అనుభవంతో అవినీతి అభివృద్ధి

12 Aug, 2018 08:59 IST|Sakshi

చంద్రబాబుపై బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి  లక్ష్మీనాయణరెడ్డి విమర్శ

దర్శి: దేశంలో అందరికంటే ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్నట్లు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి రాష్ట్రంగా తీర్చి దిద్దడంలో ఆయన అనుభవాన్ని చూపించారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరువ లక్ష్మీ నారాయణ రెడ్డి విమర్శించారు. స్థానిక ఆపార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ నరశింహరావు అడిగిన రూ. 53 వేల కోట్లు పీడీ అకౌంట్లలో ఎందుకు జమచేయాల్సి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. 

కేంద్రం ఇస్తున్న ని«ధులతో కడుతున్న పోలవరం తానే కడుతున్నట్లు ఆంధ్ర ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని అన్నారు. తాగునీటి అవసరాలు తీర్చే వెలుగొండ, గుండ్లకమ్మ, పాలేరు వంటి చిన్న చిన్నప్రాజెక్టులను కూడా నాలుగేళ్లుగా ఎందుకు పూర్తి చేయలేక పోయారో ప్రజలకు చెప్పాలని  ప్రశ్నించారు. రూ. 25 వేల కోట్లతో అభివృద్ధి చెందే రామాయపట్నం పోర్టుకు ఎందుకు అనుకూలంతో కూడిన ప్రత్యుత్తరం కేంద్రానికి ఇవ్వలేక పోతున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజల వద్ద పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బుతో ధర్మదీక్షలు, విదేశాల పర్యటనల పేరుతో  దర్వినియోగం చేస్తూ, తనకు అనుకూలమైన వారికి దోచి పెడుతూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని మండి పడ్డారు. 

ఇప్పటికీ జిల్లాలో జరుగుతున్న ఇసుకమాఫియా, అటవీ శాఖలో జరుగుతున్న ఎర్రచందనం అక్రమాలను ఎప్పుడు అరికడతారని ప్రశ్నించారు. దర్శి నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి శిద్దా రాఘవరావు 2014లో ఇచ్చిన హామీలైన ఆర్టీసీ డిపో, ఎర్రచెర్వును మంచినీటి చెరువుగా మార్చడం, దర్శి కేంద్రంగా రెవెన్యూ డివిజన్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్‌ కళాశాల, ఇండోర్‌స్టేడియం, రైతుబజార్, దొనకొండ కేంద్రంగా పారిశ్రామిక హబ్, దర్శి– కురిచేడు, దర్శి–దొనకొండ డబుల్‌ రోడ్డు, వంటి ఎన్నో ప్రజలకు ఉపయోగ పడే హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. 

నియోజకవర్గంలో రూ.2500 కోట్ల అభివృద్ది చేశానని చెప్తున్న మంత్రి శిద్దా కనీసం తాగు నీటి సమస్య తీర్చగలిగారా అని ప్రశ్నించారు. ఇక్కడ జరిగింది అభివృద్ధి కాదని కందుల కొనుగోలు కేంద్రాల్లో భారీగా అవినీతి, జన్మభూమి కమిటీలను అడ్డుపెట్టి నీరు–చెట్టు పేరుతో దోపిడీ, నివాసాల మంజూరులో, మరుగుదొడ్లలో అవినీతి సాధించారని ప్రజలే చెప్తున్నారని విమర్శించారు. ఇన్ని కోట్ల అవినీతికి మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తిండి నారాయణరెడ్డి, మండల పార్టీ అ«ధ్యక్షుడు ఆలమోతు అమర్‌నా«థ్, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు మాడపాకుల శ్రీనివాసులు, కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరంరెడ్డి నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కణితి నాగభూషణాచారి, వి. అమరేశ్వరరావు, బోసులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు