20 నిమిషాల్లోనే ‘కరోనా’ రిజల్ట్స్‌

21 Jul, 2020 07:20 IST|Sakshi

గర్భిణిలు, క్షతగాత్రులు, అత్యవసర ఆపరేషన్‌ కేసులకు పరీక్షలు  

అందుబాటులో 22వేల యాంటీజెన్‌ కిట్లు  

అనంతపురం హాస్పిటల్‌: జిల్లాలో కరోనా కేసులు 5 వేలు దాటాయి. ఎవరికుందో...ఎవరికి లేదోనన్న భయం అటు వైద్య సిబ్బంది, ఇటు ప్రజల్లో నెలకొంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అత్యవసర కేసులకు (సర్జరీ కేసులకు) ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించడం ద్వారా సత్వర చికిత్సలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి జిల్లాకు 22 వేల కోవిడ్‌ ర్యాపిడ్‌ యంటీజెన్‌ కిట్లు వచ్చాయి. వీటి ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షకు సంబంధించి ఫలితాలను రాబట్టుకోవచ్చు. ప్రభుత్వ సర్వజనాస్పత్రి, హిందూపురం జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రులు, తదితర ఆస్పత్రులకు అవసరాన్ని బట్టి వీటిని అందజేయనున్నారు. 

పరీక్షలు ప్రారంభం
జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ప్రతి నెలా 5వేల శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. వీటితో పాటు ప్రసవాలు 5వేల వరకు ఉన్నాయి. వీరిలో కరోనా వైరస్‌ ఎవరిలో ఉందోననే విషయం ముందస్తుగా తెలుసుకునేందుకు ర్యాపిడ్‌ కిట్‌ పద్ధతిని వైద్యులు అనుసరిస్తున్నారు. వారం రోజులుగా ఈ విధానం ద్వారా చికిత్సలు అందించసాగారు. ఇప్పటి వరకు 957 మందికి ర్యాపిడ్‌ కిట్‌ ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఇందులో పాజిటివ్‌ అని తేలితే వారిని ప్రత్యేకంగా గుర్తించి, చికిత్సలు అందజేస్తారు. ఒక వేళ నెగిటివ్‌ అని తేలినా.. మరోసారి వీఆర్‌డీఎల్‌/ట్రూనాట్‌ సెంటర్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.

ప్రైవేట్‌ ఆస్పత్రులకూ కిట్లు
జిల్లాలోని వివిధ ప్రైవేట్‌ ఆస్పత్రులకు యాంటీజెన్‌ కిట్లను ఆరోగ్యశాఖ సరఫరా చేయనుంది. అయితే సదరు ఆస్పత్రి నిర్వాహకులు తాము శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు లిఖితపూర్వకంగా డీఎంహెచ్‌ఓకు లేఖరాయడం ద్వారా ఈ కిట్లను పొందవచ్చు.  

అందుబాటులో ర్యాపిడ్‌ కిట్లు  
జిల్లాకు 22 వేల ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లు వచ్చాయి. వివిధ ఆస్పత్రులకు కిట్లు సరఫరా చేశాం. సర్జరీ చేసే సమయంలో కేవలం 20 నిమిషాల వ్వవధిలోనే కోవిడ్‌ నిర్ధారణ తెలుసుకునేందుకు ఈ కిట్లు దోహదపడుతాయి.  – డాక్టర్‌ కేవీఎన్‌ఎస్‌ అనిల్‌కుమార్,డీఎంహెచ్‌ఓ

వారం రోజులుగా  ఆర్‌ఏజీ పరీక్షలు
వారం రోజులుగా సర్వజనాస్పత్రిలో గర్భిణిలు, క్షతగాత్రులు, తదితర అత్యవసర సర్జరీలకు సంబంధించి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ (ఆర్‌ఏజీ) పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఒక వేళ నెగిటివ్‌ వచ్చినా మరోసారి పరీక్ష చేయిస్తున్నాం. ఈ కిట్ల ద్వారా సకాలంలో రోగుల పరిస్థితిని తెలుసుకోవచ్చు.  – డాక్టర్‌ రామస్వామి నాయక్, సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి 

మరిన్ని వార్తలు