మత్స్య శాఖలో అవినీతి తిమింగలం 

26 Jun, 2020 09:29 IST|Sakshi
మైలపల్లి నరసింగరావు

గంగపుత్రులకు దక్కాల్సిన సబ్సిడీలు హాంఫట్‌ 

బోట్లు, డీప్‌ సీ వలలు, మోటార్లు, వ్యాన్లు బ్లాక్‌ మార్కెట్‌ చేసిన ఘనుడు 

జిల్లా మత్స్యకార సహకార సంఘం మాజీ అధ్యక్షుడు ‘మైలపల్లి’ అక్రమాలు 

గత సర్కారు హయాంలో టీడీపీ నేతల అండదండలతో రూ.కోటి అవినీతి 

ఆనాటి అవకతవకలపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిన అధికారులు 

తదుపరి చర్యలు తీసుకోవడంలో జాప్యం..

ఎంక్వైరీకి గ్రహణం పట్టిస్తున్నట్టు ఆరోపణలు 

ఒకటి కాదు... రెండు కాదు... సబ్సిడీల రూపంలో గంగపుత్రులకు అందాల్సిన సుమారు కోటి రూపాయలను అన్నీ తానై మింగేశాడు... 

ఒకరు కాదు ఇద్దరు కాదు... సుమారు వందమంది వరకు సాగర మత్స్యకారులకు సంఘంలో దశాబ్దకాలంపాటు సభ్వత్వాలు దక్కకుండా చేసేశాడు... 

టీడీపీ ముఖ్యనేతల అండదండలతో ఆనాడు అక్రమాలు కొనసాగించాడు.. ఇప్పుడు బండారం బయటపడడంతో దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు... 

జిల్లా మత్స్యకార సహకార సంఘం మాజీ అధ్యక్షుడు మైలపల్లి నరసింగరావు అవినీతి బాగోతమిది.. టీడీపీ నేతల అండదండలతో గంగపుత్రుల ఆశలతో ఆటలాడుకున్నాడు. ఏళ్ల తరబడి అక్రమాలకు పాల్పడిన ఈయనకు.. మత్స్యశాఖలో ఓ కీలక అధికారి ప్రోత్సాహం, సహకారం అందజేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చీ రాగానే అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపడంతో ఈయన గారి వ్యవహారంపై కూడా నేరుగా జిల్లా కలెక్టర్‌ నివాస్‌కే ఫిర్యాదులు అందాయి. మైలపల్లి అక్రమాలపై మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏపీపీఎస్‌ 1964 చట్టం ప్రకారం ‘51 విచారణ’కు ఆదేశించారు. అయితే ఈ విచారణ నివేదికను కూడా బుట్టదాఖలు చేసేలా కొందరు మత్స్యశాఖ అధికారులు పావులు కదుపుతున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.  

అరసవల్లి: శ్రీకాకుళం రూరల్‌ మండలం గణగళ్లపేట సమీపంలో నరసయ్యపేట మత్స్యకార సొసైటీ అధ్యక్షునిగా (ఎంఎఫ్‌సీఎస్‌) తెరమీద కొచ్చిన మైలపల్లి నరసింగరావు... రాజకీయ పలుకుబడితో జిల్లా మత్స్యకార సహకార సంఘ అధ్యక్షునిగా (డీఎఫ్‌సీఎస్‌) ఎన్నికై ఓ వెలుగు వెలిగారు. తెలుగుదేశం పారీ్టకి అనుబంధ సభ్యుడిగా పనిచే స్తూ... స్థానిక నియోజకవర్గ నేతల అండదండలతో మత్స్యశాఖలో కీలకంగా వ్యవహారాలు నడిపారు. సాగర మత్స్యకార సంఘంలో పేరు నమోదు కావాలంటే ఓ రేటు.. వారికి సబ్సిడీ దక్కాలంటే మరో రేటు ఫిక్స్‌ చేసి అక్రమాలకు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలున్నాయి. అలాగే సబ్సిడీపై మత్స్యకారులకు ఇచ్చే లక్షలాది రూపాయల డీప్‌ సీ వలలు, ఇంజిన్‌ బోట్లు, మోటార్లు, నాలుగు చక్రాల రవాణా వాహనాలు.. ఇలా ప్రతి ఒక్క ప్రభుత్వ రాయితీ పథకాల్లోనూ తనదైన శైలిలో అక్రమాలు చేస్తూ అర్హులకు ఒక్క పథకం కూడా అందకుండా రాజకీయం నెరిపారు. 

