క్షేత్రం పేరుతో జోరుగా రియల్‌ వ్యాపారం

5 Dec, 2018 14:22 IST|Sakshi

త్వరపడి కొన్నారో అంతే సంగతులు 

క్షేత్రం పేరుతో జోరుగా రియల్‌ వ్యాపారం

నీరుకూడా దొరకని ప్రాంతాల్లో వెంచర్లు

లబోదిబోమంటున్న కొనుగోలుదారులు  

ద్వారకాతిరుమల: ‘శ్రీవారి క్షేత్రానికి కూతవేటు దూరంలోనే.. నాలుగడుగులేస్తే స్వామి సన్నిధికి చేరుకోవచ్చు.. అతి తక్కువ ధరకు ప్లాటును పొందండి.. త్వరపడండి..’ అంటూ కొందరు రియల్‌ వ్యాపారులు ద్వారకాతిరుమల క్షేత్రంలో జోరుగా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. క్షేత్రానికి సమీపంలో ఉన్న  గ్రామాల్లోని కొండ గుట్టలను సైతం కొందరు వ్యాపారులు వెంచర్లుగా మార్చేస్తున్నారు. కనీసం అక్కడ మంచినీరు కూడా దొరకని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే సంపాదనే ధ్యేయంగా పలువురు వ్యాపారులు మాయ మాటలు చెబుతూ, అమాయకులకు ఆ ప్లాట్లను అంటగడుతున్నారు. కొనుగోలు చేసిన తరువాత అవి ఎందుకూ పనికిరాక అనేకమంది లబోదిబోమంటున్నారు. దేవుడి సన్నిధికి దగ్గర్లో ఉండొచ్చన్న ఆశతో రూ. లక్షలు కుమ్మరించి కొనుగోలు చేసిన ప్లాట్లు, అక్కరకు రాకపోయే సరికి, తిరిగి వాటిని వదిలించుకునేందుకు కొనుగోలుదారులు నానా తంటాలు పడుతున్నారు.

చినవెంకన్న సాక్షిగా భక్తులను టార్గెట్‌ చేస్తూ సాగుతున్న వ్యాపారమిదీ.. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ద్వారకాతిరుమల ఒకటి. ఇక్కడ సెంటు భూమి ఉంటే చాలనుకునేవారు కోకొల్లలు. ఎందుకంటే పుణ్యక్షేత్రంలో శేషజీవితాన్ని గడిపితే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నది కొందరి భక్తుల భావన. ఉద్యోగరీత్యా ఇక్కడకు వచ్చేవారిలో అధికశాతం మంది ఆలోచన కూడా అదే. అందుకే ఇక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. క్షేత్రదేవత కుంకుళ్లమ్మ ఆలయ సమీపంలో ప్రస్తుతం ఎకరం భూమి రూ.కోటి  పైమాటే పలుకుతోంది. ఇక ఆలయానికి సమీపంలో అయితే చెప్పనక్కరలేదు. ధరలు వింటే గుండెగుబేల్‌మంటుంది. క్షేత్రంలో గజం భూమి రూ.25 వేలకు పైగా పలుకుతుంటే, కుంకుళ్లమ్మ ఆలయ సమీప ప్రాంతాల్లో గజం భూమి రూ.15 వేల వరకు ఉంది. అయినా కొనుగోలు చేసేందుకు చాలా మంది వెనకాడటం లేదు. 

కొండల్లో రియల్‌ వెంచర్లు:
 
ద్వారకాతిరుమల పరిసర గ్రామాల్లోని కొండప్రాంతాల్లో సైతం రియల్‌ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. చుక్కనీరు కూడా దొరకని ప్రదేశాల్లో వెంచర్లు వేసి జోరుగా విక్రయిస్తున్నారు. వ్యాపారులు చేసే ప్రచార ఆర్భాటాలను చూసి అనేక మంది, భవిష్యత్తులో ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్న ఆశతో ప్లాట్లను రూ. లక్షలు పోసి కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఇలా కొనుగోలు చేసిన వారు చాలా మంది, తిరిగి వాటిని అమ్ముకునే వీలు లేక నానా అవస్థలు పడుతున్నారు. రాళ్లకుంట, సత్తెన్నగూడెం, తిమ్మాపురం తదితర గ్రామాల్లోని రహదార్ల పక్కనున్న వెంచర్లు ఇందుకు దర్పణంగా నిలుస్తున్నాయి. 

భూములకే రెక్కలొచ్చాయి:
క్షేత్రంలో ఏకంగా భూములకే రెక్కలొచ్చాయి. ఇక్కడ స్థలాల విలువ రూ.కోట్లు పలుకుతుండటం వల్ల కొందరు దళారులు స్థానిక వసంత్‌నగర్‌ కాలనీ వద్ద ఉన్న ఆర్‌ఎస్‌ నంబర్‌ 11, 1/2 లోని ఎంతో విలువైన కొండ పోరంబోకు భూమిని ఆక్రమించుకున్నారు. అంతటితో ఆగకుండా సొంత భూముల్లా దర్జాగా అమ్ముకుని, లక్షలు మూటగట్టుకున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికెళ్లినా ఇప్పటి వరకు ఫలితం లేదు. క్షేత్ర పరిసరాల్లో భూముల ధరలు ఏవిధంగా పెరుగుతున్నాయో.. అదేవిధంగా అన్యాక్రాంతమవుతున్నాయి. ఒక పక్క రియల్‌ వ్యాపారులు.. మరో పక్క దళారులు తమ దందాను దర్జాగా సాగిస్తున్నారనడానికి ఈ భూబాగోతం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.   

మరిన్ని వార్తలు