పోలవరం చెల్లింపుల్లో అక్రమాలు నిజమే

18 Dec, 2018 04:04 IST|Sakshi

రాజ్యసభ సాక్షిగా నిర్ధారించిన కేంద్ర ప్రభుత్వం

నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు.. భూసేకరణ, స్టీలు కొనుగోలులోనూ నిబంధనలు ఉల్లంఘించినట్లు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది

ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు రాజ్యసభలో సమాధానం ఇచ్చిన కేంద్ర జలవనరుల మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: పోలవరం కాంట్రాక్టర్లకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన చెల్లింపుల్లో అక్రమాలు జరిగినట్లుగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)తో పాటు కాగ్‌ నివేదిక నిర్ధారించిన విషయం నిజమేనని కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ ప్రకటించారు. ఈమేరకు సోమవారం రాజ్యసభలో వైఎస్సార్‌ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టులో నిబంధనలకు విరుద్ధంగా కొందరు కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చెల్లింపులను తిరిగి రాబట్టాలని పీపీఏ సూచించిందని మంత్రి వివరించారు. అక్రమ చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇస్తూ.. త్వరితగతిన ప్రాజెక్టు పనులు పూర్తి చేయించే హడావుడిలో భూసేకరణ, స్టీలు కొనుగోలుతో పాటు మరికొన్ని పనుల్లో కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిపినట్లు అంగీకరించిందన్నారు. అక్రమ చెల్లింపుల మొత్తాన్ని ఆయా కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేసిందన్నారు. పోలవరం హెడ్‌వర్క్స్‌ కాంట్రాక్టును ఏదైనా కంపెనీకి లబ్ధి చేకూర్చేలా కేంద్ర జల వనరుల శాఖ వ్యవహరించిందా? అన్న మరో ప్రశ్నకు మంత్రి మేఘవాల్‌ జవాబిస్తూ 2016 సెప్టెంబర్‌ 16న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన లేఖకు అనుగుణంగా పోలవరం నిర్మాణ బాధ్యతలను ఏపీ ప్రభుత్వమే చేపట్టిందని వివరించారు. ఇప్పటి వరకు అందిన నివేదికల ప్రకారం పోలవరం పనులు 62.16 శాతం పూర్తయ్యాయని చెప్పారు. ప్రాజెక్టు కారణంగా 1,05,601 కుటుంబాలు ఆశ్రయం కోల్పోయాయన్నారు. ఇప్పటివరకు 3,922 నిర్వాసిత కుటుంబాలకు కొత్తగా నిర్మించిన 26 పునరావాస కాలనీల్లో ఆశ్రయం కల్పించినట్లు మంత్రి మేఘవాల్‌ వివరించారు.

‘సాక్షి’ కథనాలను నిర్థారించిన నివేదికలు
పోలవరం నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్నప్పటి నుంచి అంచనా వ్యయం పెంచి కాంట్రాక్టర్లకు అదనంగా బిల్లులు చెల్లించి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు లబ్ధి పొందటంపై ‘సాక్షి’ ఎప్పటికప్పుడు పలు కథనాలు ప్రచురించింది. ఇది అక్షర సత్యమని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కాగ్‌(కాంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) తమ నివేదికల్లోనూ తేల్చాయి. విభజన చట్టం ప్రకారం కేంద్రం చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ 2016 సెప్టెంబరు 7న రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది. తర్వాత 24 గంటల్లోనే హెడ్‌వర్క్స్‌ అంచనా వ్యయాన్ని రూ.4054 కోట్ల నుంచి రూ.5535.91 కోట్లకు పెంచేస్తూ ప్రధాన కాంట్రాక్టర్, టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌(జేవీ)కి రూ.1481.91 కోట్లను దోచిపెట్టడాన్ని ‘సాక్షి’ 2016 సెప్టెంబరు 9న వెలుగులోకి తెచ్చింది. కాంట్రాక్టు ఒప్పందం గడువు ముగియడానికి రెండేళ్ల ముందే అంచనా వ్యయం పెంచడం నిబంధనలకు విరుద్ధం. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ కూడా లేఖ రాసింది. లోక్‌సభలో ప్రవేశపెట్టిన కాగ్‌ నివేదికలోనూ అంచనా వ్యయం పెంపును తప్పుబట్టడం గమనార్హం.

స్టీలు, డంప్‌యార్డు సర్కారు డబ్బుతోనే...
హెడ్‌ వర్క్స్‌ పనుల్లో నిబంధనలకు విరుద్ధంగా స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి రూ.25.37 కోట్లతో ప్రభుత్వమే స్టీలును కొనుగోలు చేసి కాంట్రాక్టర్‌కు సరఫరా చేసింది. ఈ డబ్బులు తిరిగి వసూలు చేయకపోవడాన్ని కాగ్‌ తప్పుబట్టింది. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌లో తవ్విన మట్టిని పోసేందుకు(డంపింగ్‌ యార్డ్‌) అవసరమైన భూమిని కూడా కాంట్రాక్టకు బదులుగా ప్రభుత్వమే రూ.32.66 కోట్లు వెచ్చించి మరీ సేకరించింది. ఆ డబ్బులు కూడా తిరిగి వసూలు కాలేదని కాగ్‌ నివేదికలో ప్రస్తావించింది. 

నామినేషన్‌దే డామినేషన్‌..
నిబంధనల ప్రకారం రూ. 3 లక్షల లోపు విలువైన పనులను మాత్రమే నామినేషన్‌ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించాల్సి ఉండగా హెడ్‌ వర్క్స్‌తోపాటు కుడి, ఎడమ కాలువలో పనులన్నీ నామినేషన్‌పై కమీషన్‌లు ఇచ్చే కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది. 60సీ నిబంధన కింద అడ్డగోలుగా వేటు వేస్తూ మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి అస్మదీయులకు నామినేషన్‌ పద్ధతిలో కట్టబెడుతోంది. ఏపీడీఎస్‌ఎస్‌ నిబంధనల ప్రకారం పాత కాంట్రాక్టర్‌పై అపరాధ రుసుం విధించి.. వసూలు చేయాలి. కానీ సర్కార్‌ అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో పోలవరం ఎడమ కాలువ మూడు ప్యాకేజీల పనుల్లో రూ.256.7 కోట్ల మేరకు భారం సర్కార్‌పై పడిందని కాగ్‌ తేల్చింది. ఆ మేరకు అస్మదీయ కాంట్రాక్టర్‌లకు లబ్ధి కలిగించారని పేర్కొంది.
 
పైప్‌లైన్ల భారం ఖజానాపైనే
పోలవరం కుడి కాలువ రెండో ప్యాకేజీ పనుల్లో క్రాసింగ్‌ వద్ద పైపు లైన్‌లు మార్చే పనుల వ్యయాన్ని నిబంధనల ప్రకారం కాంట్రాక్టరే భరించాలి. అయితే పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలనే సాకుతో కాంట్రాక్టర్‌కు బదులుగా ప్రభుత్వమే జీఏఐఎల్‌కు రూ.6.89 కోట్లు,  హెచ్‌పీసీఎల్‌కు రూ.7.21 కోట్లు డిపాజిట్‌ చేసింది. దీన్ని ఇప్పటివరకూ కాంట్రాక్టర్‌ నుంచి వసూలు చేయకపోవడాన్ని కాగ్‌ తప్పుబట్టింది.

దోపిడీలో నవయుగం
పోలవరం హెడ్‌ వర్క్స్‌లో జనవరి నుంచి ప్రధాన కాంట్రాక్టర్‌ రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి ఒక్కో భాగాన్ని విడదీసి రాష్ట్ర ప్రభుత్వం నామినేషన్‌ పద్ధతిలో నవయుగకు కట్టబెడుతూ వస్తోంది. తాజాగా ఈసీఆర్‌ఎఫ్‌(ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌– రాతి మట్టి కట్ట), కాఫర్‌ డ్యామ్‌(మట్టి కట్ట) పనులను ఆ సంస్థకే కట్టబెట్టింది. 2010–11 ఎస్‌ఎస్‌ఆర్‌(స్టాండర్డ్‌ షెడ్యూల్డ్‌ రేట్స్‌)ప్రకారం ఈ పనుల విలువ రూ.842.65 కోట్లే..! 2015–16 ధరల ప్రకారం హెడ్‌ వర్క్స్‌ ధరలను సవరిస్తూ 2016 సెప్టెంబరు 8న ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఈ పనుల విలువ రూ.1332.58 కోట్లుగా ఉంది. ఈసీఆర్‌ఎఫ్, కాఫర్‌ డ్యామ్‌ పనులను ఈ ధరకే చేయడానికి నవయుగ ముందుకొచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. తాజాగా సవరించిన ధరల ప్రకారం ఆ పనుల విలువ రూ.2,800 కోట్లు కావడం గమనార్హం. దీంతోపాటు ధరల సర్దుబాటు, పనుల పరిమాణం పెరిగిందనే సాకుతో అదనంగా బిల్లులు చెల్లించడానికి సర్కారు అంగీకరించడం గమనార్హం.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హెడ్‌ వర్క్స్‌లో ట్రాన్స్‌ట్రాయ్‌(జేవీ) పాత్ర ముగిసింది.

తాజాగా అప్పగించిన పనులతో కలిపితే హెడ్‌ వర్క్స్‌ పనులన్నీ నవయుగకే కట్టబెట్టినట్లయింది. పాత ధరల ప్రకారం చూస్తే.. ఆ సంస్థకు అప్పగించిన పనుల విలువ రూ.3498.12 కోట్లు. కానీ.. తాజా ధరల ప్రకారం ఈ పనుల విలువ రూ.8733.37 కోట్లు. అంటే, పాత ధరల ముసుగులో రూ.5,235.25 కోట్ల మేర కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చినట్లయింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) గెజిట్‌ నోటిఫికేషన్‌లో సెక్షన్‌ 9(1)ను తుంగలో తొక్కుతూ దొడ్డిదారిన పనులు అప్పగించిన ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు భారీ ఎత్తున ముడుపులు ముట్టాయని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక రూ.5,358.23 కోట్ల విలువైన పోలవరం జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులనూ టెండర్‌ నిబంధనలను బుట్టదాఖలు చేస్తూ ఇదే కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడంలో లోగుట్టు ఏమిటన్నది బహిరంగ రహస్యమే.  

మరిన్ని వార్తలు