ప్రాణహిత’పై దిద్దుబాటు చర్యలు

19 May, 2015 02:36 IST|Sakshi
ప్రాణహిత’పై దిద్దుబాటు చర్యలు

ప్రాజెక్టుపై వివాదాల నేపథ్యంలో  సలహాదారు విద్యాసాగర్‌రావు వివరణ
స్వచ్ఛ ఇరిగేషన్ నినాదంతో ముందుకెళ్తామని వెల్లడి

 
హైదరాబాద్: ‘స్వఛ్చ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ మాదిరే సాగునీటి రంగంలోనూ స్వచ్ఛ ఇరిగేషన్ నినాదంతో ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ (దిద్దుబాటు చర్యలు) చేపట్టాం. అందులో భాగంగానే గత ప్రభుత్వాలు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో చేసిన తప్పిదాలను సరిచేస్తూ ఆయకట్టు, నీటివినియోగం లక్ష్యాలు దెబ్బతినకుండా ప్రత్యామ్నాయాలు తయారు చేస్తున్నాం. పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర సహా స్వరాష్ట్రంలోనూ ముంపు వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా ప్రాజెక్టును త్వర గా పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నాం’ అని ప్రభుత్వ సాగునీటిరంగ సలహాదారు ఆర్. విద్యాసాగర్‌రావు తెలిపారు.

ఈ ప్రాజెక్టుపై వస్తున్న కథనాలపై  సోమవారం సచివాలయంలో వివరణ ఇచ్చారు. ప్రాజెక్టు డిజైన్ మార్పుపై మాట్లాడుతున్న విపక్షాలు, స్వయంప్రకటిత మేధావులు తుమ్మిడిహెట్టి ఎత్తుతో జరుగుతున్న ముంపుపై మహారాష్ట్రను ఒప్పించగలరా? అని ప్రశ్నించారు. వ్యాప్కోస్ ఇచ్చే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలన్నీ సమూలంగా నపరిశీలించాకే ప్రాజెక్టుపై ప్రభుత్వం అంతిమ నిర్ణయం తీసుకుంటుందని విద్యాసాగర్‌రావు చెప్పారు.  

నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు...
ప్రాణహిత ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ, సీడబ్ల్యూసీ అనుమతులు తీసుకోకుండానే నాటి ప్రభుత్వాలు అనుమతులిచ్చి ప్రాజెక్టు పనులను ప్రారంభించాయని విద్యాసాగర్‌రావు విమర్శించారు. రూ. 38,500 కోట్ల ప్రాజెక్టును రాష్ట్రం చేపట్టాలంటే అనుమతులు, కేంద్రసాయం తీసుకోవాలని తెలిసినా దాన్ని విస్మరించి జాతీయహోదా అంటూ అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రజలను నమ్మించారన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీతో మహారాష్ట్రలో   ముంపును పట్టించుకోకుండా, ఆ రాష్ట్ర అభ్యంతరాలను వినిపించుకోకుండా పనులు చేపట్టారన్నారు.

లక్ష్యం దెబ్బతినకుండా ప్రత్యామ్నాయం...
మహారాష్ట్ర అభ్యతంరాల నేపథ్యంలోనే ప్రస్తుతం కాళేశ్వరం దిగువన మేటిగడ్డ వద్ద నీటి మళ్లింపుకు పూనుకున్నామని విద్యాసాగర్‌రావు తెలిపారు. తుమ్మిడిహెట్టితో పోలిస్తే కాళేశ్వరం వద్ద నీటి లభ్యత పుష్కలంగా ఉందన్నారు. 160 టీఎంసీల నీటిని 90 రోజుల్లో మళ్లించి వాటిని నిల్వ చేసుకునేందుకు బ్యారేజీ లేదన్న సీడబ్ల్యూసీ సూచన మేరకే మెదక్ జిల్లాలోని పాములపర్తి, తడ్కపల్లి బ్యారేజీ సామర్ధ్యం పెంచామన్నారు. ఆదిలాబాద్ ఆయకట్టు ప్రయోజనాలు దెబ్బతినకుండా తుమ్మిడిహెట్టి లేదా, దిగువన మరో బ్యారేజీ నిర్మించి జిల్లాకు నీరందిస్తామని తెలిపారు.   తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లింపల్లికి నీటి తరలింపు ఖర్చు కన్నా కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి నీటి తరలింపు ఖర్చు తక్కువని విద్యాసాగర్‌రావు వివరించారు.

మరిన్ని వార్తలు