‘కలికిరి’లో గోల్‌మాల్‌

1 Feb, 2019 14:03 IST|Sakshi
జేఎన్‌టీయూ కలికిరి ఇంజినీరింగ్‌ కళాశాల

రూ.13 కోట్ల పనులు ఎలాంటి టెండర్లు లేకుండానే అప్పగింత

విధివిధానాలు, నియమ నిబంధనలకు విరుద్ధంగా నోడల్‌ కమిటీ సిఫార్సు

భవన నిర్మాణ సంస్థకే ఫర్నిచర్, ల్యాబ్‌ పరికరాల టెండర్‌

సమాచార హక్కు చట్టం ద్వారా నిగ్గుతేలిన నిజాలు

వెలుగులోకి జేఎన్‌టీయూ(కలికిరి) అవినీతి బాగోతం

చిత్తూరు, జేఎన్‌టీయూ(ఏ) పరిధిలోని కలికిరి ఇంజినీరింగ్‌ కళాశాలలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నూతన ఇంజినీరింగ్‌ కళాశాల భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఫర్నిచర్, ల్యాబ్‌ పరికరాల ఏర్పాటుకు సంబంధించి అధికార దుర్వినియోగం జరిగింది. కోట్లాది రూపాయల విలువైన పరికరాలు, ఫర్నిచర్‌కు సంబంధించి ఎలాంటి టెండర్లు లేకుండానే కాంట్రాక్టర్‌కు కోట్లాది రూపాయలు దోచిపెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా సాగిన ఈ వ్యవహారంలో యూనివర్సిటీ ఖజానాకు భారీగా గండి పడింది.

జేఎన్‌టీయూ: జేఎన్‌టీయూ కలికిరి ఇంజినీరింగ్‌ కళాశాల నిర్మాణానికి సంబంధించి జేఎన్‌టీయూ అనంతపురం–జేఎన్‌ఏ అండ్‌ ఎఫ్‌ఏ యూనివర్సిటీల మధ్య  2014 ఫిబ్రవరి 5న అవగాహన ఒప్పందం కుదిరింది. భవన నిర్మాణ పనులకు సంబంధించి ప్లానింగ్, ఎక్స్‌కూషన్, టెండర్‌ సెలెక్షన్‌ ఆఫ్‌ ఏజెన్సీ, క్వాలిటీ కంట్రోల్, సూపర్‌విజన్, ల్యాబొరేటరీస్, సెమినార్‌ హాల్స్‌ తదితర అంశాల్లో జేఎన్‌ఏ అండ్‌ ఎఫ్‌ఏ ఏజెన్సీగా పనిచేస్తోంది. ఇందుకు నాలుగు శాతం కమీషన్‌ను జేఎన్‌టీయూ, అనంతపురం చెల్లిస్తుంది. అంటే జేఎన్‌ఏ అండ్‌ ఎఫ్‌ఏ యూనివర్సిటీ కేవలం పర్యవేక్షణ మాత్రమే చేస్తుంది. తిరిగి భవన నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్‌ను పిలిచారు. ఇందుకు సంబంధించి మరో ప్రైవేటు భవన నిర్మాణ సంస్థ నాలుగు శాతం ఎక్సెస్‌ టెండర్‌ కోట్‌ చేయడంతో పనులను అప్పగించారు. తొలుత రూ.295 కోట్లకు టెండర్లు ఖరారు చేయగా, సెమినార్‌ హాల్స్, ఇండోర్‌ స్టేడియం నిర్మాణం, ప్రాజెక్ట్‌ వ్యయం అంచనాల పెంపు తదితర కారణాలతో నిర్మాణ వ్యయం రూ.349 కోట్లకు చేరింది. అయితే నిర్మాణం పూర్తయిన తరువాత ఫర్నిచర్, ల్యాబ్‌ పరికాల ఏర్పాటుకు రూ.13 కోట్లు ఖర్చు చేశారు. వాస్తవానికి ఫర్నిచర్, ల్యాబ్‌ పరికరాల ఏర్పాటును ప్రత్యేకంగా టెండర్లు పిలిచి అప్పగించాల్సి ఉంది. కానీ నిబంధలకు విరుద్ధంగా రూ.13 కోట్లకు ఎలాంటి టెండర్లు లేకుండా భవన నిర్మాణ సంస్థకు అప్పనంగా కట్టబెట్టారు. దీంతో ఎలాంటి బేరం లేకుండానే ఫర్నిచర్, ల్యాబ్‌ పరికరాలను అమర్చారు. ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లు పిలిచి ఉంటే పోటీ పడి తక్కువ ధరకే విలువైన ఫర్నిచర్, ల్యాబ్‌ పరికరాలు కళాశాలకు అందేవి. తద్వారా వర్సిటీకి డబ్బు ఆదా అయ్యేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నోడల్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నా..
నూతన కళాశాల నిర్మాణానికి సంబంధించి విధి విధానాలు, నియమ నిబంధనల అమలు పర్యవేక్షణకు నోడల్‌ కమిటీని నియమించారు. ఇందులో జేఎన్‌టీయూ అనంతపురం వీసీ, రిజిస్ట్రార్, డైరెక్టర్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్, జేఎన్‌ఏ అండ్‌ ఎఫ్‌ఏ యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, చీఫ్‌ ఇంజినీర్, మరో సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ సభ్యులుగా ఉన్నారు. జేఎన్‌టీయూ అనంతపురం.. భవన నిర్మాణ బిల్లులకు సంబంధించి నిధుల జారీ(ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌)ని జేఎన్‌ఏ అండ్‌ ఎఫ్‌ఏ వర్సిటీకి ఇస్తారు. వీరు సంబంధిత కాంట్రాక్టరు లేదా భవన నిర్మాణ సంస్థకు బిల్లులు చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో బిల్లుల చెల్లింపు, పనుల అంచనాల పెంపు, ఒప్పందంలో లేని నూతన అంశాలను ప్రస్తావించే క్రమంలో నోడల్‌ కమిటీ ఆమోదం తప్పనిసరి. ఫర్నిచర్‌ కొనుగోలుకు సంబంధించిన రూ.13 కోట్ల చెల్లింపులోనూ ఎలాంటి టెండర్లు లేకుండా అప్పటికే నిర్మాణం చేస్తున్న భవన నిర్మాణ సంస్థకు అప్పగించారు. అంటే నోడల్‌ కమిటీ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. నోడల్‌ కమిటీలో ఉన్న జేఎన్‌టీయూ అనంతపురం వీసీ, రిజిస్ట్రార్, డైరెక్టర్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌.. ఈ ముగ్గురూ ఆమోదించినట్లు స్పష్టమవుతోంది. మొత్తంగా కోట్లాది రూపాయల పనులను ఎలాంటి టెండర్లు లేకుండా అప్పగించడం వివాదాస్పదమవుతోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడే నిర్ణయాలు తీసుకోవడంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా, సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరగా ఫర్నిచర్, ల్యాబ్‌ పరికరాల కొనుగోలులో తమకు ఎలాంటి సంబంధం లేదని నోడల్‌ కమిటీలో ఉన్న జేఎన్‌టీయూ అనంతపురం వీసీ, రిజిస్ట్రార్‌ పేర్కొనడం కొసమెరుపు.

మరిన్ని వార్తలు