కోండ్రు.. అవినీతి బ్రాండ్‌

6 Apr, 2019 12:32 IST|Sakshi

అప్పట్లో మంత్రిగా రూ. కోట్లు బొక్కేసి..

కమీషన్ల కక్కుర్తితో పనుల్లో నాణ్యతా లోపం

సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ అభ్యర్థిగా ప్రత్యక్షం

సాక్షి, శ్రీకాకుళం: అవినీతి చక్రవర్తి కోండ్రు మురళీమోహన్‌ మరోమారు రాజాం నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి ముసుగులో కోట్లాది రూపాయలు దండుకున్న ఈయనకు 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు  బుద్ధి చెప్పడంతో పత్తాలేకుండా పోయారు. అప్పట్నుంచి నియోజకవర్గ ప్రజలపై కన్నెత్తి చూడలేదు. ఈ నేపథ్యంలో ఆర్నెల్ల క్రితం టీడీపీలో చేరగా, మంత్రిగా తన హయాంలో చేపట్టి అసంపూర్తిగా నిలిచిన అభివృద్ధి పనులు కొనసాగించడంలో చొరవ చూపలేదు. అయితే అప్పట్లో కాంట్రాక్టురు అవతారమెత్తిన తన సోదరుడు జగదీష్‌తో కలసి కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల కోసం ఒత్తిళ్లు, నిధుల నిలుపుదల, ఇసుక అవినీతి బాగోతం కార్యకర్తలపై నెట్టేయడం వంటి అరాచకాలు సృష్టించారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేస్తున్న ఈయన్ను ఓడించేందుకు ఆ పార్టీలో అసమ్మతి వర్గం చాపకింద నీరులా తమ ప్రయత్నాలు చేస్తోంది. 


ఈ ఫొటోలోని రహదారి సంతకవిటి మండలం మల్లయ్యపేట–హొంజరాం గ్రామాల మధ్య నిర్మించారు. కోండ్రు మురళీమోహన్‌ మంత్రిగా ఉన్న సమయంలో రూ.86 లక్షలు మంజూరు చేశారు. అప్పట్లో రాజాం వచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాంట్రాక్టరు వద్ద భారీగా ముడుపులు అందుకోవడంతో రోడ్డు నిర్మాణం నాసిరకంగా మారింది. మరోవైపు ఇదే రహదారి మీదుగా మేడమిర్తి, తమరాం, కేఆర్‌పురం గ్రామాల నుంచి కోండ్రు మురళీ రాత్రిళ్లు ఇసుకను తరలించేవారు. ఈ క్రమంలో మందరాడ వద్ద ఇసుక లారీ ఢీకొనడంతో పోతురాజుపేట గ్రామానికి చెందిన విద్యార్థిని మృతి చెందింది. అప్పట్లో ఈ ఉదంతం రాష్ట్రస్థాయిలో సంచలనం రేపగా, ఇసుక అక్రమ రవాణాను కోండ్రు పార్టీ కార్యకర్తలపై నెట్టేసి తప్పుకున్నారు.

అవినీతి, అరాచకాలే...
ఐదేళ్ల కిందట కొండ్రు మురళీమోహన్‌ మంత్రి హోదాలో రాజాం నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసినప్పటికీ చాలా పనులు ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. కోట్ల ఖర్చుతో అరకొరగా పనులు చేయగా, మరికొన్ని అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఈయనకు టిక్కెటిచ్చి జీవితాన్ని ప్రసాదించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిపైనే మంత్రి పదవి కోసం బురద జల్లే ప్రయత్నం చేశారు. వర్గవిభేదాలను ప్రోత్సహించేందుకు అంతర్గత ముఠా రాజకీయాలు చేశారు. రోడ్లు, భవనాల నిర్మాణాల పనులు కట్టబెట్టేందుకు తన సోదరుడు కోండ్రు జగదీష్‌ను కాంట్రాక్టురుగా అవతారమెత్తించారు. మరోవైపు కాంట్రాక్టులు దక్కించుకున్న వారి నుంచి కమీషన్ల కోసం ఒత్తిళ్లు చేయడం, ఇవ్వకుంటే నిధుల నిలుపుదల చేయడం, అర్ధంతరంగా పనులు ఆపివేయడం చేసేవారు.

అంతేకాదు విశాఖపట్నంలో ఇసుక వ్యాపారం నిమిత్తం తన అనుచురలతో సంతకవిటి, రేగిడి మండలాల నుంచి అక్రమంగా ఇసుక తరలించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో చేపట్టిన ఈ బాగోతాలతో అప్పటి మంత్రి కోండ్రు మురళీమోహన్‌పై తీవ్ర ప్రజావ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. రాజాం నియోజకవర్గ ఓటర్లు ఈయనకు డిపాజిట్‌ దక్కకుండా చిత్తుచిత్తుగా ఓడించారు. అప్పట్నుంచి రాజాం నియోజకవర్గానికి ముఖం చాటేసిన ఈయన ఆర్నెల్ల క్రితం టీడీపీలో చేరారు. అయినప్పటికీ ఈ పనులు పూర్తి చేయకపోవడం సంగతి అటుంచితే కనీసం వాటి గురించి పట్టించుకున్న పాపానపోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సొంత పార్టీలోనే వ్యతిరేకత
రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి టిక్కెట్‌ వస్తుందని మొదటి నుంచి ఆశపెట్టుకుని భంగపడిన మాజీ స్పీకర్‌ కావలి ప్రతిభాభారతి రగలిపోతున్నారు. ఈమెను కాదని స్థానికేతరుడైన మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌కు ఇవ్వడంపై గుర్రుగా ఉన్నారు. దీంతోపాటు మంత్రి కళా వెంకటరావు సొంత మండలం రేగిడి నుంచి ఆ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అప్పట్లో ఈయన అరాచకాలు, దౌర్జన్యాలతో ఆర్థికంగా మానసికంగా దెబ్బతిని కుదేలై ఇప్పటికీ కోలుకోలేకపోతున్నామని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ఈయనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరలా అవినీతి అక్రమాలకు తెగబడతారని బెంబేలెత్తుతున్నారు.


రాజాం నుంచి రణస్థలానికి బీటీరోడ్డు నిర్మించారు. ఈ రహదారిలో శ్యాంపురం వద్ద కోండ్రు గెస్ట్‌హౌస్‌ నిర్మించుకున్నారు. అంతేకాకుండా రాజాం నుంచి తన స్వగ్రామమైన లావేరు మండలం చేరుకునేందుకు ఈ రహదారి నిర్మాణానికి రూ.40 కోట్లు కేటాయించారు. కాంట్రాక్టరుతో కుమ్మక్కై నాసిరకంగా రహదారి నిర్మించినా పలు చోట్ల అర్ధంతరంగా పనులు నిలిచిపోయాయి. అంతే కాకుండా రాజాంలో ఎస్సీ బాలుర వసతి గృహాల భవనాల్లోనూ, ఎస్టీ బాలికల కళాశాల వసతి గృహాల నిర్మాణంలోనూ దండిగా కమీషన్లు లాగారు. అవినీతికి కాంట్రాక్టర్లు సహకరించకపోవడంతో ఈ రెండింటికి బిల్లులు నిలుపుదల చేయడంతో ఇప్పటికీ ఇవి ప్రారంభానికి నోచుకోలేదు.


ఈ ఫొటోలో వాటర్‌ ట్యాంకు సంతకవిటి మండలం జావాం వద్ద రూ.49 కోట్లతో నిర్మించారు. దీనిద్వారా సంతకవిటి, రేగిడి, రాజాం మండలాల్లోని 136 గ్రామాలకు తాగునీటిని అందించాల్సి ఉంది. కాంట్రాక్టరు వద్ద కమీషన్‌ కోసం కోండ్రు డిమాండ్‌ చేయడంతో పనుల్లో నాణ్యత లోపిం చింది. ఫలితంగా గత కలెక్టర్‌ లక్ష్మీనరసింహం ఈ రక్షిత పథకం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని ధ్రువీకరించి పథకం ప్రారంభాన్ని నిలుపుదల చేశారు. ఈయన బదిలీపై వెళ్లిన వెంటనే తూతూమంత్రంగా పనులు చేసి మమ అనిపించారు. ఈ పథకం ద్వారా ఇప్పటికి పది గ్రామాలకు కూడా పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా కాలేదు.


ఇదిగో ఈ చిత్రంలో కనిపిస్తున్న వంతెన నిర్మాణం వంగర మండలం రుషింగి – వీరఘట్టం మండలం కిమ్మి గ్రామాల మధ్య నాగావళిపై చేపట్టారు. రూ.27 కోట్లతో 2012లో అప్పటి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రిమోట్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. ప్రజలకు సేవచేసే నాయకుడినంటూ చెప్పుకొంటున్న కోండ్రు ఏ ఒక్క రోజైనా ఈ వంతెన నిర్మాణంపై సమీక్షించిన పాపాన పోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు