-

‘యంత్రం’లో అవినీతి తంత్రం!

12 Mar, 2018 03:28 IST|Sakshi

     తవ్వకం యంత్రాల కొనుగోలుకు గతంలోనే నిధులిచ్చిన ప్రభుత్వం 

     మళ్లీ టీబీఎంల కొనుగోలు, బుష్‌లు,కన్వేయర్‌ బెల్ట్‌ మార్పునకు రూ.224.09 కోట్లు కేటాయింపు

     కోటరీ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేందుకు రంగం సిద్ధం

     కమీషన్లు కొట్టేయడానికి ‘ముఖ్య’నేత స్కెచ్‌

సాక్షి, అమరావతి: మీ ఇంటి నిర్మాణ పనులను ఓ మేస్త్రీకి అప్పగించారనుకుందాం. యంత్ర సామగ్రి కొనుగోలుకు అవసర మైన డబ్బులను మీరే ఇచ్చారు. పనుల్లో జాప్యం చేస్తుండడంతో ఆ మేస్త్రీని తొలగించి, మరో మేస్త్రీకి బాధ్యతలు అప్పగించారు. గతంలో కొనుగోలు చేసి, కొంతకాలం ఉపయోగించిన యంత్ర సామగ్రినే మళ్లీ కొనాలి అంటే ఎవరైనా డబ్బులిస్తారా? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రం అదే పనిచేస్తోంది. ఏకంగా రూ.224.09 కోట్లను వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఆ సొమ్మంతా చివరికి ఎవరి జేబుల్లోకి వెళ్తుందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. 

కోటరీ కాంట్రాక్టర్లకే ఇవ్వాలట!
వెలిగొండ ప్రాజెక్టు పనులను 2016 జూన్‌ నాటికే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, పనులు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో గడువును 2019 మార్చి వరకూ పొడిగించింది. ఈ క్రమంలో వెలిగొండ ప్రాజెక్టులో రెండు సొరంగాల పనులు చేస్తున్న పాత కాంట్రాక్టర్లకు 60సీ నిబంధన కింద నోటీసులు ఇచ్చింది. మొదటి సొరంగంలో మిగిలిన 3.6 కి.మీ.ల పనులను రూ.116.44 కోట్లతో, రెండో సొరంగంలో మిగిలిన 8.037 కి.మీ.ల పనులను రూ.299.48 కోట్లతో పూర్తి చేయొచ్చని అధికారులు ప్రతిపాదించారు. అయితే, ‘ముఖ్య’నేత ఒత్తిడితో మొదటి సొరంగంలో మిగిలిపోయిన పనుల అంచనా విలువను రూ.301.01 కోట్లకు, రెండో సొరంగంలో మిగిలిపోయిన పనుల అంచనా విలువను రూ.730.04 కోట్లకు పెంచేశారు. రెండు సొరంగాల పనులను తన కోటరీలోని ఇద్దరు కాంట్రాక్టర్లకు అప్పగించేలా నిబంధనలు రూపొందించి, టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని జలవనరుల శాఖ అధికారులను ‘ముఖ్య’నేత ఆదేశించారు.

అదిరిపోయే ప్రణాళిక 
సొరంగాల తవ్వకం కోసం ఉపయోగించే యంత్రాలు(టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌–టీబీఎం) కొనుగోలుకు 2005లోనే కాంట్రాక్టర్లకు సర్కార్‌ నిధులు ఇచ్చింది. ఆ యంత్రాలను కొత్త కాంట్రాక్టర్లకు అప్పగిస్తే సరిపోతుంది. కానీ, గతంలో కొనుగోలు చేసిన యంత్రాలను మళ్లీ కొనడానికి రూ.172.44 కోట్లను కాంట్రాక్టర్లకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి సొరంగం కాంట్రాక్టర్‌కు రూ.51.97 కోట్లు, రెండో సొరంగం కాంట్రాక్టర్‌కు రూ.120.47 కోట్లు ఇవ్వనుంది. ఇక టీబీఎంలకు కొత్త బుష్‌లు అమర్చడానికి, కన్వెయర్‌ బెల్ట్‌ మార్చడానికి 2016 జూన్‌లో ప్రభుత్వం రూ.68.44 కోట్లు ఇచ్చింది. తాజాగా మళ్లీ కొత్త బుష్‌లు అమర్చడానికి, కన్వేయర్‌ బెల్ట్‌ మార్చడానికి మొదటి సొరంగం కాంట్రాక్టర్‌కు రూ.26.26 కోట్లు, రెండో సొరంగం కాంట్రాక్టర్‌కు రూ.25.39 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అంటే బుష్‌లు, కన్వేయర్‌ బెల్ట్‌ల పేరుతో మళ్లీ రూ.51.65 కోట్లు ఇవ్వనుంది. దీనివల్ల అంచనా వ్యయం రూ.224.09 కోట్లు పెరిగింది. ముందే ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు టెండర్ల ద్వారా ఈ పనులను అప్పగించి, రూ.224.09 కోట్లను తన జేబులోకి వేసుకోవడానికి ‘ముఖ్యనేత ఎత్తులు వేస్తున్నారు.

అభ్యంతరాలు బేఖాతరు 
తమకు చెల్లించాల్సిన బిల్లులు, పరిహారం ఇవ్వకుండా 60సీ నిబంధన కింద పనులను తొలగించి, కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించాలన్న సర్కార్‌ నిర్ణయంపై వెలిగొండ సొరంగాల కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. పాత కాంట్రాక్టర్ల లెక్కలు తేల్చిన తర్వాత టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని హైకోర్టు ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా పెంచిన అంచనా వ్యయంతో వెలిగొండ సొరంగాల పనులకు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జలవనరుల శాఖ అధికారులు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో టెండర్లు నిర్వహిస్తే న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. టీబీఎంలు కొనడానికి గతంలోనే కాంట్రాక్టర్లకు నిధులు ఇచ్చామని.. బుష్‌లు, కన్వేయర్‌ బెల్ట్‌ మార్చడానికి 2016లో మళ్లీ రూ.68.44 కోట్లు ఇచ్చామని ఈ నేపథ్యంలో మళ్లీ పాత యంత్రాల కొనుగోలు, బుష్‌లు, కన్వేయర్‌ బెల్ట్‌ల మార్పు పేరుతో అంచనా వ్యయాన్ని రూ.224.09 కోట్లు పెంచేయడాన్ని ఆర్థిక శాఖ తప్పుపట్టింది. టెండర్లు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్పింది. అయితే, ‘ముఖ్య’నేత తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేయడంతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీకి అనుమతి ఇవ్వక తప్పలేదని ఆర్థిక శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. వెలిగొండ సొరంగాల పనులకు జలవనరుల శాఖ వారం రోజుల్లోగా టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.  

మరిన్ని వార్తలు