అవినీతిని ప్రోత్సహించే విధంగా ఇసుక వేలం ప్రక్రియ

14 Feb, 2016 02:15 IST|Sakshi

తణుకు : ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇసుక వేలంపాటలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు వంక రవీంద్రనాథ్ విమర్శించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇసుక విక్రయించే ధరను ఘనపు అడుగుకు రూ.500 నిర్ధేశిస్తూ కొనేవిలువను రూ.500 కంటే ఎక్కువకు అనుమతించడమంటే కాంట్రాక్టర్‌ను అక్రమ రవాణా చేసుకోమని పరోక్షంగా చెప్పడమే కదా అని ప్రశ్నించారు.
 
  జిల్లాలో అన్ని రీచ్‌ల్లో ప్రజలకు విక్రయించే ధర కంటే దాదాపు రూ.300 ఎక్కువగా ప్రభుత్వానికి చెల్లిస్తామని కాంట్రాక్టర్లు ముందుకు రావడం కచ్చితంగా అవినీతిని ప్రోత్సహించడమే అవుతుందన్నారు. అత్యధిక మొత్తంలో ధర కోట్ చేసిన దరఖాస్తుదారులందరూ టీడీపీ నాయకులు, ఆ పార్టీ నేతల ముఖ్య అనుచరులేనని రవీంద్రనాథ్ ఆరోపించారు. ఈ విధానాలతో ప్రజలకు తక్కువ ధరకు ఇసుక అందించాలనే ఉద్దేశం ఏ మాత్రం లేదన్నారు.
 
 అసమ్మతమైన ఈ వేలాన్ని రద్దు చేసి కాంట్రాక్టర్ల వద్ద నుంచి తక్కువ మొత్తంలో ప్రభుత్వం రుసుంగా తీసుకుని వినియోగదారుడికి తక్కువ ధరకు ఇసుక చేరే విధంగా నిబంధనలు మార్చి పారదర్శకంగా ఇసుక విక్రయాలు చేయాలని కోరారు. రెండేళ్లుగా ఇసుక దొరక్క ప్రజలంతా గృహావసరాలకు అనేక బాధలు పడుతున్నారన్నారు. ఇకనైనా పరిస్థితిని మార్చి ప్రజావసరాలపై ప్రభుత్వం దృష్టిసారించాలని రవీంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు