12 లక్షలకు చేరువలో పరీక్షలు

15 Jul, 2020 03:53 IST|Sakshi

ఒక్కేరోజు 952 మంది డిశ్చార్జ్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా పరీక్షలు 12 లక్షలకు చేరువయ్యాయి. ఇప్పటివరకు 11,95,766 టెస్టులు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం బులెటిన్‌ విడుదల చేసింది. కాగా 24 గంటల్లో 1,916 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏపీకి సంబంధించిన కేసులు 1,908 కాగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారివి 8 ఉన్నాయి. మంగళవారం అనంతపురం జిల్లాలో 10 మంది, ప.గోదావరిలో 9, చిత్తూరు జిల్లాలో 5, తూ.గోదావరిలో 5, వైఎస్సార్‌ జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో 3, ప్రకాశంలో 3, విశాఖ జిల్లాలో 2, విజయనగరం జిల్లాలో ఒక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 408కి చేరింది. ఒక్క రోజులోనే 952 మంది ఆస్పత్రిలో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్లారు. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 33,019కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 15,144 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

ప.గోదావరిలో కరోనా నుంచి బయటపడ్డ 80 ఏళ్ల వృద్ధురాలు 
ఇరగవరం: పశ్చిమ గోదావరి జిల్లాలో 80 ఏళ్ల వృద్ధురాలు కరోనాను జయించింది. వివరాల్లోకెళ్తే.. ఇరగవరం మండలానికి చెందిన వృద్ధురాలికి గత నెల 28న పాజిటివ్‌గా తేలింది. వెంటనే ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందిన ఆమె కోలుకుని మంగళవారం ఇంటికి వచ్చింది. మానసిక ధైర్యంతో.. వైద్యుల సలహాలు పాటిస్తూ క్వారంటైన్‌ సెంటర్‌లో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం తీసుకుంటే ఎవరైనా కరోనాను జయించవచ్చని నిరూపించింది. 

ల్యాబొరేటరీల వద్ద నమూనా శాంపిళ్ల సేకరణ కేంద్రాలు 
రాష్ట్రంలో ఉన్న అన్ని వైరాలజీ ల్యాబొరేటరీలు, ట్రూనాట్‌ ల్యాబ్‌ల వద్ద నమూనాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.తాజా ఆదేశాల ప్రకారం..
► ప్రతి ల్యాబొరేటరీ వద్ద సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇవి మూడు షిఫ్టులూ పనిచేయాలి.
► ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం కోవిడ్‌–19 పరీక్షలు జరగాలి.
► నమూనాల బాక్సులకు ఐడీ నంబరు వేయాలి.
​​​​​​​► కోవిడ్‌ పరీక్షల ఫలితాలను ఎంఎస్‌ఎస్‌ పోర్టల్‌లో పొందుపరచాలి. రెడ్‌మార్క్‌ చేసిన నమూనాల ఫలితాలను తక్షణమే విడుదల చేయాలి.
​​​​​​​► ఒక పాజిటివ్‌ వ్యక్తికి తిరిగి పాజిటివ్‌ వస్తే దాన్ని కొత్త కేసుగా చూపించరాదు. ఫలితం వచ్చిన 6 గంటల్లోపే ఎంఎస్‌ఎస్, ఐసీఎంఆర్‌ పోర్టల్‌లో పొందుపర్చాలి.

మరిన్ని వార్తలు