ప్రతి 10 మందికి ఓ పర్యవేక్షణాధికారి

24 Mar, 2020 03:59 IST|Sakshi

విదేశీ ప్రయాణికుల పరిశీలనకు ప్రత్యేక అధికారులు

24 గంటలూ వారిని ఐసోలేషన్‌లో ఉంచే బాధ్యత వీరిదే

ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి వారి ఆరోగ్య వివరాలు

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలకు ఆదేశాలు

ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో కీలక నిర్ణయాలు

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ద్వారానే రాష్ట్రంలో వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో.. వారిపై నిరంతర పరిశీలనకు చర్యలు చేపట్టింది. వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి 13 వేల మంది విదేశీ ప్రయాణికులు వచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో వారిలో ప్రతి 10 మందిపై పర్యవేక్షణకు ఒక అధికారిని ప్రభుత్వం నియమించనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు.. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విదేశీ ప్రయాణికులను ఇంట్లోనే నిర్బంధంలో ఉంచడం, అవసరమైన వైద్యం అందించే ఏర్పాట్లు చేయడం.. పర్యవేక్షణ అధికారి ప్రధాన విధి. ఆ పది ఇళ్లనూ ఈ అధికారి 24 గంటలూ పర్యవేక్షించనున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలకూ వెనుకాడకూడదని, ఎట్టి పరిస్థితుల్లో వారిని ఇల్లు దాటి బయటకు రానివ్వకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 

బాధ్యతలు ఇవీ..
- ప్రతి 10 మంది విదేశీ ప్రయాణికుల ఇళ్ల పర్యవేక్షణకు ఒక అధికారితో పాటు ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్త నియామకం. వీరు నిత్యం వారి కదలికలు పరిశీలిస్తుంటారు.
- మండల స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖల సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది.
- విదేశీ ప్రయాణికుల విషయంలో కలెక్టర్లకే పూర్తి అధికారాలు ఉంటాయి.
- నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసుల సహకారంతో కఠిన చర్యలు తీసుకోవాలి.
- ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం విదేశీ ప్రయాణికుల ఆరోగ్య వివరాలపై వాకబు చేయాలి. ఆ వివరాలను ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖకు పంపించాలి.
- నిర్ణయించిన మేరకు అధికారులు తక్షణమే విధుల్లో చేరాలి

మరిన్ని వార్తలు