‘నాడు-నేడు’కు కార్పొరేటు సంస్థల తోడ్పాటు

19 Dec, 2019 13:44 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నాడు-నేడు’ కార్యక్రమానికి తోడ్పాటు అందించేందుకు కార్పొరేట్‌ సంస్థలు ముందుకు వచ్చాయి. కనెక్ట్‌ టు ఆంధ్రా కింద 5 కార్పొరేటు సంస్థలు నాడు-నేడుకు తోడ్పాటు అందించనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ గుర్తించిన 2,566 ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, సదుపాయల కల్పనే ప్రధాన లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయని గుర్తుచేశారు. నాడు-నేడు కింద 45వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను.. రూ. 12వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ప్రతి పాఠశాలలో ఇంగ్లిషు ల్యాబ్‌, 9 రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతున్నామని.. ఆ తర్వాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ పోతామని తెలిపారు. అలాగే అమ్మ ఒడి ద్వారా పిల్లల తల్లులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. 

2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 33 శాతం నిరక్షరాస్యత ఉందని గుర్తుచేశారు. నిరక్షరాస్యతను గణనీయంగా తగ్గిస్తామని చెప్పారు. నాడు-నాడు కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందులో ఉందని.. అలాగని దృష్టి పెట్టాల్సిన అంశాలను విస్మరించలేమని అన్నారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాలపై ప్రముఖంగా దృష్టిపెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు తలా ఒక చేయి వేయాలని పిలుపునిచ్చారు. నాడు-నేడు కార్యక్రమం గురించి ఇతర సంస్థలకు చెప్పాలని.. తద్వారా అందరూ భాగాస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయా కార్పొరేటు సంస్థలకు సూచించారు. 

ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌, ప్రణాళిక శాఖ డిప్యూటీ సెక్రటరీ, కనెక్ట్‌ టు ఆంధ్రా సీఈఓ కోటేశ్వరమ్మ, నార్త్‌ అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్‌, వసుధ ఫార్మా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం వెంకట రామరాజు, లారస్‌ ల్యాబ్స్‌ సీఈఓ చావా సత్యనారాయణ, హెటిరో డ్రగ్స్‌ ఎండీ వంశీకృష్ణ, రెయిన్‌ కార్బన్‌ సీజీఎం ఆదినారాయణ స్వామి, సీఎఫ్‌ఎం జీఆర్‌ కుమార్‌, ఆదిలీల ఫౌండేషన్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌ ఆదినారాయణ పాల్గొన్నారు.  

  • 402 ప్రభుత్వ పాఠశాలల్లో హెటిరో సంస్థ నాడు – నేడు  చేపట్టనుంది. వైఎస్సార్‌ కడపలో చక్రాయపేట, జమ్మలమడుగు, లింగాల, పులివెందుల, సింహాద్రిపురం, తొండూరు, వేంపల్లి, వేముల మండలాల్లో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఆ సంస్థ రూ. 20 కోట్లకు పైగా ఖర్చుచేయనుంది.
  • 428 ప్రభుత్వ పాఠశాలల్లో వసుధ ఫార్మా నాడు – నేడు చేపట్టనుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, పాలకోడేరు, పోడూరు, వీరవాసరం మండలాల్లో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఆ సంస్థ దాదాపు రూ. 21 కోట్లు ఖర్చు చేయనుంది.
  • రెయిన్‌ కార్బన్‌ సంస్థ 66 ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఆ సంస్థ రూ. 1.65 కోట్లు ఖర్చు చేయనుంది.
  • ఆదిలీల ఫౌండేషన్‌ 281 ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ది చేయనుంది. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి, పాతపట్నం, సారవకోట మండలాల్లో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఆ సంస్థ రూ. 25 కోట్లు ఖర్చుచేయనుంది.
  • గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 359 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు లారస్‌ ల్యాబ్స్‌ రూ. 18 కోట్లు ఖర్చు చేయనుంది. కంచికచర్ల, వేలేరుపాడు, పెదకూరపాడు, తెనాలి, దుగ్గిరాల, ప్రత్తిపాడు మండలాల్లో పాఠశాలల్లో ఆ సంస్థ నాడు-నేడు చేపట్టనుంది.  
  • నాడు- నేడు కార్యక్రమానికి ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్‌.. తన తొలి జీతం విరాళంగా ఇచ్చారు.
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా