కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయం

1 Feb, 2016 04:48 IST|Sakshi
కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయం

రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా, జీఎంసీపై పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో వార్డు అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తల పమావేశం జరిగింది. 

ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ర్ట ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. పరిపాలన గాలికొదిలి ప్రజా వ్యతిరేక విధానాలకు నిస్సిగ్గుగా పాల్పడుతోందని నిప్పులు చెరిగారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సవ్యంగా సాగిన సంక్షేమ పథకాలన్నింటినీ బాబు అటకెక్కించారని ఆరోపించారు.


 ఈ నేపథ్యంలో ప్రజలతో మమేకమై ప్రభుత్వ విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన సమయం అసన్నమైందని, ఆ దిశగా ప్రజల్లో చైతన్యం పెంపొందించే బాధ్యతను వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు గుర్తెరిగి మసులుకోవాలని సూచించారు. రాష్ట్ర రాజధాని నగరమైన గుంటూరులో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలు కీలకమని, కార్పొరేషన్‌ను కైవసం చేసుకునేందుకు అన్ని స్థాయిలో కమిటీలు వేసుకొని  పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు

.
 తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వద్ద డబ్బు, అధికారం ఉంటే వైఎస్సార్‌సీపీకి జనం బలం ఉందని వ్యాఖ్యానించారు. ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయబావుట ఎగరేసేందుకు అందరూ సన్నద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పార్టీ నేతలు గులాం రసూల్, అంగడి శ్రీనివాసరావు, అత్తోట జోసఫ్, కంది సంజీవరెడ్డి, అనుబంధ విభాగాల నగర అధ్యక్షులు కోట పిచ్చిరెడ్డి, షేక్ జానీ, గనిక ఝాన్సీరాణి, నాగం కాశీ విశ్వనాథ్, పల్లపు రాఘవ, అరుబండ్ల కొండారెడ్డి, పానుగంటి చైతన్య, అనుబంధ విభాగాల రాష్ట్ర నేతలు కొట్టే కవిత, దేవా, సోమి కమల్, శేఖర్‌రెడ్డి, రబ్బాని, మేరువ నర్సిరెడ్డి, జగన్‌కోటి తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు