తవ్వేకొద్దీ అవినీతి

15 Aug, 2014 01:17 IST|Sakshi
తవ్వేకొద్దీ అవినీతి

 సాక్షి ప్రతినిధి, ఏలూరు :  వేంకటేశ్వరస్వామి ఎక్కడ కొలువున్నా నిత్య కల్యాణం.. పచ్చతోరణంగా వైభవోపేతమైన ఉత్సవాలు జరుగుతుంటాయి. కానీ.. ఏలూరు ఆర్‌ఆర్ పేటలోని స్వామి ఉత్సవాలు  కేవలం ఓ అధికారి భోజ్యం కోసమే జరిగాయంటే నమ్మశక్యం కాకపోయినా వాస్తవం. ఉత్సవాల పేరిట భారీగా విరాళాలు వసూలు చేయడం, తూతూమంత్రంగా వేడుకలు జరి పించి లక్షలాది రూపాయలు దిగమింగేయడం రెండేళ్లుగా ఆనవాయితీగా మారింది. అరుునా ఉన్నతాధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. స్వామివారి వజ్ర కిరీట వ్యవహారం ఎటుతిరిగి ఎటొస్తుందోనని భయపడిన అధికారులు ఇటీవల సదరు అధికారిని గుట్టుచప్పుడు కాకుండా బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో గడచిన రెండేళ్లలో ఆయన ఇష్టారాజ్యంగా సాగించిన అవినీతి, అక్రమాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.
 
 ఏడాదికి దాదాపు కోటి రూపాయల ఆదాయంతో కళకళలాడిన ఈ ఆలయం రెండేళ్ల కిందట మేనేజర్‌గా తల్లాప్రగడ విశ్వేశ్వరరావు వచ్చినప్పటి నుంచి ఖర్చులెక్కువ.. ఆదాయం తక్కువ అనే పరిస్థితికి చేరింది. భక్తుల నుంచి వచ్చే విరాళాలు పెరిగినా ఈయన లెక్కాపత్రం లేకుండా సాగించిన ఖర్చులతో చివరకు 8 నెల లుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి నెల కొందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఎస్టాబ్లిష్‌మెంట్ ఖర్చులు  ఆలయానికి వచ్చిన ఆదాయంలో 30 శాతానికి మించకూడదు. ఈయన మేనేజర్‌గా వచ్చిన తర్వాత ఆ ఖర్చులు 60శాతానికి పెరిగిపోయాయి. గుడి ఆదాయం,  ఖర్చులతో నిమిత్తం లేకుండా ఇష్టమొచ్చిన రీతిలో ఎన్‌ఎంఆర్‌లను తీసుకోవడం, అవసరం లేకున్నా ఓ మహిళా ఉద్యోగిని స్కేల్ పరిధిలోకి తీసుకురావడం, కారుణ్య నియామకంలో భాగంగా అటెండర్‌గా 6బి ఆలయం లో ఉన్న మహిళా ఉద్యోగిని 6ఎ పరిధిలోని ఈ ఆలయానికి తీసుకువచ్చి జీతం పెంచేయడం వంటి నిర్వాకాలతో ఖర్చులు తడిసిమోపెడయ్యాయి.
 
 భక్తుల నుంచి వచ్చే విరాళాలకు లెక్కాపత్రం లేకపోవడం, ఉత్సవాలు మొదలుకుని ఆలయ నిర్వహణకు అయ్యే ప్రతి ఖర్చులోనూ సగానికి సగం మిగుల్చుకున్న ఈయన ధోరణితో ఓ దశలో ఆలయానికి వచ్చే ఆదాయం కంటే ఈయన ఆదాయమే ఎక్కువన్న విమర్శలనూ మూటగట్టుకున్నారు. ఈయన హయాంలోనే జరిగిన సీసీ కెమెరాలు, జనరేటర్ కొనుగోళ్లలోనూ డబ్బులు మిగుల్చుకున్నారన్న ఆరోపణలున్నాయి. శాశ్వత పరిచారకుల ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇద్దరు యువకుల నుంచి చెరో రూ.70వేలు తీసుకుని వారిని కొన్నాళ్లపాటు కొనసాగించిన సదరు అధికారి తాను బదిలీపై వెళ్లే ముందు నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగం నుంచి తొలగించేశారు. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఆలయ ప్రాకారాన్ని పగుల గొట్టించి చేపల మందు దుకాణానికి అద్దెకిచ్చిన ఈయన నిర్వాకం గురించి ఎంత చెప్పినా తక్కువే. మొత్తంగా రెండేళ్లలో లక్షలాది రూపాయలు ఎగరేసుకుపోయి ఉంటాడని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆలయ ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించారంటే వెంకన్న గుడిలో విశ్వేశ్వరరావు లీలలు అర్థం చేసుకోవచ్చు.
 
 ‘వజ్ర కిరీటం’పై విచారణ
 సాక్షి ప్రతినిధి, ఏలూరు : నగరంలోని ఆర్‌ఆర్ పేటలో కొలువైన వేంకటేశ్వరస్వామి వజ్రకిరీటం పేరిట జరిగిన అవినీతి బాగోతంపై  పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్టు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ వెల్లడిం చారు. ‘వెంకన్నకు శఠగోపం.. వజ్ర కిరీటం పేరిట లక్షలు కైంకర్యం’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం దేవాలయ, దేవాదాయ వర్గాల్లో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ.. పత్రికలో కథనం ప్రచురితమైన విషయూన్ని కాకినాడలోని డెప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. వెంటనే స్పందించిన ఆయన జ్యూవెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్(జేవీవో)ను ఈనెల 21న ఏలూరు వెళ్లి విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించారని తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాతే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.

 

మరిన్ని వార్తలు