బీసీల సంక్షేమానికి కృషి

24 Feb, 2018 12:00 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య

25న వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో

బీసీ కులాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం

హాజరుకానున్న రీజినల్‌ కో ఆర్డినేటర్‌ గౌతంరెడ్డి  

విలేకరుల సమావేశంలో బీవై రామయ్య,

బీసీ అధ్యయన కమిటీ సభ్యులు గురువాచారి, దర్గారావు

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి కృషి చేస్తుందని ఆ పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు.   తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఇప్పటికే బీసీ కులాల సమస్యలు..వాటి పరిష్కారాలపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశారన్నారు. శుక్రవారం వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆ కమిటీ సభ్యులు గురవాచారి, దర్గారావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. వెనుకబడిన కులాల సమస్యల పరిష్కారంపై వైఎస్‌ఆర్‌సీపీ చిత్తశుద్ధితో ఉందన్నారు. అందులో భాగంగా  ఈ నెల 25వ తేదీన కర్నూలు పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో బీసీ కులాలు, ప్రజా సంఘాలు, వృత్తి నిపుణులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.

నంద్యాల చెక్‌ పోస్టులోని మెగాసిరి ఫంక్షన్‌ హాలులో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి బీసీ అధ్యయన కమిటీ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, పార్టీ కర్నూలు రీజినల్‌ కోఆర్డినేటర్‌ మేకపాటి గౌతంరెడ్డి, నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య   అతిథులుగా హాజరవుతారన్నారు. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో బీసీ కుల, ప్రజా సంఘాలు వ్యక్తం చేసే అభిప్రాయాలను క్రోడీకరించి బీసీ డిక్లరేషన్‌కు పంపుతామన్నారు.  తెలుగుదేశం పార్టీ బీసీల పేటెంట్‌ అని సీఎం చంద్రబాబు ఒక వైపు చెబుతూనే  బీసీ కులాల పునాదులను కూల్చేందుకు  కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు డీకే రాజశేఖర్, ప్రహ్లాదాచారి, శ్రీధర్‌రెడ్డి, కరుణాకరరెడ్డి,రాజేంద్రప్రసాద్‌నాయుడు, రామాంజనేయులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు