శ్రీవారి ఆలయంలో అవినీతి అధికారులు

27 Apr, 2016 04:06 IST|Sakshi

ముగ్గురు టీటీడీ అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు
రూ. కోట్ల విలువైన పత్రాలు స్వాధీనం


 తిరుచానూరు/తిరుపతి క్రైం: టీటీడీలో ముగ్గురు అధికారులు ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారు. వీరిపై ఫిర్యాదులు అందడంతో వారి ఇళ్లపై ఏసీబీ అధికారులు మంగళవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కోట్లాది రూపాయల విలువజేసే డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టీటీడీ పరిపాలనా భవనంలో నియామక విభాగపు సూపరింటెండెంట్ నరేంద్రరెడ్డి, తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సూపరింటెండెంట్ మోహన్‌రెడ్డి, తిరుమల కల్యాణకట్ట సూపర్‌వైజర్ తంగవేలులకు ఆదాయానికి మించి ఆస్తులున్నాయని సమాచారం రావడంతో వారిపై నిఘా పెట్టారు.

మంగళవారం తిరుచానూరు వసుంధరనగర్‌లో నరేంద్రరెడ్డి నివాసంలో, తిరుపతి ముత్యాలరెడ్డిపల్లెలో ఉంటున్న మోహన్‌రెడ్డి, కొర్లగుంట వాసి తంగవేలు ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. అదే సమయంలో నరేంద్రరెడ్డి బంధువులు నలుగురి ఇళ్లలోనూ సోదాలు చేశారు. వీరందరి ఇళ్లల్లో కోట్లాది రూపాయల విలువైన డాక్యుమెంట్లు, ఇంటి పత్రాలు, బ్యాంకు లాకర్ల వివరాలు, బ్యాంకు పాసు బుక్కులను గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు