అధికారులు–వ్యాపారుల కుమ్మక్కు

19 Aug, 2019 04:40 IST|Sakshi
అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో జాబితాల్లో అక్రమాలు ఉన్నాయని రైతుల ధర్నా

పప్పుశనగ రైతుల నోట్లో మట్టి

ఇంటి వద్ద పంటను నిల్వ చేసుకున్న వారికి దక్కని అదనపు సాయం 

ఇతర రాష్ట్రాల్లో కొన్న పంటను ఏపీలో విక్రయిస్తున్న వ్యాపారులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన చాలామంది పప్పు శనగ రైతులకు అధికారులు, వ్యాపారుల అవినీతి వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోంది. ధరల స్థిరీకరణ నిధి పథకంతో రైతులను ఆదుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. గోడౌన్ల కొరత వల్ల ఇంటి వద్దనే పంటను నిల్వ చేసిన రైతులకు ఈ పథకం కింద సాయం అందడం లేదు. మరోవైపు వ్యాపారులు,అధికారులు కుమ్మక్కై అనర్హులకు సాయం అందిస్తూ కమీషన్లు మింగేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 

క్వింటాల్‌కు 1,500 చొప్పున అదనపు సాయం 
కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రైతులు పప్పు శనగను సాగు చేస్తున్నారు. 2016–17లో 4 లక్షల హెక్టార్లలో సాగు కాగా, 2018–19లో సాగు విస్తీర్ణం 4.78 లక్షల హెక్టార్లకు పెరిగింది. రబీలో పండే పప్పు శనగలకు కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 4,620 కనీస మద్దతు ధర ప్రకటించింది. ఈ మద్దతు ధర గిట్టుబాటు కాకపోవడంతో ఎక్కువ మంది రైతులు పంటను శీతల గిడ్డంగులు, ప్రైవేటు గోదాముల్లో నిల్వ చేసుకున్నారు. నిల్వ ఉంచిన ఈ పంటను హామీగా పెట్టి, కొందరు రైతులు తక్షణ అవసరాల కోసం వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకున్నారు.

రాష్ట్రంలో దాదాపు 59 లక్షల క్వింటాళ్ల పప్పు శనగ శీతల గిడ్డంగులు, ప్రైవేట్‌ గోదాముల్లోనూ, రైతుల వద్ద దాదాపు 10 లక్షల క్వింటాళ్లు నిల్వ ఉన్నట్టు అంచనా. నిల్వలను కొనేందుకు ప్రభుత్వం రూ.333 కోట్లు విడుదల చేసింది. రైతులను ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు పప్పు శనగను కొనుగోలు చేయడంతోపాటు క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున అదనంగా అందజేస్తోంది. ఒక్కో రైతుకు 30 క్వింటాళ్ల దాకా ఈ సాయం అందిస్తోంది. దీనివల్ల ఒక్కో రైతుకు రూ.45 వేల ప్రయోజనం చేకూరుతోంది. అయితే, ఈ–క్రాపింగ్‌లో పేర్లు నమోదైన వారికే ఈ అదనపు సాయం అందుతోంది. 

వ్యాపారుల మాయాజాలం 
అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాలో పప్పు శనగ రైతుల జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అక్కడి రైతులు ధర్నా సైతం చేశారు. కొందరు వ్యాపారులు ఇతర రాష్ట్రాల్లో పప్పు శనగను కొనుగోలు చేసి, ఏపీలో తమకు తెలిసిన రైతుల పేరిట కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేశారు. అధికారులతో కుమ్మక్కై ఆ రైతుల పేర్లను ఈ–క్రాపింగ్‌లో నమోదు చేసి, ప్రభుత్వం నుంచి అందే అదనపు సాయాన్ని జేబుల్లో వేసుకుంటున్నారు. గోడౌన్ల కొరత వల్ల ఇంటి వద్ద పంటను నిల్వ చేసుకున్న రైతులకు సాయం అందించడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. అర్హులందరికీ ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు