అవినీతి ‘గనులు’

5 Oct, 2013 02:44 IST|Sakshi

వెంకోజీపాలెం,న్యూస్‌లైన్: గనులు, భూగర్భ శాఖలో ఏసీబీ దాడులు ప్రకంపనలు సృష్టించాయి. గనులు,భూగర్భశాఖ విజిలెన్స్ విభాగ సహాయ సంచాలకుడు సుబ్రహ్మణ్యం అవినీతి నిరోధకశాఖకు చిక్కడంతో ఆ శాఖలో కలకలం రేగింది. ఏసీబీ వలలో పెద్ద చేప చిక్కడంతో అవినీతి అధికారులు గతుక్కుమన్నారు. విశాఖ నగరంలో ఏడీ స్థాయి అధికారి ఏసీబీకి చిక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. మూడేళ్ల క్రితం  అనకాపల్లి ఏడీ ఏసీబీకి చిక్కారు. వివాదాస్పదుడైన సుబ్రహ్మణ్యం ఇక్కడ విధుల్లో చేరగానే తీసుకున్న నిర్ణయాలు తీవ్ర చర్చకు దారితీశాయి.

ఇసుక లారీలను చూసీచూడనట్టు వదిలేయండని సిబ్బందిని ఆదేశించిన వైనాన్ని ‘సాక్షి’ గతంలో వెలుగులోకి తీసుకు వచ్చింది. అయితే గనులశాఖలో అవినీతి తాండవం బహిరంగ రహస్యమే. గనులు, క్వారీల తవ్వకాల కోసం సంబంధిత శాఖ అనుమతులు అవసరం. ముందుగా తహశీల్దార్ కార్యాలయాల నుంచి ఎన్‌ఓసీలు తీసుకుని, దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అన్ని పత్రాలు ఉన్నా సరే గనుల స్థాయి ఆధారంగా ముడుపులు ఇచ్చుకోవాల్సిందే. లేదంటే దరఖాస్తులు పక్కన పడేసి కొర్రీలు వేస్తుంటారని దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు.

నగరంలో గనులశాఖకు జోనల్ జాయింట్ డెరైక్టర్ ,రీజనల్ డిప్యూటీ డెరైక్టర్, అసిస్టెంట్ డెరైక్టర్, విజిలెన్స్ విభాగ కార్యాలయాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖల తరువాత గనుల శాఖ నుంచే అధిక శాతం ఆదాయం వస్తుంది. గనుల శాఖ కాంట్రాక్టర్ల అవసరాలను ఆసరాగా తీసుకుని గనుల శాఖ సిబ్బంది, అధికారులు కాంట్రాక్టర్లను వేధిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. గనులశాఖ అధికారులకు నెలవారీ మామూళ్లు ముట్టందే ఏ పనీ కాదని బహిరంగంగానే చెబుతారు. క్వారీలు లీజుకు తీసుకున్నాక సరిహద్దులు దాటి తవ్వకాలు సాగించినా చూసీచూడనట్టు వ్యవహరించడానికి కాంట్రాక్టర్లనుంచి ముడుపులు స్వీకరిస్తారని అంటారు.

ఏటా గనుల శాఖ, విజిలెన్స్ విభాగం విధించే జరిమానాల కన్నా  నిఘా ,అమలు విభాగం (విజిలెన్స్) అధికారులు నమోదు చేసే కేసులే ఎక్కువంటే అతిశయోక్తి కాదు. గనులశాఖలో ఉన్నతాధికారులతోపాటు ఇతర సిబ్బంది కూడా మామూళ్ల బాట పడుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. గనులశాఖ విశాఖ ఏడీ పరిధిలో 22 మండలాలు వున్నాయి.

ఈ మండలాలలో ఫాస్పేట్, లేట్‌రైట్, క్వార్ట్జ్ వంటి ప్రధానమైన ఖనిజ గనులు; నిర్మాణానికి అవసరమయ్యే రాళ్లు, ఇసుక ఇచ్చే మెనర్ మైన్స్ క్వారీలు,గనులు 130కి పైగా ఉన్నాయి. గనులు, క్వారీ లీజుల కోసం ప్రతినెలా పదుల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.లీజు రావాలన్నా, లీజులు కొనసాగించాలన్నా ముడుపులు తప్పనిసరన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపున విశాఖలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా గనులశాఖ అధికారులకు కాసుల పంట పండిస్తోంది. పట్టుకున్న లారీలను వదియాలంటే వేలల్లో లంచాలు ఇవ్వాల్సిందేనన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.
 

>
మరిన్ని వార్తలు