రౌడీ కార్పొరేటర్‌!

21 Jul, 2018 09:25 IST|Sakshi

మితిమీరిన నటేష్‌ చౌదరి అరాచకాలు

ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి ప్రధాన అనుచరుడు

ఏకంగా అధికారులపైనే  దాడులు

రాజకీయ ఒత్తిళ్లతో చర్యలకు పోలీసుల వెనుకంజ

తాజాగా వైద్యురాలి పట్ల దురుసు ప్రవర్తన

నామమాత్రపు కేసుతో సరి

స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపిన పోలీసులు

వైద్యులను కనిపించే దేవుళ్లుగా కీర్తిస్తారు. అందునా మహిళా వైద్యురాలు విధి నిర్వహణలో ఉండగా అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌ తన రౌడీయిజంతో కన్నీళ్లు పెట్టించారు. గౌరవనీయంగా ‘గారూ..’ అని సంబోధించడాన్ని కూడా తప్పుపట్టి కార్పొరేటర్‌ నటేష్‌ చౌదరి నోటికొచ్చినట్లు మాట్లాడిన తీరుతో వైద్య సమాజం గుండెలవిసేలా రోదిస్తోంది. న్యాయం కోసం పోలీసు స్టేషన్‌ తలుపు తడితే.. రౌడీ కార్పొరేటర్‌కు రెడ్‌ కార్పెట్‌ పర్చడం విమర్శలకు తావిస్తోంది.

గతేడాది జనవరి 2న అరవిందనగర్‌కు చెందిన ప్రకాష్‌గౌడ్‌ అనే మానసిక వికలాంగున్ని చితకబాదుతున్న కార్పొరేటర్లు నటేష్‌చౌదరి, సరిపూటి రమణ. పింఛన్‌ కోసం కమిషనర్‌ వాహనాన్ని అడ్డుకున్నందుకు కార్పొరేటర్లు నడిరోడ్డుపైనే చావబాదారు. బాధితుడు అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు.

2015 అక్టోబర్‌లో మేయర్‌ స్వరూప క్యాంపు కార్యాలయంలో ఉన్న  కమిషనర్‌ ఉమామహేశ్వర్‌ పై పూడిక బిల్లు విషయంలో కార్పొరేటర్‌ నటేష్‌ చౌదరి రాడ్‌తో దాడి చేసేందుకు యత్నించాడు. ఆ సమయంలో మేయర్‌ వర్గీయులు అడ్డుకున్నారు. తమ ఇంటి వద్దకు వచ్చి ఇలా చేయడమేంటని చీవాట్లు పెట్టారు. ఈ విషయమై కమిషనర్‌ ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడగా రాజకీయ ఒత్తిళ్లతో మిన్నకుండిపోయారు.

తాజాగా ఈ నెల 18న సర్వజనాస్పత్రిలోని అక్యూట్‌ మెడికల్‌ కేర్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మల్లీశ్వరిని ‘‘ నీకు డాక్టర్‌ ఉద్యోగం ఇచ్చిన వాళ్లను చెప్పుతో కొట్టాలి.. నీ అంతు చూస్తా. ఎలా తిరుగుతావో. మా ప్రభుత్వంలో నీ ఆటలు సాగవు.’’ అని హెచ్చరించాడు. 30 మంది కార్యకర్తలతో కలసి వైద్యురాలిపై దాడికి యత్నించాడు. ఈ ఘటనతో వైద్యురాలు కన్నీటి పర్యంతమైంది.

గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో 29వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఉమామహేశ్వర్‌(టీడీపీ)పై నటేష్‌ చౌదరి దాడి చేస్తున్న దృశ్యం ఇది. అగ్రవర్ణాల డివిజన్లకు పెద్దపీట వేసి, బీసీలను విస్మరిస్తున్నారని కార్పొరేటర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఒక్కసారిగా నటేష్‌ చౌదరి కార్పొరేటర్‌ ఉమామహేశ్వర్‌పై చేయి చేసుకున్నాడు.

అనంతపురం న్యూసిటీ: ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి అనుచరుల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరు ఎవరిపై దాడి చేస్తారో తెలియని పరిస్థితుల్లో ప్రజలతో పాటు అధికారులు కూడా భయభ్రాంతులకు లోనవుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు, 37వ వార్డు కార్పొరేటర్‌ నటేష్‌చౌదరి(టీడీపీ) విధి నిర్వహణలోని మహిళా వైద్యురాలి పట్ల వ్యవహరించిన తీరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రిలో ఆమె కన్నీటి పర్యంతమైనా.. ఎమ్మెల్యే పరామర్శించకపోగా, కార్పొరేటర్‌కు మద్దతుగా పోలీసులపై ఒత్తిళ్లు తీసుకురావడం విమర్శలకు తావిస్తోంది. తమ మాట వినకపోతే భౌతిక దాడులకు కూడా వెనుకాడేది లేదన్నట్లు నటేష్‌ చౌదరి తన చర్యలతో చెప్పకనే చెప్పారు. పైగా తమ ప్రభుత్వంలో మీ ఆటలు సాగబోవని ప్రభుత్వ వైద్యురాలిపై బెదిరింపులకు పాల్పడటం.. ఆసుపత్రిలో అలజడి సృష్టించడంతో వైద్యులు బెంబేలెత్తుతున్నారు.

పోలీసులు జీ హుజూర్‌
రోడ్డుపై గుంపుగా నిలబడితేనే తాట తీసే పోలీసులకు కార్పొరేటర్‌ నటేష్‌ అరాచకాలు కన్పించకపోవడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జీ హుజూర్‌ అంటూ కార్పొరేటర్‌కు పోలీసులు రెడ్‌కార్పెట్‌ పర్చడం విమర్శలకు తావిస్తోంది. ఈ నెల 18న సర్వజనాస్పత్రిలో నటేష్‌దౌర్జన్యంపై 300 మంది వైద్యులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. బాధిత వైద్యురాలితో కలిసి వైద్య సంఘాలు టూటౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేస్తే పోలీసులు నామమాత్రపు కేసు నమోదు చేసి స్టేషన్‌ బెయిల్‌తో ఇంటికి పంపడం చూస్తే అధికార పార్టీ ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనే విషయాన్ని పోలీసులు చెప్పకనే చెప్పారు. గతంలో పలు మర్డర్‌ కేసుల్లో అరెస్టు అయిన ఈ ‘రౌడీ’ కార్పొరేటర్‌ను కూర్చోపెట్టి బెయిల్‌ ఇచ్చి పంపడం పోలీసుల చిత్తశుద్ధికి నిదర్శనం.

మరిన్ని వార్తలు