అవి‘నీటి’ వ్యూహకర్తలు!

2 Aug, 2014 03:04 IST|Sakshi
అవి‘నీటి’ వ్యూహకర్తలు!

సాక్షి ప్రతినిధి, విజయనగరం :  టీడీపీ నేతల ను సంతోషపరచడానికి అధికారులు నిబంధనలు గాలికొదిలేస్తున్నారు. వారి ప్రాపకం కోసం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. లబ్ధి చేకూర్చి వారికి దగ్గరైపోవాలని చూస్తున్నారు.  నాలుగు కాసులొచ్చే అవకాశాలను కల్పిస్తే తమను ఇబ్బంది పెట్టరని తాపత్రయ పడుతున్నారు. అడిగినదానికల్లా తల ఊపేస్తున్నారు. ఇందుకు  నామినేటెడ్ పద్ధతిలో టీడీపీ నాయకులకు ధారాదత్తం చేస్తున్న సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ పనులే ఉదాహరణ. ఈ విషయంలో అటు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, ఇటు జిల్లా పరిషత్ అధికారులు స్వామి భక్తిని ప్రదర్శించారన్న ఆరోపణలొస్తున్నాయి.

ఇప్పుడున్న ఆర్‌డబ్ల్యూఎస్, జిల్లా పరిషత్ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో  పనిచేసిన వాళ్లే. సహజంగా ఆ పార్టీ నేతలతో సత్సంబంధాలు  ఉంటాయి. ఇదే అక్కసుతో అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ నేతలు టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులపైనైతే ఒక సమీక్ష సమావేశంలో  సాక్షాత్తు కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులకు బదిలీ తప్పదని అంతా భావించారు.

కానీ కొద్ది రోజుల్లోనే లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించడంతో టీడీపీ నేతల నుంచి మునుపటి వ్యతిరేకత కన్పించడం లేదు. అంతా అనుకూలంగా ఉన్నప్పుడు ఎందుకనుకున్నారో ఏమో గాని అంతా పాజిటివ్‌గా నడిచిపోతోంది.
 జిల్లాలో 24 భారీ మంచినీటి పథకాల నిర్వహణ పనులను  నిబంధనల మేరకు ప్రతి ఏడాదీ టెండర్ల ద్వారా  అప్పగించాలి.  అత్యధిక పథకాలకు సంబంధించి ఈ ఏడాది మార్చితో గడువు ముగిసింది.

మళ్లీ టెండర్లు పిలవాల్సి ఉన్నా టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల కన్ను మంచినీటి పథకాలపై పడింది. దీంతో అధికారులు భారీ మంచినీటి పథకాల నిర్వహణ పనులను నామినేటెడ్‌గా కట్టబెట్టేస్తున్నారు. నిబంధనల మేరకైతే రూ.లక్ష దాటిన పనులను టెండర్ల ద్వారా ఖరారు చేయాలి. కానీ, ఆ పనులను ముక్కముక్కలు చేసి టీడీపీ నేతలకు అప్పగిస్తున్నారు. ఈ విధంగా ఇప్పటికే రామతీర్థం, చీపురుపల్లి సుజలధార, భోగాపురం, గొట్లాం, గోస్తనీ, గెడ్డపువలస ప్రాజెక్టులతో పాటు బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాల్లోని పలు మంచినీటి పథకాలను నామినేటెడ్‌గా ధారాదత్తం చేశారు.
 
ఒకరిపై ఒకరు నెపం..
ఇదే విషయమై సంబంధిత అధికారులను అడిగితే ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను సంప్రదిస్తే పంచాయతీ అధికారాల బదలాయింపులో భాగంగా సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను జిల్లా పరిషత్‌కు అప్పగించేశామని, వాటికి టెండర్లు పిలిచి, నిర్వహణ పనులను అప్పగించాలని  లేఖ రాశామని చెప్పారు. అయితే, జెడ్పీ అధికారులు టెండర్లు పిలవకపోవడం వల్ల, పాత కాంట్రాక్టర్లు కొనసాగేందుకు ఆసక్తి చూపకపోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో మంచినీటి పథకాల నిర్వహణ పనులను నామినేటెడ్‌గా అప్పగించాల్సి వస్తోందని చెప్పుకొస్తున్నారు.
 
దీనిపై జిల్లా పరిషత్ అధికారులను వివరణ అడగ్గా అటువంటి లేఖ ఏదీ ఆర్‌డబ్ల్యూఎస్ నుంచి తమకు రాలేదని చెప్పుకొచ్చారు. అయినా మంచినీటి పథకాలను తమకు బదలాయించడమేంటని, జిల్లా పరిషత్ నిధులతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులే మంచినీటి పథకాలకు టెండర్లు పిలుస్తున్నారని, వారే పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.  ఇందులో తమ తప్పేమీ లేదన్నట్టుగా సమాధానాలు దాటవేస్తున్నారు.

ఇలా ఒకరిపైకొకరు నెపాన్ని నెట్టుకొంటున్నారు. మొత్తానికి  జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ రెండు శాఖల అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించే... సమగ్ర రక్షిత మంచినీటి పథకాలకు టెండర్లు పిలవకుండా నామినేటేడ్ పద్ధతిలో అప్పగిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇందులో అధికారులు స్వామిభక్తి చాటుకున్నారని విమర్శలున్నాయి. మొత్తానికి టీడీపీ నేతల ఒత్తిళ్లు ఫలించాయి. వారి చేతిలోకి భారీ మంచినీటి పథకాలొచ్చాయి.

మరిన్ని వార్తలు