మొక్కే గదా అని మింగేస్తే..!

5 Nov, 2018 12:45 IST|Sakshi
మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో శనివారం సోషల్‌ ఆడిట్‌ నిర్వహిస్తున్న అధికారులు

‘వెలుగు’ లోకి వచ్చిన అవినీతి

లక్షలాది రూపాయల స్వాహా

కృష్ణాజిల్లా, గూడూరు (పెడన) : ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీల్లో వెలుగు చూసిన భారీ అవినీతి వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతోంది. పదిహేను రోజుల పాటు ప్రతి పంచాయతీలో గ్రామ సభలు ఏర్పాటు చేసి బహిరంగ విచారణ ద్వారా సామాజిక తనిఖీలు చేపట్టిన రిసోర్స్‌ పర్సన్‌లు మండలంలో దాదాపు రూ.17 లక్షల మేర అక్రమాలు జరిగినట్లు తమ నివేదికలో తేల్చారు. అయితే అంత మొత్తంలో అవినీతి జరిగినట్లు బయటకు రానీయకుండా మండలస్థాయిలోని ప్రజా ప్రతినిధి వారిపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అయినా వారు ఏ మాత్రం ఒత్తిడులకు లొంగకుండా ఖచ్చితమైన నివేదికను సమర్పించినట్లు సమాచారం. అయితే రికవరీ విషయంలో సదరు నేత ప్రయత్నాలు ఫలించినట్లు అర్ధమవుతోంది. అందుకే కేవలం రూ.5.58 లక్షల రికవరీతో సరి పెట్టినట్లు తెలిసింది. మొక్కే గదా అని వదిలేయకుండా వాటి మాటున రూ.లక్షలాది నిధులను మింగేసిన అక్రమార్కులను గుర్తించి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు సామాజిక తనిఖీ రిసోర్స్‌ పర్సన్‌లు.

రూ.25 లక్షల మేర పనులు..
2017 అక్టోబరు నుంచి 2018 మార్చి 31 మధ్యకాలంలో మండలంలో దాదాపు రూ.25 లక్షల ని«ధులను జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మళ్లించి వెలుగు శాఖ ఆధ్వర్యంలో రోడ్ల వెంబడి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. పండ్లు ఇచ్చే రకాల మొక్కలతో పాటుగా నీడను ఇచ్చే మొక్కలు నాటడం, వాటిని రక్షించడానికి చుట్టూ ట్రీ గార్డులు ఏర్పాటు చేయడం, వాటికి నీరు పోయడం వంటి పనులను వృక్ష మిత్రలకు అప్పగించారు. అయితే ఇక్కడే అక్రమాలకు తెర లేచినట్లు సమాచారం. మొక్కలు తీసుకురావడం నుంచి నాటడం వరకు అన్నిచోట్లా దొంగ లెక్కలతో మాయ చేసినట్లు తెలుస్తోంది. కేవలం వృక్ష మిత్రలు, నేతలు కుమ్మక్కు అవ్వడంతోనే ఈ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏ గ్రామంలో చూసినా రికార్డులపరంగా నాటిన మొక్కలకు వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఉన్న వాటికి ఏ మాత్రం పొంతన లేకపోవడమే దీనికి నిదర్శనం. నాటని మొక్కలను నాటినట్లు చూపించగా... వాటికి ట్రీ గార్డులు అమర్చడం, అసలు లేని మొక్కలకు సైతం నీళ్లు పోసినట్లు నిధులు స్వాహా చేయడం విశేషం.

అధికారుల బాధ్యతా రాహిత్యం..
ఉపాధి హామీ పథకం నిధులు కావడంతో సదరు పనులపై ‘వెలుగు’ అధికారులతో పాటుగా మండల పరిషత్‌ అధికారి, జాతీయ ఉపాధి హామీ పథకం అధికారులు పర్యవేక్షించాల్సి ఉంది. అయితే మూడు శాఖల అధికారుల బా«ధ్యతా రాహిత్యం కారణంగానే ఇంతటి భారీ స్థాయిలో అక్రమాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. ఇదే విషయం తమ సామాజిక తనిçఖీలలో కూడా వెల్లడైనట్లు తనిఖీ బృంద సభ్యులు తమ నివేదికలో వెల్లడించడం గమనార్హం. కనీసం మూడు నెలలకు ఒక సారైనా క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి రికార్డులలో నమోదు చేయాల్సిన అధికారులు తమ బాధ్యతను పూర్తిగా విస్మరించడం కారణంగానే ఈ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు వారు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు