మింగేసిన సొమ్ము కక్కిస్తున్నారు!

21 Aug, 2015 01:15 IST|Sakshi
మింగేసిన సొమ్ము కక్కిస్తున్నారు!

ఎం.ఆర్.అగ్రహారంలో పడుకు చెరువు గట్టు పనికి ప్రభుత్వ వాస్తవ ధర(క్యూబిక్ మీటర్ 20పైసలు) ఆధారంగా చూస్తే పనిమొత్తం విలువ రూ.80 చెల్లించాల్సి ఉంది. కానీ ఇక్కడ ఉపాధి హామీ పథకం ఉద్యోగులు చేతివాటం  ప్రదర్శించి రూ.3లక్షల 35వేల 600డ్రా చేసేశారు.
 
అదే గ్రామంలో సొంగవాని చెరువు గట్టు పని మొత్తం విలువ రూ.100కు గాను రూ.4లక్షల 19వేల 500డ్రా చేసేశారు. ఇలా 16చెరువులకు వం దల్లో పని జరిగితే  లక్షల్లోనూ డ్రా చేసుకున్నారు.  చెరువు పనుల్లో ఇలా జరిగిన అక్రమాలను చూసి అధికారులే అచ్చెరువొందారు. చాలా చో ట్ల కేవలం రూ.100 లోపు జరిగిన పనికి  ఏకంగా లక్షలు డ్రాచేశారు. వారిని అలాగే వదిలేస్తే ఈ అవినీతి రోగం అంతటా పాకిపోతుందని భావించి తీవ్రంగా స్పందిం చారు. తిన్నదంతా కక్కిస్తున్నారు.
- సాక్షి కథనంతో అప్రమత్తమైన అధికారులు
- తెర్లాం ఉపాధి హామీ అవినీతిపై సీరియస్‌గా వ్యవహరించిన డ్వామా అధికారులు
- సస్పెండైన ఉద్యోగుల నుంచి సొమ్ము రికవరీ
- ఇప్పటికే రూ.12 లక్షలు చెల్లించిన అక్రమార్కులు
- మిగతా రూ.8 లక్షలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి
సాక్షి ప్రతినిధి, విజయనగరం :
సాంకేతిక లోపాన్ని ఆసరాగా చేసుకుని చెరువు గట్ల అభివృద్ధి పనుల్లో మింగేసిన నిధుల్ని అక్రమార్కుల నుంచి డ్వామా అధికారులు కక్కిస్తున్నారు. గట్టు తెగిన అవినీతి శీర్షికతో  ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో అప్రమత్తమైన అధికారులు ఇప్పటికే తొమ్మిది మందిని సస్పెండ్ చేయగా, ఇప్పుడా తొమ్మిది మంది  నుంచి నిధుల్ని రికవరీ చేస్తున్నారు. రూ.20 లక్షల మేర అవినీతి జరగ్గా ఇందులో రూ.12 లక్షల మేర ఇప్పటికే రికవరీ చేశారు. మిగతా మొత్తాన్ని అక్రమార్కుల నుంచి కక్కించే పనిలో నిమగ్నమయ్యారు.
 
రూ.20 బదులు రూ.838 చొప్పున డ్రా...
ఉపాధి హామీ పథకం కింద చెరువు గట్టు అభివృద్ధి పనుల్ని తెర్లాం మండలంలోని ఎనిమిది పంచాయతీల్లో గల 16చెరువుల్లో చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేవలం ట్రాక్టర్‌తో చదును (ప్లౌవింగ్) పనులు చేయాల్సి ఉంది. దీనికోసం క్యూబిక్ మీటర్‌కు 20పైసలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ తెర్లాం మండలంలోని   ఎం.ఆర్.అగ్రహారం, నందిగాం, చిన్నయ్యపేట, లింగాపురం, నందబలగ, ఎన్.బూర్జవలస, రాజయ్యపేట, వెలగవలస గ్రామాల్లో గల చెరువు గట్టు అభివృద్ధి పనులకు క్యూబిక్ మీటర్‌కి 20పైసలకు గాను రూ.838ల చొప్పున డ్రా చేసేశారు.

అదెలాగంటే ఈ ఏడాది జనవరిలో ప్లావింగ్ పనులకు  క్యూబిక్ మీటర్‌కి 20పైసలకు బదులు  రూ.839 నిర్ధేశిస్తూ టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్) సంస్థ సాప్ట్‌వేర్‌లో పొరపాటున నమోదు చేసింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఇక్కడ  ఉపాధి హామీ పథకం ఉద్యోగులు కొందరు క్యూబిక్ మీటర్ రూ.839 కింద చెరువు గట్టు అభివృద్ధి పనులు చేపట్టేశారు. తమకు కావల్సిన సప్లయిర్స్ చేత పనులు చేయించేశారు. ఆ మేరకు సాప్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేసుకుని సుమారు రూ. 20 లక్షలు అదనంగా డ్రా చేసేశారు.

ఈ మొత్తమంతా నాలుగు బ్యాంకు ఖాతాలకే జమ అయ్యింది. వాస్తవంగా చెరువు గట్ల అభివృద్ధి పనుల్ని సర్పంచ్‌ల ద్వారా చేపట్టాల్సి ఉంది. వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. ఒకవేళ సర్పంచ్‌లు కాకపోతే రిజిస్టర్ కాబడిన సప్లయిర్స్ చేత పనులు చేయించి, వారి ఖాతాలకు జమ చేయాలి. అయితే, సర్పంచ్‌లున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా తమ అనుకూలమైన సప్లయిర్స్ చేత పనులు చేయించారు. పైన పేర్కొన్న 16 చెరువుల పనుల్ని వర్రి విజయ, సీహెచ్ రాము, డి.శ్రీనివాస్ వ్యక్తుల చేతనే కానిచ్చేయడం గమనార్హం. వీరి ఖాతాలకే అదనపు చెల్లింపులు చేశారు. ఒకే వ్యక్తి ఖాతాకు లక్షలాది రూపాయలు జమ అవుతున్నా అధికారులు గమనించకపోవడం ఆశ్చర్యమేస్తోంది.  వాస్తవానికి మండలంలో సప్లయిర్స్ లేకపోయిన పక్షంలో మాత్రమే పక్క మండలాల్లో ఉన్న సప్లయిర్స్‌కు పనులు అప్పగించొచ్చు.  అదీ కూడా సర్పంచ్‌ల సమ్మతిమేరకు చేయాలి. అయితే, సర్పంచ్‌ల వద్ద ఖాళీ రసీదులపై సంతకాలు తీసుకుని కొందరు ఉద్యోగులు తతంగం నడిపినట్టు తెలిసింది.
 
సాక్షి కథనంతో కదలిక...
ఈ మొత్తం వ్యవహారాన్ని ఆధారాలతో సహా ‘సాక్షి’ బయటపెట్టింది. దీంతో డ్వామా పీడీ ప్రశాంతి అప్రమత్తమై యుద్ధ ప్రాతిపదికన విచారణ చేయించారు. అడిషనల్ పీడీ అప్పలనాయుడు  క్షేత్రస్థాయిలో విచారణ జరపాగా ‘సాక్షి’ పేర్కొన్న అవకతవకల్ని వాస్తవమని గుర్తించారు. రూ.20 లక్షల మేర మింగేశారని నిర్దారించారు. అంతేకాకుండా ఇందులో ప్రమేయం ఉన్న ఉద్యోగుల జాబితాను కూడా ప్రాజెక్టు డెరైక్టర్‌కు సమర్పించారు. దీంతో ఒక అడిషనల్ ప్రాజెక్టు ఆఫీసర్‌ను, ఒక జూనియర్ ఇంజనీర్‌ను, నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లను, ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లను తక్షణమే సస్పెండ్ చేశారు. అంతేకాకుండా వారి నుంచి రికవరీకి ఆదేశించారు. క్రిమినల్ కేసులు కూడా పెట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో అక్రమార్కులు దిగమింగిన సొమ్మును కక్కే పనిలో పడ్డారు. ఇప్పటికే రూ.12లక్షలు జమ చేశారు. మిగతా రూ.8లక్షలు వీలైనంత వేగంగా చెల్లిస్తామని అధికారులకు హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు