అహుడాలో ఆ ‘ఇద్దరు’

6 Sep, 2019 07:43 IST|Sakshi

అమ్యామ్యాలిస్తేనే అనుమతులు

చేయితడపకపోతే ముందుకు సాగని ఫైల్‌

 ‘సాక్షి’ వాకబు చేయడంతో మేలుకున్న అధికారులు

57 అక్రమ లేఅవుట్లపై చర్యలు  

నగరంలోని బళ్లారి బైపాస్‌ సమీపంలో ఓ వ్యక్తి 16 సెంట్ల స్థలంలో భవన నిర్మాణం చేపట్టాలనుకున్నాడు. ఇందుకోసం అన్ని ధ్రువీకరణ పత్రాలు సమర్పించి అహుడా అనుమతులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఐదు నెలలు గడుస్తున్నా... ఆ ఫైల్‌ ముందుకుసాగలేదు. అహుడాలోని ఇద్దరు అధికారులు ఉద్దేశ పూర్వకంగా ఏదో ఒక కొర్రీ వేస్తూ అనుమతులు ఇవ్వకుండా నాన్చుతున్నారు. ఇలా అహుడా పరిధిలోని వందల మంది నిర్మాణ అనుమతుల కోసం ఇబ్బందులు పడుతున్నారు.  

సాక్షి, అనంతపురం: అనంతపురం, హిందూపురం డెవలప్‌మెంట్‌ అథారిటీ (అహుడా)లో ఇద్దరు అధికారులు చక్రం తిప్పుతున్నారు. అనుమతుల కోసం కార్యాలయానికి వచ్చే నిర్మాణదారులను వేధిస్తున్నారు. నిర్మాణ అనుమతుల్లో కీలకంగా వ్యవహరించి ఓ అధికారి, మరో ఉద్యోగికి చేయితడపంతే ఫైల్‌ ముందుకుసాగని పరిస్థితి నెలకొంది. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో అనుమతులిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నా..అది మాటలకే పరిమితమవుతోంది. అహుడా అనుమతులకు సంబంధించిన ఫైల్‌ను క్షణాల్లో షార్ట్‌ఫాల్‌ కింద రిటర్న్‌ చేస్తున్నారు. ఇదేమిటని నిర్మాణాదారులు ఆరా తీస్తే లైసెన్స్‌ ఇంజినీర్‌ సరిగా చేయలేని తమ ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకోండంటూ ‘ఆ ఇద్దరు’ నిర్మాణదారులను మభ్యపెడుతున్నారు. ఆ ఇద్దరు ఉద్యోగుల ద్వారా అనుమతులకు దరఖాస్తు చేసుకున్న ఫైళ్లు చకచకా పరుగులు పెడుతున్నాయి.  

కాసులిస్తేనే పని 
అహుడాలోని ఆ ఇద్దరు ఉద్యోగులకు చేయితడపంతే ఫైల్‌ ముందుకుసాగదని కొందరు  నిర్మాణదారులు, లైసెన్స్‌ ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అహుడా అనుమతుల కోసం వెళ్తే లైసెన్స్‌ ఇంజినీర్‌ సరైన సమాచారాన్ని పొందుపర్చలేదని ఓ అధికారి చెబుతారు. అంతలోనే మరో ఉద్యోగి కల్పించుకుని తమకు చెందిన ఓ లైసెన్స్‌ ఇంజినీర్‌(హిందూపురం) ఉన్నారని... ఆయనే అన్నీ చూసుకుంటారని నిర్మాణదారులకు చెబుతారు. దీంతో నిర్మాణదారులు గత్యంతరం లేక వారి చెప్పినట్లు నడుచుకుంటున్నారు. లేఅవుట్లు అనుమతులకు దరఖాస్తు చేసుకున్న వారి నుంచి రూ.లక్షల్లో ముడుపులు డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.  

అహుడా విస్తీర్ణమిలా... 
అనంతపురం, హిందూపురం డెవలప్‌మెంట్‌ అథారిటీ (అహుడా) 2017 మార్చిలో ఏర్పాటైంది. మొదట్లో అనంతపురం నగరపాలక సంస్థ, ధర్మవరం, హిందూపురం మునిసిపాలిటీల్లోని 18 మండలాల్లోని 180 గ్రామ పంచాయతీలను అహుడా పరధిలోకి తెచ్చారు. అప్పట్లో అహుడా విస్తీర్ణం 3120.05 చదరపు కిలోమీటర్లుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.  

2018లో పెరిగిన విస్తీర్ణం 
2018 మే 22న ఉరవకొండ నియోజకవర్గంలోని మరో 5 మండలాల్లోని 84 గ్రామ పంచాయతీలను కలుపుకుని 1900.44 చదరపు కిలోమీటర్లను అదనంగా చేర్చారు. ఇలా మొత్తంగా అహుడా 5120.49 చదరపు కిలోమీటర్లలో విస్తరించింది. అహుడా పరిధిలో నిర్మాణాలు చేపట్టే వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. నగరపాలక సంస్థ పరిధిలో వెయ్యి చదరపు మీటర్లు, మునిసిపాలిటీ, పంచాయతీ పరిధిలో 300 చదరపు కిలోమీటర్లు పైబడి నిర్మాణాలు చేపడితే అహుడా అనుమతులు తప్పనిసరి.

హడావుడిగా నోటీసులు 
అహుడా అధికారులు హడావుడిగా 57 అక్రమ లేఅవుట్లను గుర్తించి, ఆ లేఅవుట్ల రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన వారికి రిజిస్ట్రేషన్లను చేయవద్దని జిల్లా రిజిస్ట్రార్‌లతో పాటు సబ్‌ రిజిస్ట్రార్లకు ఫిర్యాదు చేశారు. అహుడా అనుమతులకు ఇద్దరు ఉద్యోగులకు చేయితడిపితేనే లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుతులిస్తున్నారని..దీనిపై వివరణ ఇవ్వాలని అహుడా వైస్‌ చైర్మన్‌ మురళీకృష్ణగౌడ్‌ను ‘సాక్షి’ వివరణ కోరిన నేపథ్యంలో ఆయన జిల్లాలోని అక్రమ లేఅవుట్ల జాబితాను సిద్ధం చేసి చర్యలకు ఉపక్రమించారు. 

57 అక్రమ లేఅవుట్లు 
అహుడా పరిధిలో 57 అక్రమ లేఅవుట్లను అధికారులు గుర్తించారు. అనంతపురంలోని కక్కలపల్లి, కురుకుంట, రాచానపల్లి, కొడిమి, ఉప్పరపల్లి, ఇటుకలపల్లి, జంగాలపల్లి, అనంతపురం రూరల్, హిందూపురంలోని శ్రీకంఠాపురం, హిందూపురం, బుక్కరాయసముద్రం తదితర చోట్ల అక్రమ లేఅవుట్లు వెలిశాయి. 

విచారణ చేపడతాం  
కొందరు ఉద్యోగుల కారణంగా అహుడా అనుమతుల జాప్యమవుతున్న విషయం నాకు తెలియదు. నేను ఇటీవలే బాధ్యతలు తీసుకున్నా. అటువంటి ఫిర్యాదులందితే వెంటనే విచారణ చేస్తాం. ఆరోపణలు నిజమని తేలితే చర్యలు తీసుకుంటా. 
– అహుడా వీసీ మురళీకృష్ణ గౌడ్‌  

మరిన్ని వార్తలు