చిన్నారులు ఉన్నప్పటికీ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ నుంచి ప్రజల్ని కాపాడాలన్న కృత నిశ్చయంతో 21 పంచాయతీల్లో రోజూ పర్యటిస్తున్నారు.

వీరబాబు అలుపెరుగని సేవ
కాకినాడ రూరల్‌లోని ఓ గ్యాస్‌ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా పని చేసే యేలేటి వీరబాబుకు భార్య, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. రోజుకు 15 నుంచి 20 వరకు  సిలిండర్లు అందచేస్తాడు. భార్య, కుమార్తె ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని కోరుతున్నా తనకోసం ఎదురుచూసే వందల మంది వినియోగదారుల కోసం ఇంటింటికీ వెళ్లక తప్పడం లేదని పేర్కొంటున్నాడు. 

గర్వంగా ఉంది..
‘‘నా భర్త అల్లు రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి వెళితే రాత్రి 11 గంటలకు తిరిగి వస్తున్నారు. ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైరస్‌పై  ఎంతోమందికి అవగాహన కల్పిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా నా భర్త ప్రజలకు సేవ చేస్తుండటం ఎంతో గర్వంగా ఉంది’’
– అల్లు శోభ, పిడుగురాళ్ల    

వచ్చే వరకూ భయమే 
‘మా కోడలు ధనలక్ష్మి 24వ వార్డు వలంటీరుగా పనిచేస్తోంది. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారి ఆరోగ్య వివరాలు సేకరించే పని అప్పగించడంతో ఎంతో మంది ఆమెను నిరుత్సాహపరిచారు. అయితే ప్రజలకు సేవ చేసే అవకాశం ఆమెకి వచ్చినందుకు గర్వపడుతున్నాం’
– కల్యాణి, వెంకటరెడ్డి, 24వ వార్డు వలంటీర్‌ ధనలక్ష్మి అత్త,మామలు

అవగాహన కల్పిస్తున్నాం
‘ప్రజలను రక్షించేందుకు వలంటీర్లతో కలిసి శ్రమిస్తున్నాం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రాకుండా చూస్తున్నాం. ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించేలా అవగాహన కల్పిస్తున్నాం’’  
– శ్రీలక్ష్మి , మహిళా సంరక్షణ కార్యదర్శి, గూళ్యం గ్రామ సచివాలయం, హాలహర్వి మండలం, కర్నూలు జిల్లా

మరిన్ని వార్తలు