బ్లాక్‌ మార్కెట్‌లో ప్రభుత్వ పథకాలు 
మత్స్యకార సొసైటీలో సభ్యత్వం ఉంటేనే ప్రభుత్వ పథకాల్లో రాయితీలకు అవకాశముంటుంది. తమకు అనుకూలంగా ఉండేవారికి మాత్రమే సభ్వత్వాలను ఇస్తూ.. వారి పేర్ల మీద వచ్చిన పథకాలను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించేలా నరసింగరావు అక్రమాలకు తెగబడ్డారనే ఆరోపణలున్నాయి. ప్రతి ఏడాది సుమారు నాలుగు వేలమంది వరకు పలు ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులుగా ఉండేవారు. అన్నీ తప్పుడు పేర్లు, తప్పుడు అడ్రస్‌లతో పథకాలను పక్కదారి పట్టించారు. వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రభుత్వం తరపున పంపిణీ చేస్తున్న డీప్‌ సీ వల ఒక్కటి సుమారు రూ.1.75 లక్షలు, ఇంజిన్‌ ధర రూ.70 వేలు, 75 శాతం సబ్సిడీతో ఫోర్‌ వీలర్‌ యూనిట్‌ ధర రూ.8 లక్షలు, మోటరైజ్డ్‌ బోటు రూ.5 లక్షలు, నాటు బోటు రూ. 60 వేలు... వీటిని పక్కదారి పట్టించి అధిక ధరలకు విక్రయించారని తోటి మత్స్యకారులే అంటున్నారు.

ఇలాంటి అక్రమాలతో పాటు సంఘంలో సభ్యత్వం కల్పించకుండా నిజమైన అర్హులను తొక్కిపెడుతున్నారంటూ నరసయ్యపేట, రాజారాంపురం వంటి గ్రామాల నుంచి మత్స్యకారులు జిల్లా కలెక్టర్‌కు ‘స్పందన’ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఆఖరికి జిల్లా రెడ్‌ క్రాస్‌ తరపున ఇచ్చిన ఐస్‌ బాక్స్‌లను కూడా బ్లాక్‌ మార్కెట్‌లో పలు మండలాలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు అధికారుల దృష్టికి తెచ్చారు. గణగళ్లపేటకు చెందిన కొమర గురుమూర్తి అనే బాధితుడు జిల్లా కలెక్టర్‌ నివాస్‌కు గతేడాది జూన్‌లో స్పందనలో ఫిర్యాదు చేశారు. దీని ప్రభావంతో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 51 విచారణకు ఇన్‌చార్జ్‌ జాయింట్‌ డైరక్టర్‌ వి.వి.కృష్ణమూర్తి ఆదేశాలను జారీ చేశారు.  

