తీయని విషం

21 Aug, 2019 08:03 IST|Sakshi
ప్రమాదకరమైన రసాయనాలను పరిశీలిస్తున్న  కార్పొరేషన్, ఆహార తనిఖీ అధికారులు, సీజ్‌ చేసిన వస్తువులు

ఆహా ఏమి రుచి అనిపించే తీయతీయగా ఉండే ఆ మిఠాయిల తయారీ వెనుక ఉండే చేదు నిజాన్ని వింటే ప్రతి స్వీటు ప్రియుడూ కంగుతింటాడు. నిషేధిత రసాయనాలతో తయారయ్యే ఆ స్వీట్లలో ప్రాణాంతకమైన విషం దాగివుందన్న వాస్తవం వెలుగు చూసింది. కాకినాడ నడిబొడ్డున భానుగుడి సెంటర్‌లో అత్యాధునిక హంగులతో ఉన్న ఓ మిఠాయి దుకాణంపై నగరపాలకసంస్థ, ఆహార తనిఖీ విభాగాల అధికారుల ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూసిన వాస్తవాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 30 రకాల ముడిసరుకులతోపాటు 17రకాల స్వీట్లను అధికారులు స్వాధీనం చేసుకుని సదరు దుకాణానికి నోటీసులు జారీ చేశారు. 

సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి) : నగరంలోని భానుగుడి జంక్షన్‌ సమీపంలోని మహేంద్ర స్వీట్స్‌పై కార్పొరేషన్‌ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆరోగ్యాధికారి డాక్టర్‌ పి.ప్రశాంత్‌ తన సిబ్బందితో జరిపిన తనిఖీల్లో అవాక్కయ్యే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. స్వీట్ల తయారీకి వినియోగించే ముడిసరుకులో కనీస నాణ్యత లేకపోవడాన్ని వారు గుర్తించారు. పురుగుపట్టిన శనగపిండి. పుచ్చిన వేరుశనగగుళ్లు, కాలం చెల్లిన స్వీట్ల తయారీ సామగ్రిని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆహార తనిఖీ అధికారులకు వారు సమాచారం ఇవ్వడంతో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.వీర్రాజు ఆధ్వర్యంలో ఆ శాఖకు చెందిన అధికారులు అక్కడకు వచ్చి మహేంద్ర స్వీట్‌లో విస్తృతంగా తనిఖీలు చేశారు.

నాణ్యతలేని సరుకులు, కాలం చెల్లిన, నిషేధిత రసాయనాలతో స్వీట్లు, కేక్‌లు తయారు చేస్తున్న విషయాన్ని వారు గుర్తించారు. ఆ షాపు యజమానులు, మధ్యవర్తుల సమక్షంలో అక్కడ అందుబాటులో ఉన్న సరుకును వారు ధ్వంసం చేశారు. లడ్డు, పిస్తాకేక్, హల్వాను పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపారు. అనంతరం ఆ షాపు యజమానికి నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం నోటీసులు జారీ చేసింది. 

జిల్లా కేంద్రంలో కలకలం
నగరంలో మంచి పేరున్న ప్రముఖ మిఠాయి దుకాణమైన మహేంద్ర స్వీట్స్‌లోనే  ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడేలా స్వీట్లు తయారు చేస్తున్న వ్యవహారం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. ఇంతకాలం ధర ఎక్కువైనా ఇక్కడ నాణ్యమైన మిఠాయిలు దొరుకుతాయన్న ఆశతో నగరంలోని దూరప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు వచ్చి కొనుగోలు చేసేవారు. తియ్యటి మిఠాయిల్లో దాగివున్న చేదు నిజాన్ని, అవి తినడం ద్వారా పాడయ్యే ఆరోగ్యాన్ని గుర్తించి ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి దుకాణాలపై మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను నగరవాసులు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు