చేయి తడపాల్సిందేనా..?

18 Sep, 2019 09:18 IST|Sakshi

రెవెన్యూలో ఆగని అవినీతి

నేటికీ కొనసాగుతున్న పాత వాసన

కొందరికి తలకెక్కని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు

నందిగాం మండలం పాలవలస సమీపంలో ఓ రైతుకు చెందిన 73 సెంట్లను సబ్‌ డివిజన్‌ చేసేందుకని టెక్కలి ఆర్డీవో కార్యాలయం డీఐఎస్‌( డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే) ఏకాశి రూ. 5లక్షలకు బేరం పెట్టుకుని రూ. 50వేలు తీసుకుంటూ ఆగస్టు 31వ తేదీన  ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తాజాగా కొత్తూరు మండలం తహసీల్దార్‌ కార్యాలయంలో ఈ–పాసు పుస్తకం మంజూరు కోసం మెట్టుగూడ గ్రామానికి చెందిన గిరిజన మహిళ సాయమ్మ నుంచి రూ. 10వేలు లంచం తీసుకుండగా వీఆర్‌ఓ సుందరరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

సాక్షి, శ్రీకాకుళం: వీరు దొరికినోళ్లు.. మరి దొరకనివాళ్లు.. చాలా మంది ఉన్నారనేది ప్రజల మాట. రెవెన్యూ అంటేనే అవినీతికి చిరునామా అని జనం అంటున్నారు. ఈ శాఖలో గతంలో అవినీతి యథేచ్ఛగా సాగింది. సిబ్బం ది దగ్గరి నుంచి అప్పటి మంత్రుల వరకూ అవి నీతిలో భాగస్వాములు కావడంతో పట్టించుకున్న దాఖ లాల్లేవు. అవినీతి విశృంఖలం అయిపోయింది. ఇప్పుడా పరిస్థితి మారింది. పాలకులు అవినీతికి దూరంగా ఉంటున్నారు. నిజాయితీతో కూడిన పాలన కోసం పరితపిస్తున్నారు. అవినీతి వ్యవహారాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. ‘రెవెన్యూలో పరిస్థితి మారాలి. అవినీతికి ఆస్కారం ఉండకూడదు. మీకేమైనా సమస్యలు, ఇబ్బందులుంటే నాకు వదిలేయండి. నేను చూసుకుంటాను. అంతే తప్ప అవినీతికి పాల్పడకూడదు. చెప్పినా కూడా చేతివాటం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు. చర్యలు గతం కన్నా కఠినంగా ఉంటాయి. ఒక్కసారి ఉద్యోగానికి ఇబ్బంది వచ్చిందంటే కష్టం. నా హయాంలో పైరవీలకు అవకాశం ఉండదు.’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరుచూ అధికారులకు చెబుతూ వస్తున్నారు.

అవినీతి రహిత పాలన అందించాలని, లంచాల్లేని పాల న కొనసాగాలని ఆయన పదేపదే హెచ్చరించడమే కాకుండా హితబోధ చేస్తున్నారు. అయినా కొందరి తలకెక్కడం లేదు. తమ పాత బాణీ కొనసాగిస్తున్నారు. అలవాటు పడిన చేతులతో లంచాలు తీసుకుంటున్నారు. చివరికి అడ్డంగా బుక్‌ అవుతున్నారు. స్పందన దగ్గరి నుంచి సీఎంఓ కార్యాలయం వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఏ ఒక్క ఫిర్యాదునూ విడిచిపెట్టడం లేదు. సీరియస్‌గా తీసుకుని చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా అక్రమాలకు పాల్పడితే వారిని దేవుడే రక్షించాలి.

రెవెన్యూలో మామూలేనా?
రెవెన్యూలో అవినీతి సాధారణమైపోయిందని అందులో పనిచేస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్న వారే నిరూపించుకుంటున్నారు. ఈ పట్టాదారు పాసు పుస్తకాల కోసం భూమి విలువ మేరకు రూ. 5వేల నుంచి రూ. 50వేల వరకు వసూలు చేస్తున్నారన్న వాదనలు కొనసాగుతూనే ఉన్నా యి. కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం సర్టిఫికెట్‌ (లీగల్‌ హెయిర్‌), కొరిలేషన్‌ సర్టిఫికేట్, మ్యూటేషన్, కరెక్షన్లకు పలుచోట్ల డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ రకమైన ఫిర్యాదులు ప్రతివారం కలెక్టరేట్‌లో జరిగే స్పందన కార్యక్రమానికి కూడా వస్తున్నాయి. ఉన్నతాధికారులు కూడా తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంత గట్టిగా హెచ్చరిస్తున్నా ఇంకా మారలేదన్న ఆవేదనైతే ఉన్నతాధికారుల్లో కూడా ఉంది. వాస్తవానికైతే ధ్రువీకరణ పత్రాలు అవసరమైన వారు మీ సేవలో దరఖాస్తు చేసుకుంటారు. వీఆర్‌ఓ ప్రాథమిక దర్యాప్తు  చేస్తారు. దీని ఆధారంగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ధ్రువీకరిస్తారు. వీరిద్దరి స్టేట్‌మెంట్‌ సంతృప్తికరంగా ఉంటే తహసీల్దార్‌ డిజిటల్‌ కీ ద్వారా ఆమోదం తెలుపుతారు. ఈ ప్రక్రియ కోసం కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తాం 
కొత్తూరులో లంచం తీసుకుంటూ దొరికిన వీఆర్‌ఓ సుందరరావుపై కఠిన చర్యలు తీసుకుంటాం. స్పం దనలో భూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. సమస్యల పరిష్కారంలో జాప్యమెందుకవుతోందో నిఘా పెట్టి పరిశీలన చేస్తున్నాం. స్పందనలో వచ్చే అర్జీలను క్షుణ్ణంగా విచారణ చేస్తున్నాం.  అవసరమైతే అధికారులే నేరుగా అర్జీదారుని ప్రాంతానికి వెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– బలివాడ దయానిధి,  జిల్లా రెవెన్యూ అధికారి, శ్రీకాకుళం

ఏసీబీ వలలో అవినీతి వీఆర్‌ఓ


ఏసీబీ అధికారులకు చిక్కిన వీఆర్వో మదన్‌మోహన్‌ సుందరరావు

కొత్తూరు: మరో అవినీతి చేప ఏసీబీ అధికారుల వలలో పడింది. రెవెన్యూ శాఖలోనే మరో ఉద్యోగి లంచం తీసుకుంటూ అధికారులకు దొరికిపోయారు. కొత్తూరు మండల తహసీల్దార్‌ కార్యాలయం పరిధి నేరడిరెవెన్యూ గ్రూపునకు ఇన్‌చార్జి వీఆర్వోగా పనిచేస్తున్న కె.మదన్‌ మోహన్‌ సుందరరావు (ఉరఫ్‌ సుందరరావు) మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో పడ్డారు. అదే మండలం లోని మెట్టూరుగూడకు చెందిన సవర సాయమ్మ అనే గిరిజన మహిళ నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మెట్టూరుగూడకు చెందిన సాయమ్మకు 1.80 సెంట్ల భూమి ఉంది. దీనికి ఈ పాస్‌ పుస్తకం, మ్యుటేషన్‌ చేయించాలని ఆరు నెలలుగా అధికారులను ఆమె కోరుతున్నారు.

మీ సేవలో కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయినా ఫలి తం కనిపించలేదు. దీనిపై వీఆర్వో సుందరరావును సంప్రదించగా రూ.20వేలు లంచం ఇస్తే పని జరుగుతుందని చెప్పారు. ఈ విషయాన్నే సాయమ్మ సరుబుజ్జిలి మండలం వెన్నిలవలసకు చెందిన తన అల్లుడు సవర మిన్నారావుకు చెప్పారు. దీంతో ఆ యన అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాలని సూచించి, అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇంతలో వీఆర్వో సాయమ్మను రూ.10వేలు అడ్వాన్స్‌గా ఇవ్వాలని అడిగారు. ఇదే విషయాన్ని సాయమ్మ ఏసీబీ అధికారులకు చెప్పా రు. దీంతో ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ఎస్‌ రమణమూర్తి పక్కాగా స్కెచ్‌ వేశారు. రూ.10వేలను సాయమ్మకు ఇచ్చి అంతకుముందుగానే తన సిబ్బందితో కొత్తూరు తహసీల్దార్‌ కార్యాలయంలో మాటు వేశారు. సరిగ్గా వీఆర్వో డబ్బు తీసుకుంటూ ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీఆర్వోపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, ఆయనను విశాఖ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్‌పీ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు బాస్కరరావు, హరిలతోపాటు సిబ్బంది పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు