ఆరోగ్యశాఖలో అవినీతి నిజమే

7 Nov, 2018 04:54 IST|Sakshi

     ఏసీబీ ప్రాథమిక నివేదికలో వెల్లడి  

     వైద్య పరికరాల నిర్వహణ పేరిట భారీగా నిధుల దుర్వినియోగం 

     నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘించారు. 

     పూర్తిస్థాయిలో విచారణకు మరో 3 నెలలు గడువు కావాలి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిన మాట నిజమేనని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. వైద్య పరికరాల నిర్వహణ పేరిట భారీగా నిధులు దుర్వినియోగం చేశారంటూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు జరిపి, నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఏసీబీని ఆదేశించింది. దీంతో ఏసీబీ దర్యాప్తు చేసి, తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. 

కొన్ని అంశాలపై స్పష్టత రావాలి 
రాష్ట్రంలో 1,165 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 195 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 31 ప్రాంతీయ ఆస్పత్రులు, 8 జిల్లా ఆస్పత్రులు, 11 బోధనాసుపత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణ పేరిట రూ.కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు ఏసీబీ గుర్తించింది. టెండర్‌ దశ నుంచే నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంది. ఇంకా కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని, విచారణకు మరో మూడు నెలల గడువు ఇవ్వాలని హైకోర్టును ఏసీబీ కోరింది. అనంతరం తుది నివేదిక ఇస్తామని పేర్కొంది. 

సింగిల్‌ బిడ్డర్‌కే టెండర్‌ 
వైద్య పరికరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2015లో టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో కిర్లోస్కర్‌ టెక్నాలజీస్, రాడిమేజ్‌ టెక్నాలజీస్, జింటెక్‌ సాఫ్ట్‌వేర్, టీబీఎస్‌ మెడికల్‌ సర్వీసెస్‌ సంస్థలు పాల్గొన్నాయి. తొలి మూడు సంస్థలపై ప్రాథమిక దశలోనే అనర్హత వేటు వేశారు. టీబీఎస్‌ సంస్థనే ఎంపిక చేశారని, నిబంధనలకు విరుద్ధంగా సింగిల్‌ బిడ్డర్‌కే ఇచ్చారని ఏసీబీ తెలిపింది. ఆ సంస్థ పనులు మొదలు పెట్టకుండానే మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ కింద రూ.11.46 కోట్లు చెల్లించారని నివేదికలో వెల్లడించింది. పనిచేయని వైద్య పరికరాలను గుర్తించి, ఆడిట్‌ చేసిందనే సాకుతో చైన్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థకు 15 రోజుల్లో రూ.25.56 లక్షలు చెల్లించారని, ఇది నిబంధనలకు విరుద్ధమేనని ఏసీబీ తేల్చిచెప్పింది. 

వారెంటీ ఉన్నా డబ్బులు తీసుకున్నారు 
రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 30 శాతం వైద్య పరికరాలను అసలు గుర్తించకుండానే వాటికి నిర్వహణ పేరుతో డబ్బులు తీసుకున్నట్టు ఏసీబీ విచారణలో తేలింది. కర్నూలు సర్వజనాసుపత్రిలో జెమిని మెడికల్‌ సర్వీసెస్‌ అనే సంస్థ 2010లో రూ.1.69 కోట్లతో ఎంఆర్‌ఐ స్కానర్‌ను ఏర్పాటు చేసింది. ఈ మెషీన్‌కు 7 సంవత్సరాలు వారెంటీ ఉంది. ఈ ఎంఆర్‌ఐ స్కానర్‌ వారెంటీలో ఉన్నప్పటికీ దీన్ని నిర్వహణ పరిధిలోకి తీసుకొచ్చారు. దీని విలువను రూ.3.5 కోట్లు నిర్ణయించి, 8 శాతం నిర్వహణ చార్జీలు వసూలు చేసినట్టు వెల్లడైంది.  

మరిన్ని వార్తలు