విచారణ ‘బీచ్‌’లోకేనా?!

16 Jul, 2018 12:11 IST|Sakshi
రూ.41 లక్షలు చెల్లించిన ఖరీదైన స్టేజ్‌ ఇదే (ఫైల్‌)

 బీచ్‌ ఫెస్టివల్‌లో అడ్డగోలుగా నిధుల వెచ్చింపుపై ‘సాక్షి’లో వరుస కథనాలు

అక్రమ బాగోతంపై తొలుత జేసీని విచారణ అధికారిగా నియమించిన కలెక్టర్‌

రోజు తిరక్కుండానే విచారణ అధికారి మార్పు

డీఆర్వో, ‘ముడా’ వీసీ, ఆర్డీవోలకు బాధ్యతలు

అవినీతి జరిగిందన్న అభియోగం ఉన్న శాఖ అధికారితోనే విచారణ

సాక్షి, మచిలీపట్నం :  మసూల బీచ్‌ ఫెస్టివల్‌ పేర అక్రమాలకు ఆజ్యం పోశారు. అందినకాడికి దోచుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. అనుకున్నదే తరువాయి దోపిడీ పర్వానికి పావులు కదిపారు. ఏకంగా రూ.కోట్లు దోపిడీకి తెగబడ్డారు. చేయని ఖర్చుకు బిల్లులు పెట్టి కోట్లు నొక్కేందుకు తెర తీశారు. అక్రమ బాగోతంపై ‘సాక్షి’లో ‘బీచ్‌ ఫెస్టివల్‌ దోపిడీ’, ‘బీచ్‌ లెక్కలన్నీ తూచ్‌’ శీర్షికలతో వరుస కథనాలు ప్రచురితం కావడంతో రాజకీయ, అధికార వర్గాల్లో కలకలం రేగింది. మొక్కల పేరుతో రూ.60 లక్షలు బిల్లులు పెట్టి రూ.50 లక్షలు స్వాహా చేసేందుకు సిద్ధమైన వైనాన్ని, మూడు రోజుల పాటు స్టేజ్‌ నిర్మాణానికి రూ.9 లక్షలు వెచ్చించాల్సి ఉండగా, రూ.40 లక్షలకు పైగా బిల్లులు పెట్టిన తంతును బహిర్గతం చేయడంతో స్పందించిన కలెక్టర్‌ లక్ష్మీకాంతం అక్రమాలపై విచారణ నిర్వహించాలని జేసీ విజయకృష్ణన్‌ను నియమించారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది.

అనూహ్యంగావిచారణ అధికారి మార్పు..
బీచ్‌ ఫెస్టివల్‌ దోపిడీ పర్వంపై విచారణకు తొలుత జేసీ విజయకృష్ణన్‌ను నియమించారు. ఆమె తనదైన శైలిలో విచారణకు ఉపక్రమించారు. అక్రమ తంతులో ఎవరి హస్తం ఉంది? ఎవరెవరికి ఏ మేరకు ముడుపులు అందాయి? అన్న కోణంలో విచారణ ప్రారంభించారు. అనంతరం ఏమైందో ఏమో? అనూహ్యంగా విచారణ అధికారి మార్పు ప్రక్రియ తెరపైకి వచ్చింది. అంత తక్కువ వ్యవధిలోనే మార్పు చేయాల్సిన అవసరం ఏముంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక మరో కోణం దాగుందని స్పష్టమవుతోంది. అక్రమాలను కప్పి పుచ్చేందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని అర్థమవుతోంది. జేసీ స్థానంలో విచారణ అధికారులుగా డీఆర్వో, ఆర్డీవో, ‘ముడా’ వీసీని నియమించారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చిన చందంగా నిధుల దుర్వినియోగం అయిన శాఖకు చెందిన అధికారికే ఆ బృందంలో స్థానం కల్పించారు. వారే నిధుల వ్యయంపై నివేదిక ఇవ్వాలని సూచించడాన్ని బట్టి చూస్తే విచారణ ఏ మేరకు పక్కాగా జరుగుతుంది? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బిల్లులు తాత్కాలికంగా నిలుపుదల చేసినా.. మరో రెండు రోజుల్లో మంజూరుకు కసరత్తు జరుగుతోంది. దీని బట్టి చూస్తే అక్రమ బిల్లులను సక్రమం చేసుకుని, అవినీతి నుంచి బయటపడేందుకు పావులు కదుపుతున్నారని అర్థమవుతోంది. ఇదిలా ఉంటే అక్రమ తంతు నుంచి గట్టెక్కించాలని ఓ అధికారికి ఇటీవల భారీగా ముడుపులు సమర్పించినట్లు తెలిసింది. భారీగా పెట్టిన బిల్లులను పైకి తక్కువగా చూపించి.. చెల్లింపుల్లో మాత్రం యథావిథిగా ఇచ్చేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలైనట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ అంశం హాట్‌ టాపిక్‌గా మారడంతో ఇప్పట్లో బిల్లులు చెల్లిస్తే మరింత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తుతాయేమోనని.. కొన్ని రోజులు విరామం ప్రకటించి.. విషయం సద్దుమణిగిన అనంతరం చెల్లించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు