తవ్వే కొద్దీ అక్రమాలు

25 Nov, 2014 00:53 IST|Sakshi

పాడేరు/చింతపల్లి: చింతపల్లి సబ్ ట్రెజరీలో తవ్వే కొద్దీ అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. లేని ఉద్యోగుల పేరిట రూ.2.87 కోట్లు పక్కదారి పట్టినట్టు  ప్రాథమిక విచారణలో తేలడంతో జిల్లా ఉన్నతాధికారులు మరింత లోతుగా విచారణకు చర్యలు చేపట్టారు. ట్రెజరీలో అవకతవకలపై సమగ్ర విచారణకు కలెక్టర్ యువరాజ్ ఆదేశించారు. ఇందుకు ప్రత్యేక అధికారిని నియమించారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికను కూడా సమర్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎల్‌ఎఫ్‌ఎల్ ఆడిట్ బృందం చింతపల్లి ఖజానా కార్యాలయంలో సమగ్ర విచారణ జరిపింది. అక్రమాలు వాస్తవమేనని నిర్ధారణకు వచ్చాక, ఆ నివేదికను కలెక్టర్‌కు అందజేసింది.

2013కు ముందు కూడా భారీస్థాయిలో అక్రమాలు జరిగినట్లు అధికారులకు ఫిర్యాదులు అందడంలో 2011 నుంచి సమగ్ర దర్యాప్తు చేపడుతున్నారు. చింతపల్లి ట్రెజరీలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు జరిపిన చెల్లింపుల వివరాలన్నీ సేకరించిన ప్రత్యేక అధికారుల బృందం సుమారు రూ.8 కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టాయనే నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా పలు పీహెచ్‌సీల రికార్డులను అధికారులు మళ్లీ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు.
 
భారీ కుంభకోణంలో 60 మంది

వైద్య ఆరోగ్యశాఖ నిధులను పక్కదారి పట్టించి రూ.కోట్లను కాజేసిన ఈ భారీ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన వైద్య శాఖ ఉన్నతాధికారులు కూడా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. డీఎంహెచ్‌వో, ఏడీఎంహెచ్‌ఓ, ఆయా కార్యాలయాల సీనియర్ అసిస్టెంట్లు, చింతపల్లి ఉప ఖజాన కార్యాలయం పరిధిలోని ఆరోగ్య కేంద్రాల వైద్యులు, కార్యాలయ అధికారులు, కొంతమంది వైద్య ఉద్యోగులు కూడా ఇందులో సూత్రధారులుగా తనిఖీ బృందం అధికారులు నిర్ధారించారు.

కొంత మంది వైద్య ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోనే రూ.లక్షలు డిపాజిట్ అయినా నోరు మెదపకుండా వ్యవహరించిన తీరును కూడా తనిఖీ బృందం అధికారులు తప్పుపడుతున్నారు.  ఈ వ్యవహారంలో వారి పాత్రలపై కూడా నివేదికను సిద్ధం చేశారు. చింతపల్లి ఉపఖజానా కార్యాలయంలో రూ.కోట్ల అవకతవకలను ప్రభుత్వం కూడా తీవ్రంగానే పరిగణిస్తున్నది. జిల్లా కలెక్టర్ యువరాజ్ ఎప్పటికప్పుడు ఈ వివరాలను సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు