ఆత్మలకూ... పింఛన్లు!

25 Feb, 2019 08:14 IST|Sakshi
పెద్దింపేటలో పింఛన్లు పంపిణీ చేస్తున్న కార్యదర్శి

చనిపోయిన వారి పేరున నిధులు స్వాహా

పలు పంచాయతీలో కార్యదర్శుల చేతివాటం

చనిపోయిన వారి పేరున నిధులు స్వాహా

పలు పంచాయతీలో కార్యదర్శుల చేతివాటం

సోషల్‌ ఆడిట్‌లో వెలుగు చూస్తున్న వాస్తవాలు

సామాజిక పింఛన్లను కొందరు కార్యదర్శులు సొంతానికి వాడుకుంటున్నారు. మరణించిన వారి పేరున దర్జాగా కాజేస్తూ ప్రభుత్వాన్ని మోసగిస్తున్నారు. తప్పుడు ధ్రువీకరణలతో జేబులు నింపుకుని తప్పుదారి పట్టిస్తున్నారు. జరుగుతున్న అక్రమాలు సోషల్‌ ఆడిట్‌లో బట్టబయలవుతోంది.

విజయనగరం ,బలిజిపేట(పార్వతీపురం): సామాజిక పింఛన్ల పంపిణీలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. వీటిపై ఎన్ని నిబంధనలు పెట్టినా... కొందరు కార్యదర్శులు తమ పని తాము చేసుకుపోతున్నారు. గ్రామాలలో మరణించిన వారిపేరున వచ్చే పింఛన్లు ఇలా కాజేస్తున్నట్టు సోషల్‌ఆడిట్‌లో తేలింది.  గ్రామస్థాయి నాయకులు వారితో కుమ్మక్కయి ఈ విధంగా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన సోషల్‌ ఆడిట్‌లో 5గ్రామాలకు చెందిన 12మంది లబ్ధిదారుల పింఛను మొత్తాలు రూ. 22వేలు ప్రతినెలా కార్యదర్శులు అథంటికేషన్‌తో స్వాహాచేసిన విషయం బట్టబయలైంది. మరణించిన వారిపేరున వచ్చే మొత్తాలను స్వాహా చేస్తున్నారని రుజువయింది. అందులో మండలంలోని పెద్దింపేటకు చెందిన ఆరుగురి పింఛన్‌ మొత్తం రూ. 13వేలు గ్రామ కార్యదర్శి కాజేసినట్టు తేలింది. పలగరలో 1, అంపావల్లిలో 2, వంతరాంలో 2, అరసాడలో ఒకరికి మంజూరైన మొత్తాలు ఆయాగ్రామ కార్యదర్శులు స్వాహా చేసినట్టు తేలింది.

ఎన్ని మెషీన్లు వచ్చినా...
రెండేళ్ల క్రితం నుంచి బయోమెట్రిక్‌ద్వారానే పింఛన్ల పంపిణీ సాగుతోంది. లబ్ధిదారులు వచ్చి వేలిముద్రలు వేసి వారి పింఛను తీసుకునేవారు. మంచం మీద ఉండేవారు, ఇతరత్రా రాలేనివారి వద్దకు వెళ్ళి బయోమెట్రిక్‌ వేయించుకుని వారికి పింఛన్‌ పంపిణీ చేస్తారు. వేలిముద్రలు పడక, ఐరిస్‌ కాక పొందలేనివారికి పంపిణీ చేసేవారే అథంటికేషన్‌ వేసి చెల్లించే అవకాశం కల్పించారు. అయితే ఇలా గ్రామపింఛన్‌ లబ్ధిదారుల మొత్తంలో 2శాతానికి మించి అథంటికేషన్‌ ద్వారా చెల్లించకూడదు. అథంటికేషన్‌తోనే అవకతవకలు జరుగుతున్నాయన్న వాదన వినిపిస్తోంది.

సకాలంలో కాని మరణ ధ్రువీకరణ
మరణ ధ్రువీకరణ పత్రాలు గ్రామ కార్యదర్శులే ఇస్తారు. అంటే ఎవరు ఎప్పుడు మృతిచెందారన్నది వారికి తెలుస్తుంది. ధ్రువీకరణ పత్రాన్ని పూర్తి వివరాలతో 21రోజుల్లోగా కార్యదర్శి ఆన్‌లైన్‌ చేయాలి. అలా అయితేనే వారు పింఛన్‌ లబ్ధిదారులైతే ఆ మొత్తాలు ఇక వచ్చే అవకాశం ఉండదు. అయితే కొందరు కార్యదర్శులు ఈ మరణ ధ్రువీకరణను ఆన్‌లైన్‌ చేయడంలో తాత్సారం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఎంపీడీఓ వెంకటరమణ వద్ద సాక్షి ప్రస్తావించగా... మరణించినవారి పేరున వచ్చే పింఛన్లు డ్రా చేయడం నేరమనీ, అలా జరిగినట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు