అవినీతికి ఆలవాలం

18 Apr, 2018 07:02 IST|Sakshi
ఆహారభద్రత ప్రమాణాల అమలు శాఖ కార్యాలయం

ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయంలో అడుగడుగునా ముడుపులు

పెదవాల్తేరు(విశాఖ తూర్పు) : నగరంలోని ఆహారభద్రత ప్రమాణాల అమలు శాఖ కార్యాలయం అవినీతికి ఆలవాలంగా మారింది. రిజిస్ట్రేషన్‌ కావాలన్నా, రిజిస్ట్రేషన్‌ లేకుండా వ్యాపారాలు చేస్తున్నా, గుట్కాలు, ఖైనీలు విక్రయిస్తున్నా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌కి ముడుపులు సమర్పించుకోవాల్సిందే. లేకుంటే కేసులు పెడతామని సదరు అధికారులు హెచ్చరిస్తారు. ఎట్టకేలకు ఒక వ్యాపారి ఫిర్యాదు చేయడంతో అధికారి అవినీతి భాగోతానికి తెరపడినట్టయింది. ఏసీబీ దాడితో పెదవాల్తేరులో గల ఈ శాఖ కార్యాలయం సిబ్బందిలో గుబులు రేగింది.

సిబ్బంది కొరతతో కాసుల వర్షం
సాధారణంగా సిబ్బంది కొరత ఉంటే మిగిలిన వారిపై పనిభారం పడుతుంది. విచిత్రంగా ఈ శాఖలో మాత్రం కాసుల వర్షం కురిపిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని మండలాలు, గ్రామీణ ప్రాంతాలు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల పరిధిలో ఆహార భద్రతా చట్టాన్ని ఈ శాఖ అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఆహార కల్తీ నివారణ, ఖైనా, గుట్కాల విక్రయాలపై ఈ శాఖ అధికారులు దాడులు చేస్తుంటారు. గత ఏడాది నుంచి జిల్లాకొక అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ నియమితులయ్యారు.

ప్రస్తుతం ఈ కార్యాలయంలో అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ పర్యవేక్షణలో ఒక గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్, ఒక సూపరింటెండెంట్, ముగ్గురు సబార్డినేట్‌ సిబ్బంది, ఇద్దరు అటెండర్లు మాత్రమే ఉన్నారు. మూడు నెలల క్రితం ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ పదోన్నతిపై బదిలీ కావడంతో ఆ పోస్టు ఖాళీగానే ఉంది. గతనెలలో ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ కావడంతో ఆ పోస్టు కూడా ఖాళీగానే వుంది. ప్రస్తుత సూపరింటెండెంట్‌ సైతం ఇటీవలే పదవీ విరమణ చేశారు.

అవినీతి సర్వంతర్యామి
జిల్లాలో ముగ్గురు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లకు కేవలం ఒక్కరే ఉండడంతో స్వేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారు. డివిజన్‌ – 1 పరిధిలో భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, గాజువాక, అనకాపల్లి, పరవాడ, కశింకోట, సబ్బవరం మండలాలు ఉన్నాయి. ఇక డివిజన్‌ –2 పరిధిలో నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట ప్రాంతాలు ఉన్నాయి. డివిజన్‌ – 3 పరిధిలో ఏజెన్సీలోని 11 గిరిజన మండలాలు, చోడవరం, మాడుగుల ప్రాంతాలున్నాయి. ప్రస్తుతం డివిజన్‌ – 1 గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎస్‌.వి.వీరభద్రరావు వ్యవహరిస్తున్నారు. గత ఏడాది జూన్‌ నుంచి మిగిలిన రెండు ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉండడంతో... వీరభద్రరావే ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరభద్రరావు అవినీతి మూడు గుట్కాలు, ఆరు ఖైనీలు చందంగా సాగిపోతున్నా పట్టించుకున్న నాథుడే లేడని విమర్శలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు