లక్ష దాటిన టెస్టులు

2 May, 2020 03:22 IST|Sakshi

ఇప్పటి వరకు 1,02,460.. ఒక్క రోజులో 7,902 పరీక్షలు

ఒకే రోజు 82 మంది డిశ్చార్జి

రికవరీ 27.55 శాతం

తగ్గుతున్న కేసులు

పాజిటివ్‌ కేసుల శాతం 1.43  

సాక్షి,అమరావతి: రాష్ట్రంలో కరోనా టెస్టులు లక్ష మార్కు దాటాయి. గడిచిన వారం రోజుల్లో దేశంలోనే ఎక్కువ మందికి టెస్టులు చేసిన రాష్ట్రంగా ముందుకెళుతోన్న ఆంధ్రప్రదేశ్‌.. వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌ ప్రకారం శుక్రవారం ఉదయం 9 గంటల సమయానికి మొత్తం  1,02,460 టెస్టులు చేసి పది లక్షల జనాభాకు సగటున 1919 టెస్టులను చేస్తోంది. రెండువేల టెస్టులకు చేరువలో ఉంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 7,902 మందికి టెస్టులు నిర్వహించారు. వీటిలో కొత్తగా 60 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,463కి చేరింది. పాజిటివ్‌ కేసుల శాతం 1.43 మాత్రమే. దేశ సగటు పాజిటివ్‌ కేసుల శాతం 3.87. 

తగ్గుతున్న కరోనా వ్యాప్తి.. ఒకే రోజు 82 మంది డిశ్చార్జి
రాష్ట్రంలో కరోనా వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 82 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 403కు చేరింది. డిశ్చార్జి రేటు 27.55 శాతంగా నమోదైంది. దేశ వ్యాప్తంగా ఈ సగటు  26 శాతం మాత్రమే. అదే విధంగా కొత్త కేసుల సంఖ్య కూడా క్రమేణా తగ్గుతోంది. వారం రోజుల క్రితం వరకు రోజుకు 80 కొత్త కేసులు నమోదవుతుండగా అవి క్రమంగా తగ్గుతూ ఇప్పుడు 60కి చేరాయి. ఏప్రిల్‌ 26న 81గా న్న కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 60కి తగ్గింది. గడిచిన 24 గంటల్లో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 33కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో వైరస్‌కు చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 1,027గా ఉంది. 

మరిన్ని వార్తలు