ష్‌.. గప్‌చిప్‌

13 Jul, 2018 09:26 IST|Sakshi
తెల్లకాగితంపై జారీ చేసిన రసీదు

ములపర్రు సొసైటీలో రూ.కోటి డిపాజిట్లు గల్లంతు

బహిర్గతమైనా ఉలుకూ పలుకూ లేని అధికారులు

డిపాజిట్‌దారుల్లో పెరుగుతున్న ఆందోళన

జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోవాలని ఆవేదన

పెనుగొండ : ములపర్రు హిందూ ముస్లీం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సుమారు కోటి రూపాయల డిపాజిట్ల గల్లంతుతో రైతులు, డిపాజిట్‌దారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నా అధికారుల్లో ఉలుకూ.. పలుకూ లేదు. దీంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. డిపాజిట్ల గల్లంతుకు సంఘ అధ్యక్షుడు టీవీవీఎస్‌హెచ్‌ నాగేశ్వరరావు, కార్యదర్శి అండలూరి సత్య వెంకటే శ్వరరావులు ఇద్దరూ బాధ్యత వహించి తిరిగి సంఘానికి చెల్లించడానికి డైరెక్టర్ల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, సమావేశ సమయానికి సంఘ అధ్యక్షుడు నాగేశ్వరరావు తండ్రికి వైద్యం అంటూ తిరుపతికి వెళ్లడంతో కార్యదర్శికి ఒత్తిడి పెరిగి భయంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన పాఠకులకు విధితమే. డైరెక్టర్లందరూ ఏకతాటిపైకి వచ్చి అధ్యక్ష, కార్యదర్శులపై ఒత్తిడి తీసుకువచ్చి బాండ్‌ పేపర్లపై హామీలు పొందారు.

అయితే, అధికారుల నుంచి మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి ప్రయత్నాలు, చర్యలు ప్రారంభం కాకపోవడం విశేషం. చర్యలు తీసుకొంటామంటూ ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు.  ఆత్మహత్యాయత్నం చేసిన కార్యదర్శి అండలూరి సత్య వెంకటేశ్వరరావు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. రైతులు మాత్రం సహకార సంఘం చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. ఇప్పటికే మండలంలోని మునమర్రు, దేవ సహకార సంఘాల్లో కోట్లాది రూపాయల గల్లంతుతో రైతులు కుదేలై ఉన్నారు. ములపర్రు సహకార సంఘం అదేబాటలో పయనించడంతో సహకార వ్యవస్థపై రైతులకు నమ్మకం పూర్తిగా సన్నగిల్లిపోయింది. ఈ తరుణంలోనైనా అధికారులు రాజకీయ ఒత్తిళ్ల నుంచి బయటపడి రైతులకు అండగా నిలవకపోతే పూర్తిగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయంటూ డిపాజిట్‌దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పూర్తిస్థాయిలో విచారణ జరపాలి
కాగా కేవలం డిపాజిట్లు మాత్రమే కాకుండా, సహకార సంఘ లావాదేవీలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలంటూ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. రుణాలు రెన్యువల్, చెల్లింపులకు సహకార సంఘ రసీదులు ఇవ్వకుండా, తెల్లకాగితాలపై సంతకాలు చేసి ఇచ్చి రైతులను మోసం చేసిన ఘటనలు ఉన్నాయని వివరించారు. రైతులందరికీ ఇదేవిధంగా రసీదులు ఇచ్చారన్నారు. ఎరువుల వ్యాపారంలోనూ ఇదే తంతు నిర్వహించారని తెలిపారు. అధ్యక్ష, కార్యదర్శులు ఇద్దరూ కుమ్మక్కై అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. అధికారులు తక్షణం స్పందించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు