...అవినీతే వీరి వంతు

23 Apr, 2019 13:25 IST|Sakshi

ధాన్యం కొనుగోలు సీజనొస్తే పండగే

జిల్లాలో నిశ్శబ్ద మాఫియా!

గోనె సంచుల్లో చేతివాటం

రవాణాలోనూ అడ్డగోలుతనం

గోనె సంచులు... వీటిలో ధాన్యం, బియ్యాన్ని భద్రపరుస్తారు. కానీ ఈ సంచులతోనే అవినీతి, అక్రమాలు చేస్తూ ఆ నిధులను ఎంచక్కా మెక్కేస్తున్నారు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు. ఖరీఫ్, రబీలకు వేర్వేరుగా సంచులు కొనుగోలు చేసినట్టు రికార్డుల్లో చూపించి స్వాహా చేసేస్తున్నారు. ఇవన్నీ సంబంధితాధికారులకు తెలిసినా ... ఈ అవినీతంతా రాజధాని ప్రాంతమైన అమరావతిలో జరుగుతుండడంతో ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. సంచుల్లో ఇంత కక్కుర్తా అని అనుకుంటున్నారేమో! ఏకంగా కోట్ల రూపాయలు ఇందులో గిట్టుబాటు కావడంతో కొంతమంది అధికారులకు కమీషన్లు ఇచ్చి బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గతంలో ఈ వ్యవహారం సక్రమంగా జరిగేదని, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సంచుల అవినీతి యథేచ్ఛగా సాగిపోతోందని రైతు సంఘ ప్రతినిధులు మండిపడుతున్నారు. ఓ మాఫియాలా తయారై రైతులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ: ధాన్యం కొనుగోలు, గోనె సంచుల్లోనే కాదు వాటి రవాణాలోనూ గోల్‌మాల్‌ జరుగుతోంది. ఖరీఫ్, రబీ సీజన్‌ వస్తే చాలు కొంతమందికి పండగే పండగ. నిబంధనలు పాటించడం లేదు. క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతోందో గుర్తించేవారే కరువయ్యారు. కోట్లాది రూపాయల లావాదేవీలు మాత్రం జరిగిపోతున్నాయి.

కొనుగోలు మాఫియా: ధాన్యం కొనుగోలు వ్యవహారం ప్రతి ఏటా చూస్తునేఉన్నాం. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెబుతున్నారు. కానీ, కొనుగోలు కేంద్రాలు నామ్‌కే వాస్తేగా మిగిలిపోతున్నాయి. చాలా వరకు కేంద్రాలు తెరుచుకోవు. తెరిచిన కేంద్రాలు కూడా సక్రమంగా పనిచేయవు. ఈ క్రమంలో కొనుగోళ్లన్నీ చాలా వరకు మిల్లర్లే చేస్తున్నారు. వారికి నచ్చిన ధరకు కొనుక్కుంటున్నారు. జిల్లాలో ఇదో పెద్ద మాఫియాగా తయారైన విషయం తెలిసిందే. దీన్ని ఎవరూ ఆపలేరు. ఆపేందుకు ప్రయత్నిస్తే ఏకంగా కొనుగోళ్లు ఆగిపోతాయి. ఫలితంగా రైతుల కళ్లాల్లోనే ధాన్యం మగ్గుతాయి. రైతులు నష్టపోవాలే తప్ప కొనుగోళ్లు మాత్రం జరగవు. ఇంకా మొండికేస్తే రైతులే నేరుగా మిల్లర్లను బతిమలాడి కొనుగోలు చేయించుకునే దుస్థితి పలుచోట్ల నెలకొంది. గోల్‌మాల్‌లో ఇదో కోణం.  

సంచుల్లో అవినీతి బాగోతం
కొనుగోలుకు ముందు మరో గోల్‌మాల్‌ జరుగుతుంది. సాధారణంగా రైతులు తమ పొలాల నుంచి గోనె సంచుల్లో ధాన్యం పట్టి కొనుగోలు కేంద్రాలకు తరలించాలి. ఆ తరలింపునకు రైతులకు అవసరమైన గోనె సంచులను ప్రభుత్వమే (పౌర సరఫరాల సంస్థ) సరఫరా చేయాలి. ఈ ప్రక్రియలో ముందుగా గోనె సంచులను కొనుగోలు చేయాలి. గతంలో జిల్లా అధికారులే అవసరమైన సంచులను కంపెనీల నుంచి కొనుగోలు చేసేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇదేదో లాభ సాటిగా ఉందని ఈ సంచులు కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వ పెద్దలు తమ చేతిలోకి తెచ్చుకున్నారు. నాటి నుంచి ప్రభుత్వ పెద్దలే సంబంధిత శాఖను ముందుపెట్టి కొనుగోలు చేసి జిల్లాలకు పంపిస్తున్నారు. ఒక్కో గోనె సంచి ఎంతకు కొనుగోలు చేస్తున్నారన్న దానిపై జిల్లా అధికారుల వద్ద లెక్కలుండవు. ఎందుకని అడిగితే తమకేమి సంబంధం లేదని, కొనుగోలు వ్యవహారమంతా అమరావతిలోనే చూసుకుంటున్నారని చెప్పుకొస్తున్నారు. రాష్ట్రమంతటికీ అమరావతి కేంద్రంగానే కొనుగోళ్లు చేస్తున్నారు. ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లాకు ఖరీఫ్, రబీ సీజన్‌ కోసం నాలుగైదు కోట్ల గోనె సంచులు అవసరం ఉంటుంది. పాత సంచులు చిరిగిపోయాయని చెప్పి ప్రతి ఏటా కొనుగోళ్లు చేస్తూనే ఉన్నారు. మన జిల్లానే తీసుకుంటే ఒక్కో గోనె సంచికి రూ.2 వెనకేసుకున్నా రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు కనీసంగా మిగులుతుంది.

