రోజురోజుకూ పెరుగుతున్న పరీక్షా సామర్థ్యం

21 Apr, 2020 15:36 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కరోనా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. వైరస్‌ నిర్ధారణ పరీక్షల సామర్ధ్యాన్ని రోజురోజుకూ పెంచుకుంటోంది. రాష్ట్రంలో ప్రతీరోజూ గణనీయంగా కరోనా పరీక్షల్లో పెరుగుదల నమోదవుతోంది. ఈక్రమంలో ప్రతి 10 లక్షల మందిలో 715 మందికి పరీక్షలు చేస్తూ కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. ప్రతి 10 లక్షల మందిలో 830 మందికి పరీక్షలు చేస్తూ రాజస్తాన్‌ తొలి స్థానంలో కొనసాగుతోంది.
(చదవండి: ఏపీలో కొత్తగా మరో 35 కరోనా కేసులు)

ఇక వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో భారతదేశ సగటు 10 లక్షలకు 290 మాత్రమే ఉండటం గమనార్హం. అత్యధిక కేసులున్న రాష్ట్రాలకంటే అధిక పరీక్షలు చేస్తూ ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల కంటే రాష్ట్రంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా జరగుతున్నాయి. ఒక్కరోజులోనే 615 నుంచి 715 కి కరోనా నిర్ధారణ పరీక్షల్లో పెరుగుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 5022 మందికి పరీక్షలు చేశారు. అన్ని జిల్లాలకు ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్ల సరఫరా పూర్తైనందున పరీక్షల సామర్థ్యం మరింత పెరగనుంది. ప్రతీ మండలంలోనూ ర్యాండమ్ పరీక్షలు చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.
(చదవండి: కరోనాపై అంతుచిక్కని అంశాలు)

వివిధ రాష్ట్రాల వారీగా పరీక్షా సామర్థ్యం..

మరిన్ని వార్తలు