కరోనా పరీక్షల వైద్య పరికరాల కోసం 10 లక్షలు

26 Mar, 2020 19:42 IST|Sakshi

విశాఖ జిల్లాకు ఎంపీ ల్యాడ్స్ నుంచి  కేటాయించిన విజయసాయి రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని అరికట్టే పోరాటంలో భాగంగా అందుకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలు కోసం వైఎస్సార్సీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ఎంపీ ల్యాడ్స్ (ఎంపీ స్థానిక అభివృద్ధి నిధుల పథకం) నుంచి విశాఖపట్నం జిల్లాకు రూ. 10 లక్షలు విడుదల చేశారు. నిధుల విడుదలకు సిఫార్సు చేస్తూ ఆయన విశాఖ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది కరోనా అనుమానిత వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతను దూరం నుంచే పరీక్షించేందుకు అవసరమైన ఇన్‌ఫ్రా-రెడ్ థర్మోమీటర్లు, కరోనా వైరస్‌ బారిన పడకుండా వైద్య సిబ్బంది సమర్ధవంతంగా తమ విధులు నిర్వర్తించేందుకు అవసరమయ్యే పర్సనల్‌ ప్రొటెక్షన్‌ కిట్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు వంటి ప్రాంతాల్లో దూరంగా నిలబడి ప్రయాణీకుల శరీర ఉష్టోగ్రతను పరీక్షించే థర్మల్‌ ఇమేజి స్కానర్లు లేదా కెమేరాలు, కరోనా టెస్టింగ్‌ కిట్లు, ఐసోలేషన్‌, క్వారంటైన్‌ వార్డులలో వినియోగించే ఐసీయూ వెంటిలేటర్లు, వైద్య సిబ్బందికి అవసరమైన మాస్క్‌లు, గ్లోవ్‌లు, శానిటైజర్లతోపాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆమోదించిన ఇతర వైద్య పరికరాల కొనుగోలు కోసం ఈ నిధులను మంజూరు చేస్తున్నట్లుగా ఆయన తన లేఖలో తెలిపారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అసాధరణ చర్యలలో భాగంగా కరోనా పరీక్షల కోసం తగినన్ని   వైద్య పరికరాలతో సిద్ధంగా ఉండాలన్న ఉద్ధేశంతో వాటి కొనుగోలు కోసం ఎంపీ నిధులను వినియోగించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. వీటికి సంబంధించిన  మార్గదర్శకాలను విడుదల చేస్తూ కేంద్ర స్టాటిస్టిక్స్‌, ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వ శాఖ శ్రీ విజయసాయి రెడ్డికి లేఖ రాసింది. దీనిపై ఆయన వెంటనే స్పందిస్తూ విశాఖ జిల్లాలో కరోనా పరీక్షల కోసం వైద్య పరికరాల కొనుగోలుకు తన ఎంపీ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ విశాఖ జిల్లా కలెక్టర్‌కు సిఫార్సు లేఖ రాశారు.

మరిన్ని వార్తలు