స్టడీ టూర్‌ కాదు.. విహారయాత్ర !

12 Jul, 2018 12:46 IST|Sakshi
పోలవరం ప్రాజెక్టు యాత్రలో కార్పొరేటర్లు (ఫైల్‌ ఫొటో)

వివాదాస్పదమవుతున్న కార్పొరేటర్ల పర్యటన

పోలవరంతోపాటు పాపికొండలు చుట్టివచ్చిన పాలకవర్గ సభ్యులు

జలవనరుల శాఖ బస్సులను కాదని సొంత బస్సుల్లో యాత్ర

అప్పులు ఉన్నా యాత్రలే మిన్నా

గతంలో కూడా యాత్రల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం

‘మింగ మెతుకు లేదు కానీ మీసాలకు మాత్రం సంపంగి నూనె’ సామెత చందంగా ఉంది విజయవాడ నగర పాలక సంస్థ వ్యవహారం. అప్పులపాలైన వీఎంసీకి నిధులు కొరత సమస్య ఉన్న నేపథ్యంలో ఖర్చులు తగ్గించాల్సిన పాలక వర్గం స్టడీ టూర్‌ పేరుతో  రూ.లక్షలు ఖర్చు చేసి విహారయాత్రకు వెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం పర్యటన పేరుతో అధికారపార్టీ కార్పొరేటర్లు, అధికారులతో కలిసి పాపికొండలు తిరిగి రావడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

సాక్షి,అమరావతిబ్యూరో : మూడు వివాదాలు.. ఆరు అవినీతి ఆరోపణలతో రాజకీయాలకు వేదికగా మార్చేసిన నగరపాలక సంస్థ పాలకపక్షం ఆహ్లాదం పేరుతో మరోసారి ప్రజాధనానికి చిల్లు పెట్టారు. గత శనివారం పోలవరం ప్రాజెక్టు పర్యటన యాత్ర కోసమంటూ  ఏసీ బస్సులు , ప్రత్యేక వాహనాలు, విందు భోజనాలు  ఏర్పాటు చేసుకొని  కార్పొరేటర్లు, అధికారులు కలిసి పోలవరం, పాపికొండలు చుట్టి వచ్చారు. వారి పర్యటన ఖర్చులు దాదాపు రూ.3 లక్షల వరకు నగరపాలక సంస్థ భరించాల్సి వచ్చింది. వాస్తవంగా పోలవరం ప్రాజెక్టు పర్యటన కోసం ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తుంది. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో  ప్రాజెక్టు పర్యటనకు వాహనాలు సమకూర్చుతారు. కానీ జలవనరుల శాఖ ఏర్పాట్లలో విందు వినోదాలు, విహారయాత్రలాగా ఉండవని భావించిన కార్పొరేటర్లు వీఎంసీ నిధులతో టూర్‌ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. అందుకు నగరపాలక సంస్థ కమిషనర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో రూ.లక్షల ఖర్చుతో విహార యాత్ర చేశారు.

మాయనిమచ్చగా ఉత్తరభారత పర్యటన...
అధికారపార్టీ కార్పొరేటర్లు గతంలో కూడా విహార యాత్ర కోసం రూ.లక్షల్లో ప్రజాధనం దుర్వినియోగం చేశారు. 2016 లో దాదాపు 30 మంది టీడీపీ కార్పొరేటర్లు విమానాల్లో  ఉత్తర భారతదేశాన్ని చుట్టి వచ్చారు. మొత్తం 16 రాష్ట్రాలలో 22 రోజుల పాటు విహార యాత్రచేశారు. అప్పట్లో వీరి యాత్రకు కోసం దాదాపు రూ.28 లక్షల వ్యయాన్ని నగరపాలక సంస్థ భరించడంపై వివాదం చెలరేగింది. గత పర్యటనలో ప్రజాధనం దుర్వినియోగంతో పాటు తోటి మహిళా కార్పొరేటర్ల పట్ల అసభ్యకర ప్రవర్తన మాయనిమచ్చగా మిగిలింది.

మరోసారి యాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌..?
వీఎంసీ పాలకవర్గం ఏర్పాటై నాలుగేళ్లు పూర్తయినా అభివృద్ధిలో మాత్రం తన మార్కు వేయలేకపోయింది. అభివృద్ధి కంటే అప్పులే ఎక్కువుగా చేశారు. నగర పాలక సంస్థలో అవినీతి విచ్చలవిడిగా మారింది. ప్రతిశాఖలో అవినీతితో పాటు టీడీపీ కార్పొరేటర్ల కమీషన్ల పితలాటకంతో వీఎంసీ పరువు బజారుకీడ్చారు. పేదవర్గాలకు వీఎంసీ చేసింది శూన్యమనే చెప్పాలి. కానీ టీడీపీ కార్పొరేటర్లు మాత్రం విహార యాత్రల కోసమంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో ముందంజలో ఉన్నారు. తమ ఐదేళ్ల పదవీకాలం ముగిసేలోపు మరోసారి దేశాన్ని చుట్టేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే నగర మేయర్, కమిషనర్‌ అనుమతి తీసుకొని త్వరలోనే యాత్రకు రూట్‌ మ్యాప్‌ రూపొందిస్తున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు