దళారుల మహాపెత్తనం

13 Jul, 2015 03:46 IST|Sakshi
దళారుల మహాపెత్తనం

- జీవీఎంసీలో బ్రోకర్ల హడావుడి
- ఉద్యోగులతో సమానంగా చెలామని
- అధికారులతో తెరచాటు ఒప్పందాలు
- అవినీతి చక్రం తిప్పుతున్న కొందరు
విశాఖపట్నం సిటీః
వారు జీవీఎంసీ ఉద్యోగులు కాదు. కానీ ఉద్యోగులొచ్చే సమాయానికి ముందే వస్తుంటారు. ఏదైనా పనిపై వచ్చిన వారు ఆఫీసర్ రాలేదా అంటే వచ్చేస్తారంటూనే వారితో మాట కలుపుతారు. సర్ వచ్చిన వెంటనే ఎవరెవరు వచ్చారో ఆఫీసర్ అడక్కుండానే ముందే చిట్టా విప్పేస్తారు. మామూలుగా అయిపోయే పని అయితే వెంటనే సంతకం పెట్టగానే రండి మీ ఫైల్ అయిపోయిందంటూ ఫోన్ చేసి మరీ రప్పించుకుని ఎంతోకొంత తీసుకుంటారు. ఇదే అలవాటు చేసుకుని ఇప్పుడు కొందరు దళారీలుగా జీవీఎంసీలో పాతుకుపోయారు. తమకొచ్చే చేతి వాటం నుంచే అధికారులకు ‘సహాయ’పడుతుంటారు. దీంతో ఆఫీసర్ కూడా ఏ పనికైనా ఆయన్నే(దళారీ) పిలుస్తుండడంతో అంతా ఆ దళారీ చేతుల్లోనే నడుస్తుందనే భావన ఏర్పడుతోంది. ఇది మహానగర పాలక సంస్థలో అవినీతికి బాట వేస్తోంది.

జీవీఎంసీలోని పట్టణ ప్రణాళిక, ఫైర్, ఇంజనీరింగ్, ప్రజారోగ్య శాఖల్లో దళారీ వ్యవస్థ ఉంది. ప్రజారోగ్య శాఖ జోన్-3 కార్యాలయంలో ఓ హెల్త్ అసిస్టెంట్‌కు సహాయకునిగా కార్యాలయంలో తిష్ట వేసిన దళారీ సంగతి పసిగట్టి కమిషనర్‌ప్రవీణ్‌కుమార్‌కు కొందరు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్ నేరుగా తనిఖీ చేసి ఆ దళారీ ఎవరని అడిగే సరికి కంగుతిన్న సదరు ఉద్యోగి జీవీఎంసీ ఉద్యోగేనని జవాబిచ్చాడు. అతన్ని రెండు వారాల క్రితమే సస్పెండ్ చేశారు.
 
ఫైర్ శాఖలో బుధవారం రాత్రి ఏసీబీ దాడి చేసిన సంఘటనలోనూ ఓ దళారీ పట్టుబడ్డాడు. ఫైర్ శాఖలో ఏసీబీకి చిక్కిన లందా తారక రామకృష్ణ గత కొన్నేళ్లుగా దళారీ అవతారం ఎత్తి భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ సోదాల్లో బయటపడింది. గురువారం తెల్లవారు జాము వరకూ ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. అక్రమాస్తులు ఎంత మేర సంపాదించాడో కోర్టుకు నివేదిక అందజేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
 
వేపగుంట కేంద్రంగా ఉన్న జోన్-6 కార్యాలయంలోనూ దళారులదే రాజ్యం. గత కొన్నేళ్లుగా టౌన్‌ప్లానింగ్‌లో తిష్టవేసిన కొందరు దళారీలదే ఇప్పటికీ ఆడింది ఆట..పాడింది పాట అన్న చందంగా వ్యవహారం సాగుతోంది. ఇక్కడ పాతుకుపోయిన ఛైన్‌మన్ల నుంచే భారీగా వసూళ్లు జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరంతా కార్యాలయంలో వసూళ్లకు పాల్పడరు కాబట్టి ఎక్కడ నిర్మాణం ఉంటే అక్కడికి వెళ్తున్నారు.  వసూళ్లకు పాల్పడి కొంత అధికారులకు ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అనధికారిక నిర్మాణానికి గజాల లెక్కన వీరే వసూళ్లు చేసి ఏసీపీ, టౌన్‌ప్లానింగ్ అధికారులకు ముట్టుజెప్పుతారనే ఆరోపణలున్నాయి.
 
పట్టణ ప్రణాళిక విభాగంలో అర్హత ఉన్న బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు 20 మంది లోపే ఉన్నారు.వీరిలో కొందరు రెవెన్యూ సర్వేలకి, మరి కొందరు పుష్కర విధులకు నియమించారు. దీంతో 10 మందిలోపే బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. 100 మంది ఉండాల్సిన మహానగరంలో 0 మంది ఉండడంతో కొందరు దళారులు నకిలీ బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లుగా అవతారమెత్తారు. భవనం ఎలా నిర్మిస్తున్నారో వీరికి అనవసరం. అడిగినంతా ఇస్తున్నారో లేదో చూసుకుంటారు.నచ్చినంతా ఇవ్వకపోతే అనధికారిక నిర్మాణం అంటూ వాట్స్ అప్‌లో ఫోటోలను కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌కు పెట్టేస్తున్నారు. వెంటనే ఆ భవనాన్ని కొట్టేయమంటూ ఆదేశాలిస్తుండడంతో వీరి ఆగడాలకు అడ్డూఅదపూ లేకుండా పోతోందని పలువురు భవన యజమానులతో బాటు టౌన్‌ప్లానింగ్ ఉద్యోగులు సైతం ఆవేదన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు