‘టెక్విప్‌’ పేరుతో దోపిడీ..

31 Jan, 2020 12:14 IST|Sakshi

‘టెక్విప్‌’ పేరుతో దోపిడీ

జేఎన్‌టీయూ(ఏ)లో అడ్డగోలు బాగోతం

అనుమతి లేకుండా రూ.1.20 కోట్ల ఖర్చుకు

తాజాగా రూ.33 లక్షల నిధులకు కన్నం  

సమాజానికే ఆదర్శంగా ఉండాల్సిన అధ్యాపకులు అడ్డదారులు తొక్కుతున్నారు. అధికార దుర్వినియోగంతో అందినకాడికి దోచుకునేందుకు సిద్ధమయ్యారు. ‘టెక్విప్‌’ కింద జేఎన్‌టీయూ(ఏ)లో మిగిలినపోయిన
నిధులను ‘శిక్షణ’ పేరుతో కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో గత టీడీపీ హయాంలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఓ వెలుగు వెలిగిన వ్యక్తి కీలక పాత్ర పోషిస్తుండగా.. ఆయనకు వర్సిటీ ఉన్నతాధికారులు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం మూడు వారాల కోర్సు శిక్షణకు ఇప్పటికే రూ.33 లక్షల నిధులు కేటాయించారు. మరో మూడు బ్యాచ్‌ల విద్యార్థులకు ఇలా శిక్షణ ఇచ్చేందుకు రూ.1.20 కోట్ల నిధులు ఖర్చుపెట్టి.. ఇందులో సగం పైగా నొక్కేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

జేఎన్‌టీయూ: విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్, కమ్యూనికేషన్స్‌ స్కిల్స్, సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌లు, సెమినార్లు, అధ్యాపకులకు డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు నిర్వహించేందుకు ‘టెక్విప్‌’–3(టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌) పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేఎన్‌టీయూ(ఏ)కు రూ.7 కోట్లు మంజూరు చేశాయి. 2017 ఏప్రిల్‌లో ఈ నిధులు విడుదల కాగా, 2020 మార్చి 31 లోపు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిధుల వినియోగం ఆశించినంత స్థాయిలో జరగలేదు. దీంతో ఎలాగైనా గడువులోగా మొత్తం రూ.7 కోట్ల నిధులను ఖర్చు చేయాలనే ఉద్దేశంతో వర్సిటీ ఉన్నతాధికారులు హడావుడిగా విద్యార్థులకు ‘పైథాన్‌’ పేరుతో మూడు వారాల శిక్షణ కార్యక్రమం ప్లాన్‌ చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం బీటెక్‌ ఫైనలియర్‌ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఆ తర్వాత మూడు, రెండు, మొదటి సంవత్సరాల విద్యార్థులకు మార్చి నెలాఖరులోగా శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందుకోసం రూ.1.20 కోట్ల నిధులు ఖర్చు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వాస్తవానికి సివిల్, కెమికల్‌ విభాగం విద్యార్థులకు అవసరం లేకపోయినా ‘పైథాన్‌’ శిక్షణ ఇస్తున్నారు. 

అధికార దుర్వినియోగం
వాస్తవానికి ‘టెక్విప్‌’ నిధులను వినియోగించేందుకు గవర్నింగ్‌ బాడీ అనుమతి తీసుకోవాలి. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సలహాలు ప్రధానం. అయితే జేఎన్‌టీయూ(ఏ) ఇంజినీరింగ్‌కళాశాలలో నిర్వహిస్తున్న పైథాన్‌ శిక్షణకు సంబంధించి స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అనుమతి తీసుకోలేదు. గత ప్రభుత్వం హయాంలో పెత్తనం చెలాయించిన వ్యక్తి అజమాయిషీలో ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు. ఆయన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులే ఫ్యాకల్టీలుగా నియమించుకుని నిధులను దండుకుంటున్నారు. 

ఒక్కో ఫ్యాకల్టీ గంటన్నర తరగతిలో బోధిస్తే రూ. 3 వేలు ఇస్తున్నారు.
రోజంతా నాలుగు సెషన్లు నిర్వహించాలి. అంటే ఒక్కో రోజుకు ఒక్కో ఫ్యాకల్టీకి రూ. 12 వేలు వేతనం చెల్లిస్తామని నిర్దేశించారు.  
ఒక్కో డిపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్యాకల్టీకి రోజుకు రూ. 12 వేలు చొప్పున .. ఆరు విభాగాల్లో రోజూ రూ. 72 వేల చొప్పున వారంలో ఆరు రోజులకు కలిపి ఫ్యాక్టలీలకే మొత్తం రూ. 4.32 లక్షలు చెల్లించేలా ప్లాన్‌ సిద్ధం చేశారు.
జనవరి 20న ప్రారంభమైన ‘పైథాన్‌’ తరగతులు మార్చి 9వతేదీ వరకు తరగతులు కొనసాగనున్నాయి. అప్పటి దాకా మొత్తం 8 వారాల శిక్షణకు కలిపి రూ. 33.12 లక్షల నిధులను ఖర్చు చేయనున్నారు. 

దొంగ చేతికి తాళాలు
గతంలో జేఎన్‌టీయూ కలికిరి ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రాక్టికల్స్‌ తరగతుల కోసం ప్రతి ఏటా రెండు దఫాలుగా అనంతపురం కళాశాలకు వచ్చేవారు. వీరందరి నుంచి మెస్‌బిల్లులు చలాన్ల రూపంలో కాకుండా నేరుగా నగదు కట్టించుకున్నారు. ఈ మొత్తాన్ని హాస్టల్‌ ఖాతాకు జమ చేయకుండా అప్పటి హాస్టల్‌ మేనేజర్‌ రూ.50 లక్షల మేర స్వాహా చేశారు. ఈ వ్యవహారం బట్టబయలైనా చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అయినా తాజాగా ఆయన్నే రూ.కోట్లు ఖర్చు చేసే ‘టెక్విప్‌’ కార్యక్రమానికి కోఆర్డినేటర్‌గా నియమించారు. దీంతో ఆయన తన ఇష్టం వచ్చినట్లు నిధులను ఖర్చు చేయడానికి పథకాలు రూపొందిస్తున్నారు. 

పాలక మండలి అనుమతుల్లేకుండానే..
జేఎన్‌టీయూ(ఏ) ఇంజినీరింగ్‌ కళాశాల కీలకమైన ఉన్నతాధికారి సైతం ఓ ప్రింటర్స్‌ నుంచి రూ.లక్షలు డిమాండ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో టేపులు బహిర్గతమయ్యాయి. ఇలాంటి వ్యక్తులకు ‘టెక్విప్‌’ బాధ్యతలు అప్పగించడంతో.. వారంతా శిక్షణ పేరుతో ఈ నిధులను భోంచేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వాస్తవానికి రూ.5 లక్షల నగదు దాటే ప్రతి పనికీ పాలకమండలి అనుమతి తప్పనిసరి. అయితే ఏకంగా రూ.33.12 లక్షలు ఖర్చు చేయనున్న పైథాన్‌ శిక్షణ తరగతులకు పాలకమండలి అనుమతి తీసుకోలేదు. కనీసం కళాశాల గవర్నింగ్‌ బాడీ అనుమతి లేకుండా నిధుల వినియోగానికి నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ‘టెక్విప్‌’ కోఆర్డినేటర్గా ఉన్న ఉన్నతాధికారిపై గతంలో అవినీతి ఆరోపణలు ఉండడం, గత టీడీపీ ప్రభుత్వం హయాంలో స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్పెషల్‌ సెక్రెటరీగా పనిచేసిన వారి ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు నిర్వహించడంపై విద్యార్థులూ పెదవి విరుస్తున్నారు.

పరిశీలిస్తాం
‘పైథాన్‌’ శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన పలు అంశాలపై ఆరా తీస్తున్నాం. అన్ని వివరాలను  పరిశీలించి అధికార దుర్వినియోగం చేశారా... లేదా అనే కోణంలో విచారణ చేపడతాం. ఆ తర్వాత తగు చర్యలు తీసుకుంటాం.– ఎం.విజయకుమార్,రిజిస్ట్రార్, జేఎన్‌టీయూ(ఏ) 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా