సొమ్మొకరిది.. సోకొకరిది..

14 Oct, 2016 04:21 IST|Sakshi
సొమ్మొకరిది.. సోకొకరిది..
రాజమహేంద్రవరం సిటీ : 
నగరపాలక సంస్థలో నిధుల వినియోగంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నగరపాలక సంస్థ భవన నిర్మాణానికి నిధులు పెద్దసంఖ్యలో ఖర్చు చేస్తుండగా.. తాజాగా అదే భవన నిర్మాణం కోసం మరో రూ.4.43 కోట్లు మంజూరుకు కౌన్సిల్‌ ఆమోదానికి సిద్ధం చేయడాన్ని పలువురు ప్రజాప్రతినిధులు తప్పుబడుతున్నారు. అలాగే 279 జీఓ ప్రకారం పారిశుద్ధ్య కార్మికుల నిర్వహణ, వారి జీతభత్యాల కోసం మే నెలలో సుమారు రూ.17.79 కోట్లు కౌన్సిల్‌ ఆమోదం పొందగా.. తాజాగా నగరంలో పారిశుద్ధ్య పనివారికి తొమ్మిది నెలల జీతాల కోసం మరో మారు రూ.9,33,43,990 కోట్లు మంజూరుకు అజెండాలో తీర్మానం సిద్ధం చే శారు. ‘సొమ్మొకరిది.. సోకొకరిది అన్నట్టుగా రూ. కోట్ల ప్రజాధనం లెక్కాపత్రం లేకుండా ఖర్చు చేసుకుపోతున్నా.. అడిగే నాథుడే కరువయ్యాడు. 
 
రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ నూతన భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వం 2012లో  రూ.6.60కోట్లు మంజూరు చేసింది. భవననిర్మాణం అంతంతమాత్రంగా సాగుతోంది. భవన నిర్మాణం మొదలు పెట్టి అసలు నిధులు కన్నా.. కొసరు నిధులు మంజూరు రెట్టింపు కనిపిస్తున్నాయి. అసలు నిధులు రూ.6.60 కోట్లు కాగా తర్వాత క్రమంలో కమిషనర్‌ స్టాయి సంఘం నుంచి ఒకసారి రూ.కోటిన్నర, మరోసారి రూ.1.98 కోట్లు ఇలా మొత్తం రూ.10.08 కోట్ల ప్రజాధనం కేటాయించారు. అయినా భవన నిర్మాణం కొలిక్కి రాలేదు. అయితే తాజాగా మరోమారు భవన నిర్మాణానికి నిధులు కావాలంటూ శుక్రవారం జరగనున్న నగర పాలకమండలి సమావేశ అజెండాలో సిద్ధం చేశారు. వీటిలో ఫాల్స్‌ సీలింగ్‌కు రూ.85.15 లక్షలు, ఎలివేషన్‌ గ్లాస్, క్లాడింగ్‌ పనులకు రూ.కోటీ 22 లక్షలు, ఫర్నిచర్‌ కోసం రూ.కోటీ 30 లక్షలు, బ్రిక్‌ వర్క్‌ మూడో ఫ్లోర్‌కు డోర్లు, అన్ని ఫ్లోర్లు ఎలివేషన్‌ తదితర పనులకు రూ.95,80 లక్షలు కేటాయింపు కోసం పాలక మండలి ఆమోదం కోసం అజెండాలో సిద్ధం చేశారు. ఇక ఆమోదమే తరువాయి. ఒక భవన నిర్మాణం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసే ప్రయత్నం చేస్తున్న అధికారులు.. నగరంలో దశాబ్దాల కాలంగా పేరుకుపోయిన సమస్యలపై దృష్టి సారించకపోవడం దారుణమైన విషయం. మరోవైపు కోట్లాది రూపాయలతో జరుగుతున్న భవననిర్మాణ పనులపైనా పాలకవర్గ సభ్యుల పర్యవేక్షణ కొరవడడం విచారకరం. 
స్వచ్ఛభారత్‌ మిషన్‌ ద్వారా నూతనంగా అమల్లోకి వచ్చిన 279 జీఓ ప్రకారం నగరంలో 50 డివిజన్‌లను 24 శానిటరీ సర్కిల్స్‌గా విభజించారు. నాలుగు జోన్లుగా( ఈస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్‌ ) విభజించారు. ఈ జోన్లలో పారిశుద్ధ్య నిర్వహణకు రూ.17.79 కోట్లు మంజూరు చేస్తూ ఈ ఏడాది మే 21న జరిగిన పాలకమండలి సమావేశంలో సభ్యులు ఆమోదించారు. నగరంలో ప్రస్తుతం పని చేస్తున్న వారే ఉన్నప్పటికీ శుక్రవారం జరగనున్న పాలకమండలి సమావేశంలో 13/884 అంశ«ంగా నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ పారిశుద్ధ్య సిబ్బంది 899 మందికి జూలై 2016 నుంచి మార్చి 2017 వరకూ వారి జీతాలు చెల్లింపునకు రూ.9.33 కోట్లు మంజూరు చేయాలంటూ అజెండాలో రూపొందించారు. మే నెల పాలక మండలి కేటాయించిన నిధులు ఎక్కడికి వెళ్లాయి. వాటితో ఏం చేశారు. తాజాగా ఈ నిధుల మంజూరు ఏంటనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇలా ఇష్టానుసారంగా నిధులు కేటాయించడంపై పలువురు ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు.
 
మరిన్ని వార్తలు