విచారణను అడ్డుకుంటున్నారా....!..? 
మైలపల్లి నరసింగరావు అక్రమాలపై 51 విచారణ చేసేందుకు గతేడాది ఆగస్టులోనే ఎఫ్‌డీవో డి.గోపికృష్ణను విచారణాధికారిగా నియమించారు. ఈ విచారణ పూర్తయి... నరసింగరావు అక్రమాలన్నీ నిజమే అని నిర్ధారణ అయినప్పటికీ మత్స్యశాఖకు చెందిన కొందరు అధికారులు నివేదికను తొక్కిపెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి కీలక వ్యవహారం తమ హయాంలో బయటకు వస్తే తలనొప్పులనే భావనలో కీలక అధికారులు వ్యవహారం నడుపుతున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ విచారణ ఫైలు ఊసెత్తకపోతే మంచిదనేలా ఓ వర్గం అధికారులు చక్రం తిప్పుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఇలాంటి 51 విచారణను కేవలం మూడు నెలల గరిష్ట కాలంలో పూర్తి చేసి బాధ్యులపై క్రిమినల్‌ చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుంది. అయితే నరసింగరావు విషయంలో మాత్రం ఓ ఉన్నతాధికారి అభయ హస్తం అందిస్తుండడంతో విచారణ ఫైల్‌ను తొక్కిపెట్టేలా వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. దీనిపై జిల్లా కలెక్టర్‌ నివాస్‌ స్పందించి తగు విధంగా చర్యలు చేపడితే తమ సమస్యలు పరిష్కారమవుతాయని, అర్హులందరికీ సభ్యత్వాలు నమోదై ప్రభుత్వ పథకాలన్నీ అందుతాయని మత్స్యకారులు కోరుతున్నారు. 

విచారణ పూర్తి చేశాం 
మైలపల్లి నరసింగరావుపై వచ్చిన వివిధ రకాల ఆరోపణలపై జేడీ ఆదేశాల మేరకు 51 ఎంక్వైరీ చేపట్టాను. దాదాపుగా ఆరోపణలన్నింటిపై బహిరంగ విచారణ చేశాం. నరసింగరావుతోపాటు బాధితులతో కూడా మాట్లాడి రికార్డు చేశాం. నివేదికను కొద్ది నెలల క్రితమే ఉన్నతాధికారులకు అందజేశాను. 
 – డి.గోపికృష్ణ, విచారణాధికారి 

అక్రమాలపై ఫిర్యాదు చేశాం 
12 ఏళ్లుగా సముద్రంలో వేటకు వెళ్తున్నాం. అయినప్పటికీ మాలో చాలామందికి ఎంఎఫ్‌సీఎస్‌లో సభ్యత్వం లేదు. మైలపల్లి నరసింగరావు ఉద్దేశపూర్వకంగా మాకు సభ్యత్వాలు ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. గతంలో ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదు.  
కొమర గురుమూర్తి, గణగళ్లపేట, శ్రీకాకుళం రూరల్‌ 
 

నిజాలని తేలితే క్రిమినల్‌ చర్యలే... 
మైలపల్లి నరసింగరావుపై ఆరోపణలపై విచారణకు ఆదేశించాం. ఇంకా విచారణ రిపోర్టు రాలేదు. ఆరోపణలు నిర్ధారణ అయితే క్రిమినల్‌ చర్యలు చేపడతాం. విచారణ అధికారి నుంచి అసిస్టెంట్‌ డైరక్టర్‌కు.. అక్కడ నుంచి నాకు ఈ ఫైలు చేరాల్సి ఉంది. విచారణ విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదు.  
వి.వి.కృష్ణమూర్తి, మత్స్యశాఖ ఇన్‌చార్జ్‌ జేడీ 

అక్రమార్కులకు శిక్ష పడాల్సిందే.. 
గతంలో సొసైటీ పేరు చెప్పుకుని లక్షలాది రూపాయలు అక్రమంగా దోచేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. నాడు జరిగిన అక్రమాలతో వందలాదిమందికి సంఘంలో సభ్యత్వం రాలేదు. పథకాలన్నీ పక్కదారి పట్టాయి. గత అక్రమాలపై చర్యలు చేపడితే అర్హులకు న్యాయం జరుగుతుంది.
– కోనాడ నరసింగరావు, డీఎఫ్‌సీఎస్‌ అధ్యక్షుడు  

మరిన్ని వార్తలు