ఏసీబీ వలలో అవినీతి చేప

31 Oct, 2015 01:57 IST|Sakshi
ఏసీబీ వలలో అవినీతి చేప

పట్టాదారుపాసుబుక్కుల మంజూరుకు లంచం డిమాండ్
రూ. 35వేలు తీసుకుంటూ పట్టుబడిన పీలేరు తహశీల్దార్

 
పీలేరు : ఉచితంగా సేవలందించాల్సిన ఆ అధికారి అడ్డుగోలు సంపాదనకు అలవాటు పడ్డాడు. పట్టాదారుపాసుబుక్కుల కోసం  లంచం డిమాండ్ చే శాడు. అంత ఇచ్చుకోలేనని ప్రాదేయపడినా జాలి లేకుండా కాదుపొమ్మన్నాడు. చేసేదేమి లేక ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించి అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించాడు. పీలేరు తహశీల్దార్ వీ.సురేష్‌బాబు శుక్రవారం లంచం తీసుకుం టూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తిరుపతి రేంజ్ ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి వివరాల మేరకు.. పీలేరు మండలం ముడుపులవేముల పంచాయతీ కృష్ణారెడ్డిగారిపల్లెకు చెందిన శంకరయ్య కాకులారంపల్లె వద్ద 1.31 ఎకరాల పొలం కొనుగోలు చేశాడు. భూమిని తనపేరిట మార్చుకుని పాసుబుక్కుల కోసం తహశీల్దార్ సురేష్‌బాబు వద్దకు వచ్చాడు. ఆయన సూచన మేరకు గత ఏప్రిల్‌లో మీసేవలో దరఖాస్తు చేసుకున్నాడు. తర్వాత తహశీల్దార్‌ను కలవగా రూ. 50వేలు డిమాండ్ చేశాడు. తాను దళితుడినని, అంత మొత్తం ఇచ్చుకోలేనని చెప్పి నా తహశీల్దార్ మాత్రం కరుణించలేదు. అనంతరం రెండునెలలుగా పలుమార్లు కార్యాలయానికి వెళ్లి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దీంతో రెండు రోజుల క్రితం రూ. 35వేలకు ఒప్పందం కుదుర్చుకుని గురువారం తిరుపతి రేంజ్ ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. 

ఈ మేరకు ఏసీబీ అధికారులు రూ. 35వేలు శంకరయ్యకు ఇచ్చి తహశీల్దార్‌కు  ఇవ్వాలని సూచించి పంపించారు. శుక్రవారం ఉదయం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన 20 నిమిషాల్లో రైతు నగదు ముట్టజెప్పాడు. అక్కడే మాటువేసిన అధికారులు వెంటనే తహశీల్దార్‌ను  అదుపులోకి తీసుకున్నారు. అతని ల్యాప్‌టాప్, రికార్డులు సీజ్ చేశారు. కార్యాలయ సిబ్బంది సెల్‌ఫోన్లు స్విచ్‌ఆఫ్ చేయించి గేట్లు మూసి తనిఖీలు నిర్వహించారు. పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీకి సం బంధించిన రికార్డులు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలోని డేటా పరిశీలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపారు. దాడిలో ఇన్‌స్పెక్టర్లు చంద్రశేఖర్, సుధాకర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఐదేళ్ల క్రితం ఇదే కార్యాలయంలో కులధృవీకరణ పత్రం మంజూరు కోసం జూనియర్ అసిస్టెంట్ రూ. 500 తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే.
 
 

>
మరిన్ని వార్తలు