ఓటరు జాబితాలో అక్రమాలను సరిదిద్దండి

14 Dec, 2018 01:45 IST|Sakshi

కేంద్ర ఎన్నికల సంఘానికి  వైఎస్సార్‌ సీపీ వినతిపత్రం

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో చోటుచేసుకుంటున్న అవకతవకలపై వైఎస్సార్‌ సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అధికార టీడీపీ దొంగ ఓట్లను సృష్టిస్తున్న వైనంతోపాటు ఇప్పటివరకు పలు నియోజకవర్గాల్లో స్వల్ప మార్పులతో ఒకే వ్యక్తి పేరును నాలుగైదు చోట్ల ఓటరు జాబితాలో చేర్చడంపై వైఎస్సార్‌ సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ వరప్రసాదరావు గురువారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునిల్‌ ఆరోరాను కలసి ఈమేరకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 నియోజకవర్గాల్లో 45,920 పోలింగ్‌ బూత్‌లవారీగా ఎన్నికల సంఘం 2018 సెప్టెంబర్‌ 1న విడుదల చేసిన ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలను వైఎస్సార్‌ సీపీ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చారు. దీనిపై ఈసీకి ఆధారాలను సైతం అందజేశారు. అన్ని నియోజకవర్గాల ఓటర్ల జాబితాను ఒక క్రమంలో 50 శాతం వరకు పరిశీలిస్తే ప్రధానంగా రెండు రకాల తప్పులను గుర్తించినట్టు నేతలు వివరించారు. 

నకిలీ ఓటర్ల సంఖ్య అరకోటికిపైనే..
ఒకే వ్యక్తికి పేరులో స్వల్ప మార్పులతో ఒకే నియోజకవర్గంలో లేదా వేరే నియోజకవర్గాల్లో నాలుగైదు చోట్ల ఓటరు జాబితాలో పేర్లు నమోదు కావడాన్ని గుర్తించినట్టు తెలిపారు. డూప్లికేట్‌ / పలుచోట్ల ఓటుహక్కుకలిగి ఉండటం / పూర్తి వివరాలు లేని ఓటర్ల సంఖ్య 34,17,125 వరకు ఉందని వెల్లడించారు. ఇక మరో 18,50,511 మందికి రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మొత్తం 52.67 లక్షల మంది ఇలా అక్రమంగా ఓటు హక్కు కలిగి ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలనే మార్చేసే ఇలాంటి ఓటర్లను తొలగించి అక్రమాలను వెంటనే సరిదిద్దాలని ఎన్నికల ప్రధానాధికారిని కోరినట్టు సమావేశం అనంతరం విజయసాయిరెడ్డి మీడియాకు తెలిపారు.  ఓటర్ల జాబితాలో అక్రమాలను అరికట్టేందుకు ఓటర్‌ ఐడీ కార్డును ఆధార్‌తో లింక్‌ చేసే విధానాన్ని అమలు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు.  

మరిన్ని వార్తలు