రవాణాలో అడ్డగోలు
గోనె సంచుల తర్వాత జరిగే ప్రక్రియలో కూడా చేతివాటం ప్రదర్శిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పెద్దలు కొనుగోలు చేసిన ఈ సంచులు జిల్లాకు వస్తాయి. జిల్లాకు వచ్చిన వాటిని కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేసేందుకని మరో కాంట్రాక్టర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకు చేరిన ఈ సంచులను పలు స్టోరేజ్‌ కేంద్రాల్లో పెట్టి, వాటి నుంచి సమీప ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరవేయాలి. దీనికోసం ఒక ట్రాన్స్‌పోర్ట్‌కు కాంట్రాక్ట్‌ అప్పగించారు. స్టోరేజీ కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల సరఫరాకైతే 500 సంచుల (ఒక బేల్‌)కు రూ.269, స్టోరేజీ పాయింట్‌ నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల సరఫరాకైతే బేల్‌కు రూ.315, 50 కిలోమీటర్ల పైబడి దూరం ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల సరఫరాకైతే బేల్‌కు రూ.360 చొప్పున ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్‌కు పౌర సరఫరాల సంస్థ చెల్లిస్తుంది. ఇదంతా రికార్డుల ప్రకారంగా చేపట్టే ప్రక్రియ. వాస్తవానికైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల కన్నా మిల్లర్ల వద్దకే సంచులు వెళ్తున్నాయి. ఖరీఫ్‌లో వచ్చిన వాటిని చాలా వరకు రబీ వరకు ఉంచుకుంటున్నారు. కానీ, ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్‌ మాత్రం ఖరీఫ్, రబీకి వేర్వేరుగా సరఫరా చేస్తున్నట్టుగా బిల్లులు చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక్క ఖరీఫ్‌కు సంబంధించి ఇంతవరకు రూ.97 లక్షల బిల్లు అయినట్టు అధికారుల లెక్కలు చూపిస్తున్నారు. సరఫరా చేస్తున్నారా? లేదా అన్నది పక్కన పెడితే అసలు ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్‌ వ్యవహారమే ఏకపక్షంగా జరుగుతోంది. రూ.10 లక్షల లావాదేవీలు దాటితే టెండర్లు పిలవాలి. ఈ టెండర్లలో ఎవరు తక్కువ కోట్‌ చేస్తే వారికి ఆ కాంట్రాక్ట్‌ అప్పగించాలి. కానీ నాలుగైదు ఏళ్లుగా టెండర్లు పిలవకుండా ఒకే కాంట్రాక్టర్‌కు ట్రాన్స్‌పోర్టు బాధ్యతలను ఏకపక్షంగా అప్పగిస్తున్నారు. ఇదంతా అమరావతి పెద్దల డైరెక్షన్‌లో జరుగుతోంది. మరి దీనివెనక ఎవరికెంత ప్రయోజనాలున్నాయో వారికే ఎరుక. మొత్తానికి ధాన్యం కొనుగోలు సీజన్‌ వచ్చిందంటే చాలు కొందరికి కాసులు కురిపిస్తోంది. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా ముడుపుల బాగోతం నడుస్తుండటంతో ఏ ఒక్కరూ కిమ్మనడం లేదు.

పాత కాంట్రాక్టర్‌తోనే గోనె సంచుల సరఫరా
గోనె సంచుల రవాణాలో పాత కాంట్రాక్టరే కొనసాగుతున్నారు. కాంట్రాక్టర్‌ కోసం కొత్తగా టెండర్లు పిలవడం లేదు. పిలవడం వల్ల వచ్చే ప్రయోజనమేదీ ఉండదని భావిస్తున్నాను. ప్రస్తుతం ఇస్తున్నదానికన్నా తక్కువగా కోట్‌ చేసే అవకాశం ఉండదు.– జయరాములు, డిస్ట్రిక్ట్‌ మేనేజర్, పౌరసరఫరాల సంస్థ

మరిన్ని వార్తలు